Donald Trump On India: భారత్, రష్యాలకు దూరమయ్యాం.. కుట్ర బుద్ధి ఉన్న ఆ దేశానికి దగ్గరయ్యాయి..! మరోసారి ట్రంప్ కీలక వ్యాఖ్యలు..
టారిఫ్స్ పేరుతో భారత్ ను ఇబ్బంది పెట్టాలని చూసిన ట్రంప్ లో మార్పు వచ్చిందా? భారత్ ను కోల్పోయాం అని ఎందుకు అంటున్నారు?

Donald Trump On India: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ కు దూరమయ్యాం అంటూ ట్రూత్ లో ట్రంప్ పోస్ట్ పెట్టారు. భారత్ తో పాటు రష్యా కూడా మాకు దూరమైందంటూ వాపోయారు. చైనా కారణంగా భారత్, రష్యాలను కోల్పోయామన్నారు ట్రంప్. కుట్ర బుద్ధి ఉన్న చైనాకు ఇండియా, రష్యా దగ్గరయ్యాయని ట్రంప్ అన్నారు. ఈ మూడు దేశాల మైత్రి చాలా కాలం కొనసాగించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ కారణంగా పలు దేశాలు అమెరికాకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడింది. సుంకాల పేరుతో ట్రంప్ భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇండియా, రష్యాలపై పెత్తనం చెలాయించాలని చూశారు. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తుందనే కారణంతో భారత్ ఎగుమతులపై ట్రంప్ 50శాతం టారిఫ్స్ విధించిన సంగతి తెలిసిందే. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం.. అమెరికాకు భారీ నష్టం కలిగించేలా ఉందన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు.
చేతులు కలిపిన భారత్, రష్యా, చైనా..!
ట్రంప్ తీరుతో భారత్, రష్యా, చైనా దేశాలు దగ్గరయ్యాయి. ఇటీవల చైనాలో టియాంజిన్ లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సు జరిగింది. దీనికి భారత్ నుంచి ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ హాజరయ్యారు. ఈ సమ్మిట్ వేదికగా మూడు దేశాలు దగ్గరయ్యాయి. వాణిజ్యం, ఇంధనం నుండి భద్రత వరకు పలు రంగాల్లో సహకారం గురించి ముగ్గురు నాయకులు చర్చించారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపైనా డిస్కస్ చేశారు. ఈ పరిణామం ట్రంప్ ను కలవరానికి గురి చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఏడేళ్ల తర్వాత భారత ప్రధాని మోదీ చైనాలో పర్యటించడం ఇదే తొలిసారి. టియాంజిన్‌లో జరిగిన SCO శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొన్నారు. 2020లో గల్వాన్ లోయలో జరిగిన సరిహద్దు ఘర్షణ భారత్, చైనాల మధ్య ఉద్రిక్తతలు పెంచింది. ఈ పరిస్థితుల్లో ఇది కీలక పరిణామం.
భారత్ పై ట్రంప్ టారిఫ్ బాంబ్..!
రష్యాతో సన్నిహితంగా ఉంటుందనే కారణంతో ఇండియాపై ట్రంప్ అక్కసు వెళ్లగక్కుతున్నారు. భారత్ ను భయపెట్టాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా టారిఫ్స్ బాంబ్ ప్రయోగించారు. అయినా భారత్ భయపడలేదు. ట్రంప్ ను కేర్ చేయడం లేదు. అంతేకాదు రష్యాకు మరింత దగ్గరైంది. అంతేకాదు.. చైనాతోనూ చెలిమి దిశగా అడుగులు వేస్తోంది. ఈ మూడు దేశాల కలయిక.. ట్రంప్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఊహించని పరిణామంతో ట్రంప్ బిత్తరపోతున్నారు. తాను ఒకటి తలిస్తే మరొకటి జరుగుతోందని కలవరపడుతున్నారు.
Also Read: దెబ్బకు పాకెట్ ఖాళీ.. వీటిపై 40 శాతం కాదు.. ఏకంగా 88శాతం వరకు జీఎస్టీ.. లిస్ట్ ఇదే