అసలు కారణం ఇదే : మీ Hair తెల్లగా మారుతోందా?

  • Publish Date - January 23, 2020 / 05:49 AM IST

ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో మానవ జీవనశైలిలో ఎన్నో మార్పులు సంభవించాయి. లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేవరకు అంతా ఉరుకులపరుగుల జీవితం. క్షణం కూడా తీరకలేని పరిస్థితి. వ్యాయమాలు, శారీరక శ్రమ తగినంతగా లేకపోవడం, ఆహారపు అలవాట్లు వంటి ఎన్నో కారణాలతో ఆరోగ్య సమస్యలకు దారితీస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిలో తలపై జుట్టు తెల్లగా మారిపోతోంది. మరికొంతమందిలో బూడిద రంగు (Grey)లోకి మారిపోతోంది. సాధారణంగా ఎవరికైనా జట్టు తెల్లబడటం లేదా మరి ఏదైనా లక్షణాలను జెనిటిక్ (వంశపార్యపరంగా) కూడా వస్తాయని చెబుతుంటారు.

కొంతమందిలో జీవన శైలి, ఆహరపు ఆలవాట్ల కారణంగా కూడా జట్టు రాలిపోవడం, తెల్లబడటం వంటి పలు సమస్యలు వస్తున్నాయి. చిన్న వయస్సులోనే ఎక్కువమందికి జుట్టు పరమైన సమస్యలు అధికంగా ఉన్నట్టు ఎన్నో పరిశోధనలు తేల్చేశాయి. అందులో ప్రధానంగా.. ఒత్తిడి (Stress) కారణంగా ఎక్కువ మందిలో జుట్టు తెల్లబడటం లేదా బూడిద రంగులోకి మారిపోతున్నట్టు సైంటిస్టులు చెబుతున్నారు.

హార్వార్డ్ యూనివర్శిటీకి చెందిన బయాలజీ ప్రొఫెసర్ యా-చియె హ్సు దీనిపై లోతుగా అధ్యయనం జరిపారు. హార్వార్డ్ స్టీమ్ సెల్ ఇన్సిస్ట్యూట్ ఆధ్వర్యంలో జుట్టు ఎందుకు బూడిద రంగులోకి మారుతుందో పరిశోధనలు చేశారు. ఇందులో ఆమె ఒత్తిడి కారణంగానే ఎక్కువ శాతం జుట్టు బూడిద రంగులోకి మారుతున్నట్టు గుర్తించినట్టు ఆమె వెల్లడించారు.

ఒత్తిడే ప్రధాన కారణం :
ఒత్తిడికి జుట్టు గ్రే కలర్లోకి మారడానికి మధ్య సంబంధం ఉందని ఆమె తేల్చేశారు. సాధారణంగా జంతువుల్లోనూ జట్టు బూడిద రంగులోకి మారడానికి వాటిలోని ఒత్తిడే ప్రధాన కారణమని ఎన్నో అధ్యయనాలు తేల్చేశాయి. కానీ, మొదటిసారి హ్సు తన సహచర సైంటిస్టులతో కలిసి బయోలాజికల్ రీజన్ కనిపెట్టారు.. హెయిర్ పిగ్మెంట్ మారిపోవడానికి ఒత్తిడి ఎందుకు కారణం అనే అంశంపై వీరంతా లోతుగా అధ్యయనం చేసి నిరూపించారు. ఈ అధ్యయాన్ని నేచర్ అనే జనరల్ లో ప్రచురించారు. సింపాథిటిక్ నాడీ వ్యవస్థ (సహానుభూత నాడి వ్యవస్థ)తో హ్సు తన పరిశోధక బృందంతో మొదలు పెట్టారు.

కలర్ ఫోలికల్ హార్మోన్‌పై ప్రభావం :
ఇందులో మానవ శరీరంలోని రోజువారీ ప్రక్రియలో హార్ట్ రేటు, శ్వాస తీసుకోవడం, జీర్ణ వ్యవస్థ, సూక్ష్మజీవులతో ఎలా పోరాడుతుందనే దానిపై కూడా పరిశోధించారు. తమ పరిశోధనలో భాగంగా ముందుగా హ్సు బృందం.. ఒత్తిడి కారణంగానే హెయిర్ గ్రే గా మారిపోతుందా? అనేదానిపై ఫోకస్ పెట్టింది. శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుందని గుర్తించారు. ఒత్తిడి కారణంగా విడుదలైన కొన్ని కణాలు హెయిర్ కలర్ ఉత్పత్తి చేసే ఫోలికల్ హార్మోన్ పై దాడి చేస్తుందని తేల్చేచారు. అడ్రినల్ గ్రంధి నుంచి విడుదలయ్యే కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్ కూడా దీనికి కారణమై ఉంటుందని పేర్కొన్నారు.