Amit Shah: నేడు తెలంగాణలో అమిత్ షా పర్యటన.. మునుగోడు సభకు హాజరు.. షెడ్యూల్ ఇదే..
కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. త్వరలో ఉప ఎన్నిక జరగబోతున్న మునుగోడులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు.
- Narender Thiru
- Published On : August 21, 2022 / 09:09 AM IST
Amit Shah: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటించనున్నారు. మునుగోడులో బీజేపీ ఆధ్వర్యంలో జరిగే ఆత్మగౌరవ సభలో ఆయన పాల్గొంటారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరుతారు. మధ్యాహ్నం రెండు గంటలకు అమిత్ షా బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
అక్కడ్నుంచి నేరుగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్తారు. మధ్యాహ్నం 2.10 గంటలకు అమ్మవారిని దర్శించుకుంటారు. 2.40 గంటలకు సికింద్రాబాద్, సాంబమూర్తి నగర్‌లోని బీజేపీ కార్యకర్త ఎన్.సత్యనారాయణ ఇంటికి వెళ్తారు. అనంతరం 3.20 గంటలకు రమదా మనోహర్ హోటల్‌కు చేరుకుంటారు. అక్కడ సాయంత్రం నాలుగు గంటల వరకు రైతు నేతలతో సమావేశమవుతారు. తర్వాత అక్కడ్నుంచి బయలుదేరి బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు వెళ్తారు. 4.10 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరి హెలికాప్టర్ ద్వారా సాయంత్రం 4.30కి మునుగోడు చేరుకుంటారు. సాయంత్రం 4.40 నుంచి 4.55 వరకు సీఆర్‌పీఎఫ్ అధికారులతో సమీక్ష జరుపుతారు.
సాయంత్రం 5.00 గంటలకు మునుగోడులో జరిగే బీజేపీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలోనే, అమిత్ షా సమక్షంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరుతారు. సభ జరిగిన తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు శంషాబాద్‌లోని నోవాటెల్ హోటల్ చేరుకుంటారు. మునుగోడు సభ కోసం బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. దాదాపు 70 ఎకరాల్లో సభ నిర్వహించబోతున్నారు. మూడు లక్షల మంది హాజరవుతారని అంచనా.
