అక్రమాలు ఇప్పుడే గుర్తొచ్చాయా : లక్షన్నర మందికి GHMC షాక్

  • Published By: veegamteam ,Published On : March 10, 2019 / 04:51 AM IST
అక్రమాలు ఇప్పుడే గుర్తొచ్చాయా : లక్షన్నర మందికి GHMC షాక్

హైదరాబాద్ : GHMC ఖజానా ఖాళీ అయ్యింది. దీంతో అయ్యవార్లకు నగరంలో అక్రమ నిర్మాణాల కట్టడాలు ఒక్కసారిగా గుర్తుకొచ్చేసాయి. ఇళ్ల యజమానులపై పడిపోయారు. పర్మిషన్ ఇచ్చినప్పుడు లేని అక్రమాలు ఇప్పుడు గుర్తుకొచ్చాయి. రాజధానిలోని 1.50 లక్షల కుటుంబాలను హైదరాబాద్‌ మహానగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తోంది. ‘మా ఇంటిని క్రమబద్ధీకరించండి’ అని దరఖాస్తు చేసిన యజమానుల ఇళ్లకు.. మూడేళ్లుగా అదనపు నిర్మాణానికి పన్ను వసూలు చేస్తోంది. ఈ క్రమంవలో ఒక్కోదానికి 200 శాతం జరిమానా కింద రూ.50,000 నుంచి రూ.రెండు లక్షల వరకు పన్ను చెల్లించాలని ఇళ్ల యజమానుల పీకపై కూర్చుంది.

దీని కోసం  నోటీసులు జారీ చేయటంతో..లక్షలాది సొంత ఇంటిదారులు తల్లడిల్లుపోతున్నారు. ఒక్కసారిగా రూ.లక్షల్లో పన్నులను ఎలా చెల్లించగలమంటున్నారు. దీనికి ‘అక్రమ భవన నిర్మాణం’ కారణం కాబట్టి- పన్ను చెల్లించక తప్పదని..అదీకూడా  రెండున్నరేళ్ల నుంచి కట్టాల్సిందేనని అధికారులు తెగేసి చెబుతున్నారు. దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు జీహెచ్ ఎంసీపై ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నారు.

హైదరాబాద్‌ నగరంలో 2007లో భవన నిర్మాణ క్రమబద్ధీకరణ పథకం (బీపీఎస్‌) కింద దాదాపు రెండు లక్షల ఇళ్లను క్రమబద్ధీకరించారు. 2015లో మరోసారి బీపీఎస్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో 1.50 లక్షలమంది ఇళ్ల యజమానులు దరఖాస్తు చేశారు. దీనిపై కొంతమంది హైకోర్టును ఆశ్రయించడంతో ‘అప్లికేషన్స్  పరిశీలన చేసుకోవచ్చు కానీ..క్రమబద్ధీకరణ ప్రక్రియను తిరిగి ఆదేశాలు జారీచేసేవరకు చేపట్టడానికి వీలులేదు’ అని ఆదేశించింది. అధికారులు చాలావరకు దరఖాస్తుల పరిశీలనను కూడా  పూర్తిచేశారు. ఈలోపు బల్దియా అధికారుల మదిలో కొత్త ఆలోచన మొదలైంది.

రెవెన్యూ విభాగంవారు బీపీఎస్‌ దరఖాస్తుదారుల వివరాలను..అందులో భవనం ఎన్ని అడుగుల్లో నిర్మించారన్న లెక్కలను తీసుకొన్నారు. రెండున్నరేళ్లకు అదీ 200 శాతం జరిమానాతో ప్రతి భవనానికీ పన్నును నిర్థారించడంతో, ఒక్కో భవన యజమాని గరిష్ఠంగా రూ.రెండు లక్షల వరకు ఒకేసారి చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అదికూడా మార్చి నెలాఖరులోగా పూర్తి మొత్తం  చెల్లించకపోతే- ఇంటికి ఉన్న కరెంట్‌, వాటర్..డ్రైనేజీ వంటి సౌకర్యాలు కట్ చేస్తామంటు హెచ్చరిస్తున్నారు.

ఖజానాలో డబ్బులు లేవని:
జీహెచ్‌ఎంసీ ప్రతి నెలా వసూలు చేస్తున్న ఇంటి పన్ను ఆధారంగానే పనులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో  ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకునేందుకు..జీహెచ్ ఎంసీ అధికారులు  గత రెండు నెలలుగా సొంతఇంటిదారులపై దాడికి తెగపడుతున్నారు. బీపీఎస్‌ దరఖాస్తుల దుమ్ముదులిపి.. నోటీసులు పంపుతున్నారు. ‘ఇప్పుడు అక్రమ నిర్మాణమని మా దరఖాస్తు ఆధారంగా భావించి..రెండొందల శాతం జరిమానా వేస్తున్నారనీ..కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాత..భవనం రూల్ ప్రకారమే ఉందన్న తరువాత రెండున్నరేళ్లకు తాము పన్ను కట్టిన తరువాత కోర్డు అనుమతి తమకు అనుకూలంగా వస్తే..తమ డబ్బు తమకు తిరిగి ఇచ్చేస్తారా’ అని పలువురు నిలదీస్తుంటే దానికి మాత్రం అధికారుల నుంచి సమాధానం రావటంలేదు.