India-Russia: త్వరలో భారత్ రానున్న రష్యా విదేశాంగ మంత్రి: కీలక అంశాలపై చర్చ

యుక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు కఠినతరంచేసిన వేళ..ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది

Russia India

India-Russia: రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అతి త్వరలో భారత్ లో పర్యటించనున్నారు. యుక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు కఠినతరంచేసిన వేళ..ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా రష్యా యుక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. యుక్రెయిన్ లో కీలక నగరాలను ఆక్రమించుకున్నామని రష్యా ప్రకటించగా..16 వేలమందికి పైగా రష్యన్ సైనికులను మట్టుపెట్టినట్లు యుక్రెయిన్ ప్రకటించింది. అయితే వాస్తవ పరిస్థితులపై ఇరుదేశాలు నిర్దిష్టమైన ప్రకటన చేయడంలేదు. యుక్రెయిన్ పై మొదటి దశ యుద్ధం ముగిసిందంటూ ప్రకటించిన రష్యా..యుక్రెయిన్ లో తమ సైన్యం ఆక్రమించిన నగరాలను పాక్షికంగా ఖాళీచేసి వెళ్తున్నట్లు ప్రకటించింది. అదే సమయంలో డాన్బాస్ ప్రాంతాన్ని స్వతంత్ర ప్రాంతంగా ఏర్పాటు చేయడమే తమ ముందున్న కర్తవ్యమని రష్యా తెలిపింది.

Also Read:Talks In Istanbul : ఇస్తాంబుల్‌ వేదికగా.. రేపు యుక్రెయిన్‌- రష్యా మధ్య శాంతి చర్చలు..!

యుక్రెయిన్ పై యుద్ధం ప్రారంభించిన నాటి నుంచి రష్యాకు చెందిన ఒక అత్యున్నత స్థాయి అధికారి భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. యుద్ధం ప్రారంభించే సరిగా రెండు నెలల ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. యుద్ధం అనంతరం ఇరు దేశాల నేతలు, దౌత్యవేత్తలు ఫోన్ ద్వారా సంప్రదింపులు జరుపడం తప్పా ప్రత్యేక భేటీ నిర్వహించలేదు. అయితే సెర్గీ లావ్రోవ్ భారత పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య కరెన్సీ మార్పిడి, ఆ దేశం నుండి సైనిక పరికరాలు మరియు విడిభాగాల డెలివరీలో ఆలస్యం, పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావంతో పాటు ముడి చమురు సరఫరా వంటి కీలక విషయాలపై చర్చించనున్నారు.

Also Read:Ukraine Russia War : పుతిన్‌పై బైడెన్ కామెంట్స్‌.. వైట్ హౌస్ వివరణ..!

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇండియన్ ఆయిల్ సంస్థ ఇటీవల రష్యా నుంచి 3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును కొనుగోలు చేసింది. అయితే చమురు దిగుమతుల చెల్లింపు విషయంలో సందిగ్థత నెలకొంది. రష్యా బ్యాంకులపై పశ్చిమ దేశాల ఆంక్షలు విధించడంతో ఆదేశ కరెన్సీ ఎక్స్చేంజి పై తీవ్ర ప్రభావం పడింది. ఇక యుద్ధం నేపథ్యంలో రష్యా కరెన్సీ రూబుల్స్ దారుణంగా పడిపోయిన నేపథ్యంలో..భారత కరెన్సీలోనే చెల్లింపులు చేయాలంటూ రష్యా నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు ప్రచారం జరిగింది. ఈవ్యాఖ్యలని భారత విదేశాంగశాఖ కొట్టిపారేసింది. చమురు చెల్లింపుల విషయంలో రష్యా ఎటువంటి విజ్ఞప్తి చేయలేదని స్పష్టం చేసింది.

Also read:Russian Generals : రష్యన్‌ జనరల్స్‌పై యుక్రెయిన్ బలగాల టార్గెట్..!

వీటితో పాటుగా రష్యా నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి అందించాల్సిన s-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, ఇండియన్ ఆర్మీకి అందించాల్సిన Ak-203 అసాల్ట్ రైఫిల్స్ డెలివరీపై ఇరుదేశాలు చర్చించనున్నాయి. కాగా యూకే విదేశాంగ కార్యదర్శి లిజ్ ట్రస్ మరియు మెక్సికన్ విదేశాంగ మంత్రి ఎబ్రార్డ్ కూడా ఈ వారం భారత పర్యటనకు రానున్నారు. అదే సమయంలో (వారాంతంలో) ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్, ఆ దేశ రక్షణ మంత్రి బెన్నీ గాంట్జ్ కూడా భారత పర్యటనకు రానున్నారు.