సెల్యూట్ : కవాతు చేసిన అంధ విద్యార్థులు

  • Published By: madhu ,Published On : January 26, 2019 / 03:06 PM IST
సెల్యూట్ : కవాతు చేసిన అంధ విద్యార్థులు

Updated On : January 26, 2019 / 3:06 PM IST

హైదరాబాద్ : కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించారు అంధ విద్యార్థులు. గణతంత్ర వేడుకలలో అంధుల మార్చ్‌ ఫాస్ట్‌లో పాల్గొని అబ్బుర పరిచారు. కవాతు చేసి అందరితో వహ్వా అనిపించారు. గవర్నర్‌ చేతులు మీదుగా బహుమతి కూడా అందుకున్నారు. అంధులు.. పక్కన ఒక తోడు లేనిదే అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. కళ్లు కనిపించకపోయినా.. చీకట్లను గెలవాలన్న తపనే వారిని ముందుకు నడిపించింది. భారత సైనికులతో కలిసి కవాతు చేయాలన్న వీరి కోరిక నెరవేరింది.  

జీవ నేత్రాలయ స్టూడెంట్స్ : 
తెలంగాణ గణతంత్ర వేడుకల్లో ఈ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన అంధ విద్యార్ధులు తమ వైకల్యాన్ని పక్కన పెట్టి సైనికులతో కలిసి అడుగేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సైనికులతో పాటు పరేడ్‌లో పాల్గొని అందరిని అబ్బుర పరిచారు. విద్యార్థులంతా.. చినజియర్‌ స్వామి ఆధ్వర్యంలో నడిచే జీవ నేత్రాలయ విద్యాసంస్థకి చెందిన వారు.. దాదాపు 200 మంది విద్యార్థులకు శంషాబాద్‌లోని ఈ విద్యాసంస్థ ఉచిత విద్య, హాస్టల్‌ వసతి కల్పిస్తోంది. ఆ సంస్థలోని 50 మంది విద్యార్ధులు.. పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన మార్చ్‌ ఫాస్ట్‌లో పాల్గొని అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ బృందానికి అంజమ్మ నేతృత్వం వహించింది. 

టి.సర్కార్ అవకాశం : 
గతేడాది ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో శంషాబాద్ లోని ఓ కాలనీలో 35 మంది స్టూడెంట్స్ పరేడ్ చేశారు. ఇది చూసిన కాలనీ వాసులు ఈ విద్యార్ధులను అభినందించి… వారి ప్రయత్నాన్ని ఇంతటితో ఆపవద్దని ప్రోత్సహించారు. విద్యార్థులు పరేడ్‌ చేసిన విజువల్స్‌ని PMOకి పంపారు. అంధ విద్యార్థుల ప్రతిభను, పట్టుదలను చూసిన పీఎంవో అధికారులు… జీవనేత్రాలయ విద్యాసంస్థని అభినందించారు. అక్కడ వీరి పరేడ్‌ చూసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. అంధ విద్యార్థులకు.. గణతంత్ర వేడుకల పరేడ్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చింది. పట్టుదలతో కృషి చేస్తే ఎంతటి కష్టమైనా పనైనా అవలీలగా చేసేయొచ్చు అని నిరూపించారు ఈ విద్యార్థులు. ఈ విద్యార్థులకు సెల్యూట్‌ చేద్దాం..