ఎవరిని ముంచబోతున్నారు : దేశవ్యాప్తంగా MIM పోటీ

  • Published By: chvmurthy ,Published On : January 21, 2019 / 07:45 AM IST
ఎవరిని ముంచబోతున్నారు : దేశవ్యాప్తంగా MIM పోటీ

హైదరాబాద్ మహా నగరంలో పాతబస్తీ కేంద్రంగా తిరుగులేని రాజకీయ శక్తిగా వున్న ఎంఐఎం పార్టీ దేశంలోని వివిధ ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో తన బలాన్ని పెంచుకునేందుకు ప్రణాళికలు రూపోందిస్తోంది. అందులో భాగంగా త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ఏపీతో సహా ఇతర రాష్ట్రాల్లోనూ పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోంది. అందుకోసం ఏఏ నియోజకవర్గాల్లో పోటీ చేయాలనే దానిపై ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించి ఎన్నికల నాటికి ఒక ప్రకటన చేయాలని చూస్తోంది.
తెలగాణాలో ఎంఐఎం
తెలంగాణలో ఎంఐఎం, అధికార టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎంఐఎం అధినేత అసదుద్దిన్ ఒవైసీ సన్నిహితంగా మెలుగుతున్నారు. దేశ రాజకీయాలలో గుణాత్మక మార్పులు తీసుకురావాలని భావిస్తున్న కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్నారు. దానికి ఎంఐఎం తన సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా ఏపీ రాజకీయాలలో అడుగుపెడతామని అసదుద్దీన్ బహిరంగంగా ప్రకటించిన నేపధ్యంలో ఏపీలొ జరిగే ఎన్నికల్లో ఎంఐఎం తమకు బలమున్న స్థానాల్లో పోటీ చేసే అవకాశముంది. అందులో భాగంగానే లోక్ సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా తమకు బలమున్న స్థానాల్లో పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తోంది.ప్రస్తుతం ఎంఐఎంకు తెలంగాణలో 7గురు శాసనసభ్యులున్నారు.1984 నుండి ఇప్పటి వరకు  హైదరాబాద్ లోక్ సభ స్థానంలో ఎంఐఎం విజయం సాధిస్తూ వస్తోంది. 
మహారాష్ట్ర, బీహార్ ల్లో పోటీకీ రెడీ 
2014 లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ లోక్ సభ స్థానంలో పోటీ చేసిన ఎంఐఎం ఈసారి తన వ్యూహాన్ని మార్చింది. మహారాష్ట్ర,బీహార్ రాష్ట్రాల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్,బీహార్ లోని కిషన్ గంజ్ లోక్ సభ స్థానాల్లో పొటీ చేయాలనుకుంటోంది. మహారాష్ట్రలో ప్రకాష్ అంబేద్కర్ తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది. మహారాష్ట్రలొఇద్దరు శాసన సభ్యులున్నారు, ఒక లోక్ సభ సభ్యుడున్నారు. ఇప్పుడున్న బలాన్ని మరింత పెంచుకోవాలని ఎంఐఎం భావిస్తోంది. ఎంఐఎం పోటీ చేయాలనుకుంటున్న ఔరంగాబాద్,కిషన్ గంజ్ నియోజకవర్గాల్లో ముస్లింలు అధిక సంఖ్యలొ వున్నారు. అలాగే మహారాష్ట్రలోని మరఠ్వాడ ప్రాంతం ఒకప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలో భాగంగా వుండేది. ఈప్రాంతాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో  వుంటారు. అందువలన ఇక్కడ ఎంఐఎం పార్టీ నిర్మాణాత్మకంగా  తమ బలాన్ని పెంచుకునేందకు ప్రయత్నిస్తుంది.
ముస్లిం ప్రాబల్యం ఉన్నప్రాంతాలపై దృష్టి
దేశంలొని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో ఎంఐఎం  పోటీ చేయడం ద్వారా జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగేందుకు అసదుద్దీన్ ఒవైసీ ప్రయత్నిస్తున్నారు. మరో వైపు ఎంఐఎం దేశంలొని వివిధ ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో పోటీ చేయడం ద్వారా బిజేపీ వ్యతిరేక ఓటు బ్యాంకుకు గండి పడుతుందనే భావన రాజకీయ వర్గాల్లో వుంది. కేవలం హైదరాబాద్ లోక్ సభ స్థానానికి పరిమితమై వున్న ఎంఐఎం వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు తెలుపుతూనే ఇతర రాష్ట్రాల్లో పోటీ చేయడం ద్వారా ఒక బలమైన శక్తిగా ఎదగాలని ఎంఐఎం భావిస్తోంది.