తెలంగాణ రాష్ట్రంలో ఎవరికీ కరోనా వైరస్ సోకలేదని ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. తెలంగాణలో ఉన్నవారికి ఇప్పటివరకూ ఎవరికీ వైరస్ సోకలేదన్నారు. అలాగే కరోనా పేషెంట్లు కాంటాక్ట్ అయిన వారిలో ఎవరికీ వైరస్ సోకలేదని చెప్పారు. కరోనా కట్టడికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 5కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు ఉండగా, విదేశాల నుంచి వచ్చిన వారే కరోనా బారిన పడ్డారని అన్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అన్ని రాష్ట్రాల కంటే ముందే నియంత్రణా చర్యలు చేపట్టామని ఈటల తెలిపారు.
తొలి కరోనా పేషంట్ 88మందితో కాంటాక్ట్ అయ్యాడని, కానీ, ఎవరికీ కూడా కరోనా సోకలేదని స్పష్టం చేశారు. ఇటలీ నుంచి వచ్చిన రెండో కరోనా పేషెంట్ 42మందితో కాంటాక్ట్ అయింది. మూడో కరోనా పేషంట్ 69మందితో కాంటాక్ట్ అయింది. నాలుగో కరోనా పేషంట్ 11 మందితో కాంటాక్ట్ అయ్యాడని చెప్పారు. నిన్న ఇండోనేషియా నుంచి వచ్చిన ఐదో కరోనా పేషంట్ 11 మందిని కలిసినట్టు గుర్తించామన్నారు. కరోనా సోకిన ఇద్దరిని సఫ్దర్ జంగ్ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. కరోనా వస్తే చనిపోతారని ప్రజలు ఆందోళన చెందవద్దని ఈటల సూచించారు. మాంసం తింటే కరోనా వస్తుందని తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు.
లక్షా 60వేల మందికి వైరస్ సోకితే 6వేల మంది చనిపోయారని, ఈ విషయంలో ప్రజలు ఆందోళన పడొద్దని సూచించారు. తెలంగాణలో వైరాలజీ ల్యాబ్ లు ఉన్నాయని, ఇకపై కరోనా నిర్ధారణకు పుణె వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పారు. ఫంక్షన్లకు 200 మంది కంటే ఎక్కువ మందిని ఆహ్వానించొద్దని చెప్పారు. సాధ్యమైనంత వరకు సమూహాలుగా ఉండక పోవడం మంచిదని పలు సూచనలు చేశారు. కరోనా నియంత్రణకు నిరంతరం శ్రమిస్తున్నామని, విదేశాల నుంచి వచ్చిన వారికే కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు గుర్తించినట్టు ఈటల స్పష్టం చేశారు. కరోనా బాధితులను నేరుగా క్వారంటైన్ చేస్తున్నామని అన్నారు. క్వారంటైన్ లో ఉన్నవారిలో కరోనా లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రికి తరలిస్తామని చెప్పారు.
చైనా, ఇరాన్, ఇటలీ, కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, స్పెయిన్ నుంచి వచ్చే ప్రయాణికులను 14 రోజుల పాటు క్వారంటైన్ చేయ్యాలని నిర్ణయించినట్టు తెలిపారు. క్వారంటైన్ లో ఉన్న వాళ్లకు కరోనా వైరస్ ఉన్నట్టు కాదని, కరోనా టెస్టుల కోసం తెలంగాణలో ఆరు ల్యాబ్ లు సిద్ధం చేసినట్టు చెప్పారు. హైదరాబాద్ లోనే కరోనా పాజిటివ్ ఫైనల్ రిపోర్టు ఉంటుందని ఈటల పేర్కొన్నారు. దయచేసి ప్రజలెవరూ షేక్ హ్యాండ్ ఇవ్వొద్దని, సెల్ఫ్ నియంత్రణ చేసుకుంటే 100 శాతం కరోనా వైరస్ కంట్రోల్ అవుతుందని ఈటల సూచించారు.