పోలీస్ స్టేషన్లలో పేరుకుపోయిన కేసులు : ఎన్నికల ప్రభావం

  • Published By: veegamteam ,Published On : April 14, 2019 / 01:42 PM IST
పోలీస్ స్టేషన్లలో పేరుకుపోయిన కేసులు : ఎన్నికల ప్రభావం

Updated On : April 14, 2019 / 1:42 PM IST

ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. ఎన్నికల్లో లా అండ్ ఆర్డర్ కాపాడేందుకు పోలీసులు సర్వశక్తులొడ్డారు. కంటి మీద కునుకు లేకుండా తమ కర్తవ్యాన్ని నిర్వహించారు. అయితే పోలీసులు బందోబస్తులు, భద్రతలలో బిజీగా ఉండటంతో…  వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు పేరుకుపోయాయి. దీంతో మరోసారి నయా సవాల్‌తో పోలీసులు రెడీ అవుతున్నారు.

లోక్ సభ ఎన్నికలలో బందోబస్తు, వరుస తనిఖీలతో పోలీస్‌ అధికారులు, సిబ్బంది నిత్యం బిజీగా గడిపారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా డబ్బు, మద్యం సరఫరా, అల్లర్లు, గొడవల నియంత్రణకే సమయం వెచ్చించారు. అయితే ఎన్నికల సమయంలో నమోదైన పలు కేసులు పోలీసులకు తలకుమించిన భారంగా మారింది.  

లోక్ సభ ఎన్నికల వేల రౌడిషీటర్లను బైండోవర్లు చేయడం, వెపన్స్ డిపాజిట్, రౌడీషీటర్లకు కౌన్సిలింగ్,  సున్నితమైన ప్రాంతాల్లో పహారా కాయడం, పారామిలిటరీ బలగాలతో సమన్వయం చేసుకోవడంతోనే రోజువారీ కార్యక్రమాలు ముగిసిపోయాయి.ఈ సమయంలో రోజూ పోలీస్ స్టేషన్‌లో నమోదయ్యే కేసులపై అధికారులు దృష్టి సారించలేకపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 

చిన్న స్థాయిలోని పెట్టీ కేసుల నుంచి పెద్ద పెద్ద కేసుల దర్యాప్తు, దోపిడీ కేసుల దర్యాప్తు నత్తనడకన సాగుతోంది. అధికారులు దర్యాప్తు చేయాలనుకున్నా తగినంత సమయం లేకపోవడంతో కేసుల దర్యాప్తు పెండింగ్‌లో పడుతోందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటివరకు చిన్నా, పెద్ద కేసులు మొత్తం కలిపి హైదరాబాద్ లో 94 కేసులు పెండింగ్‌లో పడడంతో …పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత పోలీసులపై అదనపు భారం పడినట్లయింది. 

ప్రతిరోజూ హైదరాబాద్ లో సుమారు 15 నుంచి 25 కేసులు సగటున నమోదవుతున్నాయి. వీటితో పాటు లోక్ సభ ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కింద సిఫారస్‌ అయిన కేసులు, హవాలా కేసులు నమోదయ్యాయి. దీంతో ఎలా అయినా సాధ్యమయినంత త్వరగా ఈ కేసులన్నిటినీ  పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవడానికి పోలీసు అధికారులు రెడీ అవుతున్నారు.