బీ అలర్ట్: హైదరాబాద్ గాంధీలో కరోనా కలకలం

  • Published By: veegamteam ,Published On : March 2, 2020 / 01:29 AM IST
బీ అలర్ట్: హైదరాబాద్ గాంధీలో కరోనా కలకలం

Updated On : March 2, 2020 / 1:29 AM IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. హైదరాబాద్ లోనూ భయాందోళనకు గురి చేస్తోంది. హైదరాబాద్ లో కరోనా వైరస్ కలకలం రేగింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న ఇద్దరు వ్యక్తులకు కరోనా వైరస్ ఉందని అనుమానిస్తున్నారు. వీరు ఆదివారం (మార్చి 1, 2020)న గాంధీ ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చేరారు. వీరికి ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అనుమానితుల నుంచి సాంపుల్స్ సేకరించి.. నిర్ధారణ కోసం గాంధీ మెడికల్‌ కాలేజీ మైక్రోబయోలజీ విభాగంలోని వైరాలజీ ల్యాబ్‌ కు పంపించామని గాంధీ ఆస్పత్రి నోడల్‌ అధికారి ప్రభాకర్‌ రెడ్డి తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి రిపోర్ట్ సోమవారం (మార్చి 2, 2020)న వస్తుందని డాక్టర్లు చెప్పారు.స్వైన్ ఫ్లూ, కరోనా వైరస్ లక్షణాలు ఒకేలా ఉన్నప్పటికీ… ఎవరికైనా జ్వరం, జలుబు, శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉన్నా.. గొంతు నొప్పి లాంటి ఇబ్బందులున్నా.. తప్పనిసరిగా డాక్టర్లను సంప్రదించాలని కోరారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు అనుమానిత కేసులు నమోదు కాలేదు. అయితే తిరుపతిలోని ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో కరోనా వైరస్ లక్షణాలతో ఓ వ్యక్తి చికిత్స చేయించుకునేందుకు చేరడం కలకలం సృష్టించింది. చైనాకు చెందిన ఒక టెక్నీషియన్ ప్రైవేటు ఫ్యాక్టరీలో మరమ్మత్తులు చేసేందుకు ఇండియాకు వచ్చాడు. ఆ వ్యక్తికి రెండు రోజులుగా తీవ్ర జలుబు, దగ్గు ఉంది. అతను రుయా ఆసుపత్రిలో చేరగా.. యువకుడి రక్తనమూనాలను సేకరించి ల్యాబొరేటరీకి పంపారు. రెండురోజుల్లో అతనికి కరోనా ఉందా? లేదా? అనే విషయం డాక్టర్లు తేల్చనున్నారు.