అమెరికాలో కరోనా ఉగ్రరూపం, పెరుగుతున్న మరణాలు

  • Publish Date - November 25, 2020 / 08:29 AM IST

America corona:అమెరికాను కరోనా మహమ్మారి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. రోజు రోజుకు అగ్ర రాజ్యంలో కేసుల తీవ్రత మరింత పెరుగుతోంది. వాతావరణంలో అనూహ్యంగా వచ్చిన మార్పులు.. ప్రజలు మాస్కులు, భౌతిక దూరం పాటించకుండా తిరుగుతుండటంతో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అవుతుండటం అక్కడి వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. నిత్యం నమోదు అవుతున్న కేసులు రికార్డులను సృష్టిస్తున్నాయి.



అగ్రరాజ్యంలో కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూనే ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా నమోదవుతున్న కేసులు, మరణాల లెక్కలపై అమెరికా ప్రముఖ వైద్యుడు ఆంథోనీ ఫౌసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా విలయం ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరి నాటికి మరణాల సంఖ్య 3 లక్షలకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించారు. జాగ్రత్తలు పాటించకపోతే ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపారు.



https://10tv.in/joe-bidens-new-cabinet/
అమెరికాలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ మొదలు కావడంతో కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అమాంతం పెరిగింది. వైరస్ వల్ల ప్రతి రోజు అమెరికాలో వెయ్యి నుంచి రెండు వేల మంది వరకు మరణిస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో కోవిడ్ 19 వల్ల 2లక్షల 64వేల మందికిపైగా మరణించారు. రెండు నెలల్లోనే 64వేల మంది మరణించగా.. రానున్న నెల రోజుల్లో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని, అమెరికా మృత్యు దిబ్బగా మారబోతుందని వైద్య నిపుణులు ఆందోళన చెందుతున్నారు.