మహా తుఫాన్ : తెలంగాణకు వర్ష సూచన

అరేబియా సముద్రంలో ఏర్పడిన తుఫాను రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో (నవంబర్ 4, 2019) ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి వచ్చే రెండు మూడు రోజుల్లో బంగాళాఖాతంలో వాయుగుండంగా మారవచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో తెలంగాణలో ఆదివారం (నవంబర్ 3, 2019) అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.
క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాజధాని హైదరాబాద్‌లో రానున్న 36 గంటల్లో వర్షాలు కురిసే అవకాశముంది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
ఇక నిన్న హైదరాబాద్‌లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిని దాటి నమోదయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలుగా నమోదుకాగా.. కనిష్ట ఉష్ణోగ్రత 22.5 డిగ్రీల సెల్సియస్ రికార్డైంది. గాలిలో తేమ 55 శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు.