Haiti : భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ

కరీబియన్ దేశం హైతీలో భారీ భూకంపం సంభవించింది. దేశ పశ్చిమ భాగంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. సెయింట్ లూయిస్ డ్యూ సూడ్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో

Haiti

Haiti : కరీబియన్ దేశం హైతీలో భారీ భూకంపం సంభవించింది. దేశ పశ్చిమ భాగంలో 7.2 తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయి. సెయింట్ లూయిస్ డ్యూ సూడ్ నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూప్రకంపనలతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి వీధుల్లోకి పరుగులు తీశారు. తమ ఇళ్లు కూలిపోతాయనే భయంతో బయటకు వచ్చేశారు. పలు చోట్ల భవనాలు కుప్పకూలడంతో శిథిలాల కింద చిక్కుకుని పలువురు మరణించారు. ఇప్పటివరకు 29మంది చనిపోయినట్టు గుర్తించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

10 కి.మీ. లోతు నుంచి ఈ ప్రకంపనలు వచ్చినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్‌జీఎస్) తెలిపింది. ప్రజలు ఎక్కువగా జీవించే పోర్టౌ ప్రిన్స్‌కు ఇది 150 కి.మీ. దూరంలో ఉందని వివరించింది. భూకంప ప్రభావం దాదాపు అన్ని కరీబియన్ దీవుల్లోనూ కనిపించింది. ”చాలా ఇళ్లు శిథిలం అయ్యాయి. ప్రజలు చనిపోయారు. కొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు” అని అధికారులు తెలిపారు.

కాగా, 2010లోనూ ఈ ప్రాంతంలో విధ్వంసకర భూకంపం సంభవించింది. ఆ సమయంలో అనేక భవనాలు కుప్పకూలాయి. ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. అపార ఆస్తి నష్టం జరిగింది. అందులోంచి ఇప్పుడిప్పుడే ప్రజలు తేరుకుంటున్నారు. ఇంతలోనే మరో శక్తిమంతమైన భూకంపం హైతీని వణికించింది. భారీ భూకంపం రావడంతో అధికారులు తొలుత సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాసేపటి తర్వాత సునామీ హెచ్చరికలను వెనక్కి తీసుకున్నారు.