తెలుగు ప్రజల ఎమోషన్ ఆంధ్రా బ్యాంకు.. ఇక కనిపించదు

  • Published By: vamsi ,Published On : August 31, 2019 / 02:42 AM IST
తెలుగు ప్రజల ఎమోషన్ ఆంధ్రా బ్యాంకు.. ఇక కనిపించదు

Updated On : August 31, 2019 / 2:42 AM IST

తెలుగు ప్రజలకు ఆంధ్రా బ్యాంకు అంటే ఒక ఎమోషన్. ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు నేలపై ఆవిర్భవించిన తొలి బ్యాంకు ఆంధ్రా బ్యాంకు కాగా కోట్లాది మంది తెలుగు ప్రజలకు ఈ బ్యాంకుతో ఉన్న అనుబంధమే వేరు. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలు, పట్టణాలు, మూరుమూల పల్లెల్లో సైతం కనిపించే ఆంధ్రా బ్యాంకుతో తెలుగు ప్రజలకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇప్పటికి కూడా ఊర్లలో రైతులు, వ్యాపారులు లోన్లు తెచ్చుకోవాలంటే.. డబ్బులు డిపాజిట్ చేసుకోవాలంటే ఈ బ్యాంకు తప్ప మరో బ్యాంకు తెలియదు. అయితే ఎన్నో ఏళ్లుగా ముడిపడి ఉన్న ఎమోషన్ ఇక తెగిపోనుంది. ఆంధ్రా బ్యాంకు ఇక కనిపించదు.

ఆర్థికమాంద్యం ఛాయలు పెరిగిపోతున్న సమయంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనాల్లో భాగంగా దీనిని యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ) లో విలీనం చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల పనితీరు మెరుగుపరచడం, ద్రవ్యలభ్యతను పెంచడం, నిరర్థక ఆస్తులను తగ్గించడం, రుణ వితరణ సామర్థ్యం పెంచడం లక్ష్యంగా పెట్టుకుని బ్యాంకుల విలీనం ప్రక్రియను కేంద్రం చేపట్టింది. ఆరు నెలల నుంచి ఏడాది లోపు ఈ ప్రక్రియ ముగిసే అవకాశం కనిపిస్తుంది.

ఇప్పటికే కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేసిన కేంద్రం, ఇప్పుడు మరో 10 బ్యాంక్ లను విలీనం చేసింది. యూనియన్, కార్పొరేషన్, కెనెరా, ఆంధ్రా బ్యాంకు, యునైటెడ్, ఓబీసీ, సిండికేట్, పీఎన్‌బీ, ఇండియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంకులను కలిపి నాలుగు పెద్ద బ్యాంకులుగా మారుస్తున్నారు. పంజాబ్ నేషనల్‌ బ్యాంకులో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను విలీనం చేసింది ప్రభుత్వం.

యూనియన్, ఆంధ్రా, కార్పొరేషన్ బ్యాంకులను కలిపి ఒకే బ్యాంకుగా మారుస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఇండియన్ బ్యాంకులో అలహాబాద్‌ బ్యాంక్‌ను విలీనం చేయగా, కార్పొరేషన్ బ్యాంకులో సిండికేట్ బ్యాంకును కలిపేశారు. ఇప్పటివరకు మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండగా.. విలీనం ప్రక్రియతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12కు తగ్గిపోయింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఓబీసీ, యునైటెడ్ బ్యాంక్‌ల ను కలిపేయడం ద్వారా దేశంలో రెండో అతిపెద్ద బ్యాంకుగా ఇది అవతరించనుంది.

ఇక తెలుగువారికి ఎమోషనల్ గా అటాచ్ అయిన ఆంధ్రా బ్యాంకు పుట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలోనే.  1923 నవంబరు 20న ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, మేధావి, బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన భోగరాజు పట్టాభి సీతారామయ్య ఆంధ్రా బ్యాంకును స్థాపించారు. 1980 నాటికి ఆంధ్రా బ్యాంకు దేశంలోని ముఖ్యమైన ప్రైవేటు బ్యాంకుల్లో ఒకటిగా నిలిచింది. ప్రభుత్వం 1969లో ఒక దఫా, 1980లో రెండో దఫా బ్యాంకులను జాతీయం చేసింది. ఈ క్రమంలోనే ఆంధ్రా బ్యాంకు 1980లో జాతీయం అయింది. అక్కడి నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఎదిగింది.

ఎంత ఘనచరిత్ర ఉంటే ఏంటీ? వ్యాపారం కరెక్ట్ గా చేయకుంటే పడే ఇబ్బందులు వేరు కదా? ఈ క్రమంలోనే ఆంధ్రా బ్యాంకు కొన్నేళ్లుగా నష్టాలు చవిచూస్తుంది. కార్పొరేట్‌ కంపెనీలకు ఇష్టానుసారం రుణాలు ఇవ్వడం.. అందులో కొన్ని వసూలు కాకపోవటం కారణంగా బ్యాంకుపై భారం పెరిగిపోయింది. ఆంధ్రా బ్యాంకు ఇచ్చిన అసలు, దానిపై వడ్డీ కలిపి రూ.5,000 కోట్లకు పైగా వసూలు కావలసి ఉండగా, ఆ సొమ్ము రాక బ్యాంకు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతుంది. ఈ క్రమంలోనే ఆంధ్రాబ్యాంకు విలీనం ప్రక్రియ చేపట్టింది కేంద్రం.