Donald Trump : వాళ్లు యూఎస్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారు.. ట్రంప్ సంచలన కామెంట్స్.. భారత్‌తో కలిసే ఉన్నాం.. కానీ..
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరుపారేసుకున్నారు. వాళ్లు యూఎస్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారంటూ ఆరోపించారు.

Donald Trump
Donald Trump : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరుపారేసుకున్నారు. భారత్ పై తన అక్కస్సు వెళ్లగక్కుతున్న ట్రంప్.. తాజాగా.. రష్యా, చైనా, ఉత్తరకొరియాపై మండిపడ్డారు. వారు యూఎస్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారంటూ ఆరోపించారు.
రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌పై విజయం సాధించి 80ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైనా ఆయుధ ప్రదర్శనను నిర్వహిస్తుంది. తియానన్మేన్ స్క్వేర్ వద్ద చైనా ఆయుధ ప్రదర్శన జరుగుతుంది. ఈ కార్యక్రమానికి రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తరకొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ సహా దాదాపు 26దేశాల అగ్రనేతలు హాజరయ్యారు. ఓవైపు చైనాలో ఆయుధ ప్రదర్శన జరుగుతున్న వేళ.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, పుతిన్, కిమ్‌జోంగ్ ఉన్‌లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పోస్టు పెట్టారు. ‘‘రెండో ప్రపంచయుద్ధంలో చైనా కోసం పోరాడిన అమెరికన్ సైనికుల త్యాగాలను గుర్తించాలి. యుద్ధం నేపథ్యంలో చైనాకు పెద్దెత్తున మద్దతిచ్చాం. నాడు విజయంకోసం చైనా చేసిన పోరాటంలో చాలా మంది యూఎస్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వారి ధైర్యం, త్యాగాలను జిన్‌పింగ్ గుర్తించి గౌరవిస్తారని తాను ఆశిస్తున్నాను. చైనా అధ్యక్షుడికి, ఆ దేశ ప్రజలకు శుభాకాంక్షలు. కిమ్, పుతిన్‌లకు అభినందనలు. వారు యూఎస్‌కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారు’’.. అంటూ ట్రంప్ ఆరోపించారు.
భారత్ సుంకాలపై ట్రంప్ ఏమన్నారంటే..
మరోవైపు.. భారత్‌తో సంబంధాలపై డొనాల్డ్ ట్రంప్ కీలక కామెంట్స్ చేశారు. ఓవెల్ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా భారతదేశంపై విధించిన కొన్ని సుంకాలను తొలగించాలని ఆలోచిస్తున్నారా..? అని మీడియా ప్రశ్నించగా.. తాము భారత దేశంతో కలిసే ఉన్నాం. ఇరు దేశాల మధ్య దీర్ఘకాలంగా ఉన్న ఆర్థిక సంబంధాలు ఏకపక్షంగా ఉన్నాయి. తాను అధికారం చేపట్టిన తరువాత అందులో మార్పు వచ్చింది. యూఎస్ దిగుమతులపై భారత్ పెద్ద ఎత్తున సుంకాలు వసూళ్లు చేస్తుంది. అవి ప్రపంచంలోనే అత్యధికం. తాము భారత్‌తో పెద్దగా వ్యాపారం చేయడం లేదు. కానీ, వారు మాతో చేస్తున్నారు. తమ ఉత్పత్తులపై 100శాతం సుంకాలను వసూలు చేస్తున్నందు వల్ల మేము ఏమీ పంపడం లేదు. ఇందుకు హార్లే డేవిడ్సన్ మోటార్ సైకిళ్లే ఉదాహరణ. అధిక సుంకాల కారణంగా ఆ సంస్థ భారతదేశంలో ప్లాంట్ ను నిర్మించి విక్రయాలు జరపాల్సిన పరిస్థితి వచ్చిందని ట్రంప్ అన్నారు.