తెలంగాణ నూతన సచివాలయం ఇదే.. ఫొటో విడుదల చేసిన ప్రభుత్వం

తెలంగాణ సచివాలయ భవన కూల్చివేత పనులు సోమవారం (జులై6,2020) నుంచి కొనసాగుతున్నాయి. కొత్త సెక్రటేరియట్ కట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం పట్టు నెరవేర్చుకుంది. దీంట్లో భాగంగా ఇప్పటికే రెడీ అయిన తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ఫోటోను ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సచివాలయం భవన నమూనాను ఖరారు చేసింది. దీనికి సంబంధించిన నమూనా ఫొటోను సీఎం కార్యాలయం తాజాగా విడుదల చేసింది. దీనికి సీఎం కేసీఆర్ త్వరలోనే ఆమోద ముద్ర వేయనున్నారు.
చూడడానికి రాజప్రాసాదంలా ఠీవీగా కనిపిస్తున్న ఈ నమూనా ఆకట్టుకునేలా ఉంది. భవనం ముందున్న నీటి కొలనులో భవనం ప్రతిబింబిస్తూ ఠీవీగా రాజప్రసాదంలా వెలిగిపోతోంది. నూతన సచివాలయాన్ని నిర్మించాలని ప్రభుత్వం ఎప్పటి నుంచో అనుకుంటున్నా కోర్టు కేసుల కారణంగా ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ప్రభుత్వం పట్టుపట్టి అనుకున్నది సాధించే దిశగా అడుగులు వేసింది. దీంట్లో భాగంగా పాత భవనం కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ ఉదయం భవనం కూల్చివేత పనులను ప్రభుత్వం ప్రారంభించింది. దీంతో తెలంగాణలో కొత్త సచివాలయం రూపుదిద్దుకోవటం అతి త్వరలో ప్రారంభం కానుంది.