Giorgio Armani Passed Away: ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ కన్నుమూత.. ఎవరీ అర్మానీ..

ఫ్యాషన్ ప్రపంచంలో ఆయన తనదైన చెరగని ముద్ర వేశారు. ఒక ఐకాన్ గా పేరు ప్రఖ్యాతలు గడించారు.

Giorgio Armani Passed Away: ప్రపంచ ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ కన్నుమూత.. ఎవరీ అర్మానీ..

Updated On : September 4, 2025 / 10:12 PM IST

Giorgio Armani Passed Away: ఇటలీకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జార్జియో అర్మానీ కన్నుమూశారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. వయో సంబంధ సమస్యలతో ఆయన చనిపోయినట్లు అర్మానీ గ్రూప్ తెలిపింది. అర్మానీ.. కింగ్ జార్జియోగా గుర్తింపు పొందారు. మోడర్న్ ఇటాలియన్ స్టైల్‌తో పేరు గడించారు. ఆయన కంపెనీ ఆదాయం ఏడాదికి 2.3 బిలియన్ యూరోలు. అర్మానీ అంత్యక్రియలు ఈ నెల 6 లేదా 7న నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. అర్మానీ బ్రాండ్ వస్త్ర ప్రపంచంలోనే ప్రసిద్ధి పొందింది. ఫ్యాషన్ ప్రపంచంలో అర్మానీ ఒక ఐకాన్.

అర్మానీ ఎంత బెస్ట్ డిజైనర్ అంటే.. తాను డిజైన్ చేసే దుస్తుల్లో ఇటలీ అందాలు ప్రతిబింబించేవి. అంతేకాదు హాలీవుడ్ రెడ్ కార్పెట్లను కొత్త శిఖరాలకు తీసుకెళ్లారు. ఉద్యోగులు, సిబ్బందితో అర్మానీ ఎప్పుడూ గౌరవంగా మెలిగారు. తన ప్రియైన వారి మధ్యలో ఆయన కన్నుమూశారు అని అర్మానీ గ్రూప్ ఒక ప్రకటనలో తెలిపింది.

”ఇది కంపెనీ కాదు. ఒక కుటుంబంలా భావిస్తాం. దార్శనికత, అభిరుచి, అంకితభావంతో కంపెనీని స్థాపించిన వ్యక్తి ఇక లేరనే బాధను జీర్ణించుకోలేకపోతున్నాము. ఆయన నింపిన స్ఫూర్తితో పని చేస్తాము. ఆయన నిర్మించిన కంపెనీని.. ఆయన జ్ఞాపకార్థం, గౌరవం, బాధ్యత, ప్రేమతో ముందుకు తీసుకెళ్లడానికి కట్టుబడి ఉన్నాము” అని అర్మానీ గ్రూప్ వెల్లడించింది.

1934లో ఉత్తర ఇటలీలోని పియాసెంజాలో జననం..

1934లో ఉత్తర ఇటలీలోని పియాసెంజాలో అర్మానీ జన్మించారు. 1957 వరకు ఫ్యాషన్‌పై వృత్తిపరమైన ఆసక్తి చూపించలేదు. మెడిసిన్ చదివారు. ఆ తర్వాత సైన్యంలో చేరారు. అనంతరం మిలాన్‌లోని చరిత్రాత్మక లా రినాస్సెంట్ డిపార్ట్‌మెంట్ స్టోర్‌లో విండో డ్రస్సర్‌గా ఉద్యోగం పొందారు. అలా ఇటలీ ఫ్యాషన్ రాజధానితో ఆయనకు అనుబంధం ప్రారంభమైంది.

1964లో డిజైనర్ నినో సెరుటి అప్పటికి లా రినాస్సెంట్‌లో కొనుగోలుదారుగా ఉన్న అర్మానీకి పురుషుల దుస్తులను డిజైన్ చేసే ఉద్యోగం ఇవ్వడం ద్వారా అవకాశం పొందారు. ఇక్కడే మొదట అన్‌స్ట్రక్చర్డ్ జాకెట్ల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత సూట్ జాకెట్ల ద్వారా ప్రసిద్ధి పొందారు.

1975లో అర్మానీ బ్రాండ్‌ను స్థాపన..

సెర్రుటిలో పని చేస్తున్నప్పుడు అర్మానీ తన జీవిత, వ్యాపార భాగస్వామి అయిన ఆర్కిటెక్ట్ సెర్గియో గలియోట్టిని కలిశారు. సొంత వ్యాపారాన్ని స్థాపించమని అర్మానీని.. గలియోట్టి ఒప్పించారు. ఇద్దరూ కలిసి 1975లో జార్జియో అర్మానీ బ్రాండ్‌ను స్థాపించారు.

వారి తొలి పురుషుల దుస్తుల సేకరణ USలో విజయవంతమైంది. దీన్ని 1976లో బార్నీస్ న్యూయార్క్‌లో నిల్వ చేశారు. అమెరికన్ దుకాణదారులకు అర్మానీని పరిచయం చేసే టీవీ యాడ్ కూడా నిర్మించింది. తర్వాత ఉమెన్స్ వేర్ కలెక్షన్ ప్రారంభించారు.

అర్మానీ డిజైన్ చేసిన జాకెట్లు హాలీవుడ్ దృష్టిని ఆకర్షించాయి. 1980లో రిచర్డ్ గేర్ “అమెరికన్ గిగోలో”లో అర్మానీ సూట్‌ను ధరించి, దాన్ని స్టేటస్ సింబల్‌గా మార్చారు. ఆ కాలంలోని చాలా మంది ప్రముఖ సెలబ్రిటీలు.. ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, సోఫియా లోరెన్, జోడీ ఫోస్టర్, సీన్ కానరీ, టీనా టర్నర్ వాటిని ధరించారు. ఇది 1980ల నాటి ఇటాలియన్ ఫ్యాషన్ దిగ్గజనం జియాని వెర్సేస్‌ కు గట్టి పోటీ ఇచ్చింది. 1985లో గెలియోట్టి మరణించారు. దాంతో అర్మానీ కంపెనీ ఏకైక వాటాదారుగా మిగిలిపోయారు. అర్మానీ ఒక పాపులర్ శ్రేణిని ఆవిష్కరించారు. ఎంపోరియో అర్మానీని, అర్మానీ జీన్స్, అర్మానీ ఎక్సేంజ్ లను ప్రారంభించారు.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌పై నిషేధం..! నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బ్యాన్ ఎందుకంటే..