20 సంవత్సరాల క్రితం దొంగతనానికి గురైన ఉంగరం ఈనాటికి దొరికింది. పోయిన ఉంగరం దొరికితే అదో పెద్ద విశేషమా అనుకోవచ్చు. కానీ ఇది అలాంటి ఇలాంటి ఉంగరం కాదు. ఆ ఉంగరం ఏదో ఆషామాషీ వ్యక్తులది కూడా కాదు. అందుకే 20 ఏళ్ల క్రితం పోయిన ఉంగరం దొరకటం విశేషంగా మారింది.
బ్రిటన్‌లోని ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ నుంచి 20 ఏళ్ల క్రితం ఓ ఉంగరం దొంగతనానికి గురైంది. అది ప్రముఖ ఐరిష్ రైటర్ ఆస్కార్ వైల్డ్ ది. ఆ పోయిన ఉంగరాన్ని ‘ఇండియానా జోన్స్ ఆఫ్ ద ఆర్ట్ వరల్డ్’గా పేరొందిన డచ్ ఆర్ట్ డిటెక్టివ్ ఆర్థర్ బ్రాండ్ కనిపెట్టారు. ఆస్కార్‌వైల్డ్ 1876లో ఆక్స్‌ఫర్డ్ వర్సిటీలో చదువుకునే రోజుల్లో ఈ ఉంగరాన్ని తన స్నేహితుడికి గిఫ్ట్ గా ఇచ్చారు. ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ సేకరించిన విలువైన వస్తువుల్లో ‘ఆస్కార్‌వైల్డ్ ఉంగరం’ కూడా ఒకటి.
ఈ ఉంగరం 2002లో వర్సిటీలో పనిచేసిన మాజీ చప్రాసీ ఒకరు దొంగిలించి స్క్రాప్ డీలర్‌కు అమ్మేశాడు. ఆ తర్వాత అది ఎక్కడి చేరిందో అనే విషయం పెద్ద మిస్టరీగా మారింది. చివరకు ఆర్థర్ బ్రాండ్ తన అండర్‌వరల్డ్ సంబంధాలను ఉపయోగించి ‘ఆస్కార్‌వైల్డ్ ఉంగరం’ కనిపెట్టారు. దీంతో ఇన్నేళ్లగా ఉన్న రింగ్ మిస్టరీ వీడిపోయింది.
18 క్యారెట్ల ఈ ఉంగరం విలువ బ్రిటన్ కరెన్సీలో 35,000 పౌండ్స్ (45,000 డాలర్లు).ఆర్థర్ బ్రాండ్ ను “ఇండియానా జోన్స్ ఆఫ్ ది ఆర్ట్ వరల్డ్” గా పిలుస్తారు. దొంగిలించబడిన హై ప్రొఫైల్ కళాఖండాలను తిరిగి కనిపెట్టటంలో ఆర్తర్ బ్రాండ్ దిట్ట. ఫ్రాన్స్ లోని ఓ షిప్ నుంచి దొంగిలించబడిన పికాసో పెయింటింగ్ ను..నాజీ శిల్పి జోసెఫ్ థొరాక్ తయారు చేసిన రెండు కాంస్య విగ్రహాలను కూడా ఆర్థర్ బ్రాండ్ కనిపెట్టారు. ఈ సందర్బంగా ఆర్థర్ బ్రాండ్ మాట్లాడుతూ..ఈ ఆస్కార్ వైల్డ్ రింగ్ పై గ్రీకు శాసనం ఉందనీ..ఇది ఒకే ఒక్క రింగ్ ఉండి ఉండవచ్చనీ అన్నారు.