దేశంలోనే నెం.1 బస్టాండ్ నిర్మించనున్న టీఎస్ఆర్టీసీ

హైదరాబాద్‌లో లక్నో తరహా బస్‌స్టేషన్ల నిర్మాణానికి ఆర్టీసీ కార్యాచరణ చేపట్టింది. దేశంలోనే అత్యున్నత ప్రమాణాలతో రూపొందించిన ఈ బస్ స్టేషన్ల తీరుతెన్నులు తెలుసుకునేందుకు తెలంగాణ ఆర్టీసీ అధికారుల బృందం ఇటీవల లక్నోలో పర్యటించి వచ్చింది. అక్కడ నిర్మించిన బస్ స్టేషన్లు, ప్రయాణికులు సదుపాయాలు, వాణిజ్య కార్యకలాపాల ద్వారా అదనపు ఆదాయాన్ని అధికారులు అధ్యయనం చేశారు. నూతన పద్ధతుల్లో నిర్మించిన బస్ స్టేషన్ల ద్వారా యూపీఎస్ ఆర్టీసీ సుమారు రూ.100కోట్ల అదనపు ఆదాయానికి ప్రణాళికలను రూపొందించింది.
పైగా ఈ బస్ స్టేషన్లు ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు అందజేసేవిగా ఉండడంతో గ్రేటర్‌లోనూ అలాంటివే నిర్మించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఫిబ్రవరి మొదటి వారంలో ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ (రెవెన్యూ)పురుషోత్తంతో పాటు, మరో ఇద్దరు అధికారుల బృందం లక్నోలోని ఆలంబాగ్, తదితర బస్ స్టేషన్లను పరిశీలించింది దీనిపై త్వరలో ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నట్లు పురుషోత్తం తెలిపారు.
ఖాళీ స్థలాల్లో బస్ స్టేషన్ల నిర్మాణం
ఆర్టీసీ అధికారుల బృందం నివేదిక ఆధారంగా ఆధునాతన బస్ స్టేషన్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపితే గౌలిగూడలోని మిస్సిసిపీ హాంగర్ కు చెందిన 4.5ఎకరాల స్థలంలో మొట్టమొదట ఆలంబాగ్ తరహా బస్ స్టేషన్ ను నిర్మించాలని ప్రతిపాదిస్తున్నారు. ఇటు మెట్రో స్టేషన్‌కు అటు మహాత్మ గాంధీ బస్‌స్టేషన్‌కు అందుబాటులో ఉండడమే కాకుండా వాణిజ్య కార్యకలాపాలకు కూడా ఈ ప్రాంతం అనుకూలంగా ఉంది.
మరో ప్రాంతమైన జూబ్లీ బస్‌స్టేషన్ సమీపంలో ఉన్న 3.5ఎకారల స్థలంలో కూడా ఇదే విధమైన రైల్వే స్టేషన్, మెట్రో స్టేషన్లను ఈ బస్ స్టేషన్ తో అనుసధానం చేస్తూ స్కైవాక్ ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. అనంతరం ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని పాత ఎండీఆఫీస్ స్థలంలో మెట్టుగూడ, చిలకలగూడ, కాచిగూలలో దశలవారీగా వాణిజ్య సముదాయాలతో కూడిన బస్ స్టేషన్లను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో నిర్మించనున్నారు. వాటిని 35ఏళ్ల వరకు వ్యాపారకుల లీజుకిచ్చి ఏటా రూ.100కోట్ల ఆదాయం ఆర్జించవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ బస్ స్టేషన్లలో మల్లీప్లెక్స్ ధియేటర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్ వంటివి ఉంటాయి.