×
Ad

British Scientist: 66 సంవత్సరాలుగా మంచులోనే.. బయటపడిన బ్రిటిష్ శాస్త్రవేత్త మృతదేహం

డెన్నిస్ బెల్ జూలై 26, 1959న ఒక గుంతలో పడిపోయారు. అప్పుడు ఆయన వయసు 25 సంవత్సరాలు.

  • Published On : February 17, 2026 / 05:19 PM IST

Dennis Bell Representative Image (Image Credit To Original Source)

 

  • 1959లో అంటార్కిటిక్ ప్రమాదంలో శాస్త్రవేత్త మృతి
  • 25ఏళ్ల వయసులో మృత్యువాత
  • శోకసంద్రంలో కుటుంబసభ్యులు

British Scientist: ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 66 సంవత్సరాలు.. అంటార్కిటిక్ మంచులోనే చిక్కుకుంది. చివరికి ఇప్పుడు బయటపడింది. బిట్రిష్ సైంటిస్ట్ డెన్నిస్ బెల్ మృతదేహాన్ని కనుగొన్నారు. 1959లో అంటార్కిటిక్ లో జరిగిన ప్రమాదంలో డెన్నిస్ బెల్ మృతి చెందారు. అప్పటి నుంచి మంచులోనే ఆయన మృతదేహం కూరుకుపోయింది.

కింగ్ జార్జ్ ద్వీపంలో హిమానీనదం (భారీ మంచు రాశి) తగ్గడంతో కొత్తగా బయటపడిన రాళ్లలో మానవ అవశేషాలు కనుగొన్నారు. DNA పరీక్ష చేయగా.. ఆ అవశేషాలు 1959లో అక్కడ మరణించిన బ్రిటిష్ వాతావరణ శాస్త్రవేత్త డెన్నిస్ బెల్ కు చెందినవని నిర్ధారించారు.

1959 అంటార్కిటిక్ ప్రమాదంలో వాతావరణ శాస్త్రవేత్త డెన్నిస్ బెల్ మృతి చెందారు. ఆ అవశేషాలను యునైటెడ్ కింగ్‌డమ్‌కు తరలించారు. లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ డెనిస్ ఫోరెన్సిక్ బృందం DNA పరీక్ష నిర్వహించింది. ఆ నమూనాలు బెల్ సోదరుడు, సోదరి నమూనాలతో సరిపోలాయి.
ఎకాలజీ గ్లేసియర్ సమీపంలో జరిగిన రికవరీ అటెంప్ట్ లో 200 కంటే ఎక్కువ వ్యక్తిగత వస్తువులు గుర్తించారు. వీటిలో రేడియో పరికరాల శకలాలు, టార్చ్, స్కీ స్తంభాలు, చేతి గడియారం, స్వీడిష్ మోరా కత్తి ఉన్నాయి.

హిమానీనదం (భారీ మంచు రాశి) తగ్గుతున్నప్పుడు బయటపడ్డ రాళ్లలో ఈ వస్తువులు కనుగొన్నారు. ఫిబ్రవరి 2025లో పురావస్తు సర్వే కోసం ఆ ప్రదేశానికి ఓ బృందం వెళ్లింది. ఆ సమయంలో ఎముకల శకలాలు, కళాఖండాలు గుర్తించింది.

1959లో జరిగిన ప్రమాదంలో మరణం..

డెన్నిస్ బెల్ జూలై 26, 1959న ఒక గుంతలో పడిపోయారు. అప్పుడు ఆయన వయసు 25 సంవత్సరాలు. 1958లో ఫాక్లాండ్ దీవుల డిపెండెన్సీస్ సర్వేలో వాతావరణ శాస్త్రవేత్తగా డెన్నిస్ చేరారు. అంటార్కిటిక్ ద్వీపకల్పంలోని కింగ్ జార్జ్ ద్వీపంలోని అడ్మిరల్టీ బేలో పనిచేశారు.

ప్రమాదం జరిగిన రోజున బెల్, సర్వేయర్ జెఫ్ స్టోక్స్ కుక్కల బృందాలతో కలిసి ఒక హిమానీనదం ఎక్కుతున్నారు. పగుళ్లు ఏర్పడిన నేలను తాము దాటామని నమ్మి, బెల్ కుక్కలను ప్రోత్సహించడానికి ముందుకు కదిలాడు. ఆ సమయంలో అతను స్కీలు ధరించ లేదు. అతని కింద మంచు పడిపోయింది. దాంతో అతను అందులో పడిపోయాడు.

వెంటనే స్టోక్స్ ఒక తాడుని వదిలాడు. బెల్ స్పందించి దాన్ని తన బెల్టుకి కట్టుకున్నాడు. కుక్కలు లాగే ప్రయత్నం చేశాయి. కానీ ప్రయోజనం లేకపోయింది. బెల్ట్ విరిగిపోయింది. అతను వెనక్కి పడిపోయాడు. వాతావరణం మరింత దిగజారింది. తర్వాత జరిపిన శోధనలో బెల్ ప్రాణాలతో బయటపడిన దాఖలాలు కనిపించలేదు.

బెల్ వాయువ్య లండన్‌లోని హారోలో పెరిగారు. రాయల్ ఎయిర్ ఫోర్స్‌లో పనిచేశారు. చాలా సరదాగా ఉండే వాడని, బాగా పని చేసేవాడని సహ ఉద్యోగులు గుర్తు చేసుకున్నారు. కింగ్ జార్జ్ ద్వీపంలోని బెల్ పాయింట్‌లోని ఒక హెడ్‌ల్యాండ్ కు బెల్ పేరు పెట్టారు.

Also Read: వచ్చే 5 ఏళ్లలో ఆ ఐటీ జాబ్స్ మటాష్.. అంతా AI ఆధిపత్యమే.. టెక్ బిలియనీర్ సంచలన కామెంట్స్