ఇరాక్ ఆందోళన హింసాత్మకం:34మంది మృతి

  • Publish Date - October 4, 2019 / 04:54 AM IST

గత కొన్ని రోజులుగా ఇరాక్‌ దేశ వ్యాప్తంగా ప్రజలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రధాని అదిల్ అబ్దెల్ మ‌హ్దీకి వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా నిరసనలు చెలరేగాయి. రాజధాని బాగ్దాద్ లో జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారింది. దీంతో నిర‌స‌న‌కారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ప్ర‌ధాని అదిల్ ప్ర‌య‌త్నించారు.రాజకీయ సంక్షోభం సృష్టించవద్దనీ.. శాంతి భ‌ద్ర‌త‌లు నెల‌కొల్పేందుకు స‌హ‌క‌రించాల‌ని ప్ర‌ధాని కోరారు. కానీ సాధ్యం కాలేదు. ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీ పదవి నుంచి తప్పుకునే వరకూ నిరసనలు ఆపేది లేదని తేల్చి చెప్పారు.

ఈ నిరసనల్లో భాగంగా చెలరేగిన అల్ల‌ర్ల‌లో 34 మంది మృతి చెందారు. మ‌రో 1500 మందికిపైగా గాయ‌ప‌డినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వ అవినీతి, నిరుద్యోగం, తాగునీటి సరఫరాలో సమస్యలు వంటి పలు అంశాలతో పాటు విద్యుత్‌ కోతలను వ్యతిరేకిస్తూ మూడు రోజుల నుంచి నిరసనలు కొనసాగిస్తున్నారు ప్రజలు. తమ సమస్యలపై ప్రజలు స్వచ్ఛంధంగా రోడ్లపైకి వేలాదిమంది తరలివచ్చారు. నిరసనలు చేపట్టారు. 

ఎన్ని విధాలుగా నిరసనకారులతో చర్చలు జరపాలని ప్రధాని అదిల్ అబ్దెల్ మహ్దీ యత్నించినా ప్రజలు ఏమాత్రం లెక్కలేయటంలేదు. నిరసనలు ఆపటంలేదు. దీంతో ప్రధాని నిరసనకారులపై పలు ఆంక్షలు విధించారు. అయినా ఏమాత్రం మార్పులేదు. 

బాగ్దాద్ లోని ఇరాక్ దేశ చిహ్నం లిబరేషన్ స్క్వేర్‌ వద్దకు భారీ ర్యాలీగా వెళ్లేందుకు నిరసనకారులు యత్నించారు. భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు, సైనికులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వందల సంఖ్యలో జనం గాయపడ్డారు. 34మంది మృతి చెందారు. గాయపడినవారిని సమీపంలోని హాస్పిటల్స్ కు తరలించి చికిత్సనందిస్తున్నారు. 

ప్రభుత్వం గద్దె దిగేంతవరకు ఆందోళనలు కొనసాగిస్తామని నిరసనకారులు చెబుతున్నారు. మంగళవారం బాగ్దాద్‌లో ప్రారంభమైన నిరసనలు క్రమంగా షియా ప్రాబల్య నగరాలకు వ్యాపించాయి. గురువారం పలు చోట్ల ఆందోళనకారులు, పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది.రోజు రోజుకు నిరసనలు ఉదృతమవ్వటంతో అధికారలు బాగ్దాద్..దక్షిణ నగరం నస్రియాలో కర్ఫ్యూలను విధించారు. దేశంలోని పలు ప్రాంతాలలో ఇంటర్నెట్ సర్వీసులకు కూడా నిలిపివేశారు. 

కాగా శాంతియుతంగా తమ నిరసనను వ్యక్తంచేసుకోవాలని ప్రధాని సూచించారు. వారిపై ఎటువంటి హింసాత్మక చర్యలు తీసుకోవద్దని ప్రధాని పోలీసులకు, భద్రతాదళాలకు ఆదేశించారు.