Social Media Platforms Ban: ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌పై నిషేధం..! నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బ్యాన్ ఎందుకంటే..

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై బ్యాన్ విధిస్తూ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవడానికి వెనుకున్న అసలు కారణం ఏంటి?

Social Media Platforms Ban: ఫేస్‌బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌పై నిషేధం..! నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బ్యాన్ ఎందుకంటే..

Updated On : September 4, 2025 / 8:24 PM IST

Social Media Platforms Ban: నేపాల్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది. ఫేస్ బుక్, యూట్యూబ్ పై నిషేధం విధించింది. ఇచ్చిన గడువులోపు కమ్యూనికేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో నమోదు చేసుకోనందుకు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా సైట్‌లను నిషేధించాలని నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి నుండి ఈ నిషేధం అమల్లోకి వస్తుంది.

రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని ఆదేశాలు..

కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి పృథ్వీ సుబ్బ గురుంగ్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఇందులో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై నిషేధం విధిస్తూ నిర్ణయం తసీుకున్నారు. సోషల్ మీడియా నెట్‌వర్క్‌ల నిర్వహణ 2023 కింద తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. అలా రిజిస్ట్రేషన్ చేయించుకోని సోషల్ మీడియా యాప్‌లను నిషేధించే అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటీసు ప్రకారం, సోషల్ మీడియా కంపెనీలకు ఆగస్టు 28 నుండి 7 రోజుల సమయం ఇచ్చారు.

బుధవారం రాత్రితో గడువు ముగిసింది. అయినప్పటికీ మెటా (ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్), ఆల్ఫాబెట్ (యూట్యూబ్), ఎక్స్ (గతంలో ట్విట్టర్), రెడ్డిట్, లింక్డ్ఇన్ వంటి పెద్ద సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు దరఖాస్తులను సమర్పించ లేదు.

టిక్‌టాక్, వైబర్, witk, నింబుజ్, పోపో లైవ్ వంటి యాప్‌లు లిస్ట్ చేయబడ్డాయి. టెలిగ్రామ్, గ్లోబల్ డైరీ మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయని, వాటి ఆమోద ప్రక్రియ జరుగుతోందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

“లిస్ట్ చేయబడిన ఐదు ప్లాట్‌ఫామ్ లు, ప్రాసెస్ లో ఉన్న రెండు మినహా.. మిగతావన్నీ నేపాల్‌లో డియాక్టివేట్ చేయబడతాయి” అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి గజేంద్ర కుమార్ ఠాకూర్ తెలిపారు. ఏదైనా ప్లాట్‌ఫారమ్ రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తే, అది అదే రోజు తిరిగి తెరవబడుతుందని వెల్లడించారు. కాగా, నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఫేస్ బుక్ కానీ, ఇతర సోషల్ మీడియా కంపెనీలు కానీ ఇంకా ఎలాంటి కామెంట్ చేయలేదు.

లక్షలాది మంది నేపాలీలపై ప్రభావం..

నేపాల్ ప్రభుత్వ నిర్ణయం విదేశాల్లో నివాసం ఉంటున్న లక్షలాది మంది నేపాలీ ప్రజలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. సంపాదన లేదా చదువు కోసం విదేశాల్లో నివసిస్తున్న నేపాల్ ప్రజలు ప్రతిరోజూ కమ్యూనికేషన్ కోసం ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లనే ఉపయోగిస్తున్నారు.

”ఉన్నత చదువుల కోసం లేదా ఉపాధి కోసం 70 లక్షల మందికి పైగా యువత నేపాల్ బయట ఉంటున్నారు. ఇది వారి కుటుంబం, స్నేహితులతో కమ్యూనికేషన్‌ను ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది” అని ఒక జర్నలిస్ట్ అభిప్రాయపడ్డారు.

కంటెంట్ మానిటైజేషన్‌కు అర్హత ఉన్న దేశాల జాబితాలో ఫేస్‌బుక్ ఇటీవలే నేపాల్‌ను చేర్చింది. వినియోగదారులు వీడియోలు, రీల్స్ లేదా కథనాల నుండి నేరుగా సంపాదించడానికి వీలు కల్పించింది. అయితే, ఇప్పుడీ నిషేధం క్రియేటర్ల ఆదాయంపై ప్రభావం చూపనుంది.

సోషల్ మీడియా సైట్‌లను నిషేధించాలనే ప్రభుత్వ నిర్ణయంపై నేపాల్ జర్నలిస్ట్‌ల సమాఖ్య అభ్యంతరాలు తెలిపింది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. సమాచార హక్కు, భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛకు గౌరవం ఇస్తూ వెంటనే ఈ నిషేధాన్ని ఉపసంహరించుకోవాలంది.

“ప్రత్యామ్నాయాలు చూపకుండా సోషల్ మీడియా సైట్‌లను నిషేధించాలనే ప్రభుత్వం చర్య భావ ప్రకటనా స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛను పరిమితం చేయడమే. అంతేకాదు రాజ్యాంగం హామీ ఇచ్చిన సమాచార హక్కును కూడా ప్రభావితం చేస్తుంది” అని నేపాల్ జర్నలిస్ట్ ల సమాఖ్య అభిప్రాయపడింది.

Also Read: వీడెవడండీ బాబూ..! లవర్ ఫోన్ బిజీ వస్తోందని.. ఆ ఊరి మొత్తానికి కరెంట్ కట్ చేశాడు..