ఆర్టీసీ సమ్మెపై హైపవర్ కమిటీకి నో చెప్పిన ప్రభుత్వం

తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో బుధవారం విచారణ కొనసాగింది. ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెపై విచారణను హైకోర్టు నవంబర్ 18కి వాయిదా వేసింది. రూట్ల ప్రయివేటీకరణపై విచారణను గురువారానికి వాయిదా వేసింది. కార్మికుల సమ్మెపై పరిష్కారానికి సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జిలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తామన్న హైకోర్టు సూచనకు ప్రభుత్వం తిరస్కరించింది.
సమ్మె పరిష్కారానికి హైపవర్ కమిటీ వేయాల్సిందేనంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది రాపోలు ఆనంద భాస్కర్ వాదనలు వినిపించారు. గతంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను ఆయన ప్రస్తావించారు.సమ్మె ప్రారంభమైన నాటినుంచి ఇప్పటి వరకు 27మంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని పిటీషనర్ తరుఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. సమ్మె చట్టవిరుధ్దమని ఏజీ కోర్టుకు విన్నవించారు. ప్రజాప్రయోజన సర్వీసులు ఎస్మాకిందకు వస్తాయని ఏజీ కోర్టుకు తెలిపారు .
ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఆర్టీసీ సమ్మె చట్టవిరుద్ధమని తెలిపారు. ఏజీ వ్యాఖ్యలపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ..సమ్మె ఇల్లీగల్ అని ఎలా చెపుతారని ఏజీని ప్రశ్నించింది. ఈసందర్భంగా గత ప్రభుత్వం జారీ చేసీిన జీవోలను ఏజీ ప్రస్తావించారు.