స్వేచ్ఛకు సంకెళ్లు.. అక్కడ ఆడపిల్లగా పుట్టడం అంటే.. రాక్షస రాజ్యంలో అడుగు పెట్టినట్లే..!
మహిళలు చదువుకున్నా తప్పే. ఉద్యోగం చేసినా తప్పే. ఒంటరిగా ఇంటి బయటకు అడుగు పెట్టకూడదు. శరీరం ఏ మాత్రం కనిపించకుండా పూర్తిగా బుర్ఖా ధరించాలి.

Taliban New Rule (Photo Credit : Google)
Taliban New Rule : అక్కడ అంతే.. వాళ్లు చెప్పిందే వేదం.. వాళ్లు చేసిందే చట్టం.. ప్రపంచంలో ఎక్కడా లేని వింత రూల్స్ అక్కడే ఉంటాయి. గాంధార దేశం అప్ఘానిస్తాన్ గుడ్డి చట్టాలు, విచిత్రమైన రూల్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చర్చకు దారితీశాయి. తాలిబాన్ల పాలనలో ఉన్న అప్ఘానిస్తాన్ లో ఇప్పుడు ఇంకో కొత్త రూల్ వచ్చి చేరింది. మహిళలు ఇకపై పక్క వారికి వినిపించేలా ప్రార్థనాలు చేయకూడదు. బయటి వాళ్లకు వినిపించేలా గళం వినిపించకూడదన్న కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇది చూడటానికి చిత్రంగానే అనిపించొచ్చు.. కానీ, మహిళల స్వేచ్ఛను హరించే చట్టాలలో ఇది అత్యంత దారుణమైందన్న విమర్శలు సర్వత్రా వెల్లవెత్తుతున్నాయి.
అఫ్ఘాన్ మహిళల విషయంలో తాలిబన్ల చట్టాలు చూస్తే మనం ఇంకా ఏ కాలంలో ఉన్నామనే అనుమానం కలుగుతుంది. మహిళలు ఒంటరిగా బయటకు రాకూడదు. హై హీల్స్ ధరించకూడదు. బాల్కనీలో నిలబడకూడదు. బాలికలు ఆరో తరగతి కంటే ఎక్కువ చదవకూడదు. మహిళలు యూనివర్సిటీల్లో చదవకూడదు. ఇలా ఆడవారి ప్రగతికి అడుగడుగునా అడ్డం పడే చట్టాలు, సవాలక్ష నిబంధనలన్నీ విధించారు. అప్ఘాన్ లో ఆడపిల్లగా పుట్టడం అంటే.. రాక్షస రాజ్యంలో అడుగు పెట్టినట్లేనని ఇప్పుడు ప్రపంచమంతా అంటోంది.
మానవ హక్కులను కాలరాయడంలో అప్ఘానిస్తాన్ తర్వాతే ఏ దేశమైనా. అందుకే ప్రపంచంలోని 150 దేశాల్లో స్వేచ్ఛ విషయంలో చేసిన సర్వేలో అప్ఘానిస్తాన్ గతంలో 122వ ర్యాంకులో ఉండేది. ఇప్పుడు 178వ ర్యాంకుకి చేరింది. ప్రతీ చోట మహిళల పట్ల వివక్ష పూరిత షరియా చట్టాలను తాలిబన్లు అమలు చేశారు. తాలిబన్లు షరియా వ్యవస్థ ద్వారా చట్టాలు, నిబంధనలు చేస్తారు. షరియా అనేది ఇస్లాం న్యాయవ్యవస్థ. తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు వందకుపైగా షరియా నిబంధనలను తీసుకొచ్చారు. వాటిలో చాలా వరకు బాలికలు, మహిళలకు సంబంధించినవే.
90లలో కూడా తాలిబన్లు ఇలాంటి షరియా నియమాలే అమలు చేశారు. పురుషులు, స్త్రీలు అందరూ తాలిబన్లు సూచించిన దుస్తులే ధరించాలి. 1996లో అధికారంలోకి వచ్చిన సమయంలో వారు కఠినమైన నియమాలను అమలు చేశారు. మహిళలు చదువుకున్నా తప్పే. ఉద్యోగం చేసినా తప్పే. ఒంటరిగా ఇంటి బయట అడుగు పెట్టకూడదు. శరీరం ఏ మాత్రం కనిపించకుండా పూర్తిగా బుర్ఖా ధరించాలి.
Also Read : విజేత ఎవరో? అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ..