Talks In Istanbul : ఇస్తాంబుల్‌ వేదికగా.. రేపు యుక్రెయిన్‌- రష్యా మధ్య శాంతి చర్చలు..!

రష్యా, యుక్రెయిన్ దేశాలు.. మరోసారి శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. ఇస్తాంబుల్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు..(Talks in Istanbul)

Talks In Istanbul : ఇస్తాంబుల్‌ వేదికగా.. రేపు యుక్రెయిన్‌- రష్యా మధ్య శాంతి చర్చలు..!

Talks In Istanbul

Talks in Istanbul : రష్యా, యుక్రెయిన్ దేశాలు.. మరోసారి శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. ఇస్తాంబుల్ వేదికగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య శాంతి చర్చలు మంగళవారం ప్రారంభమయ్యే అవకాశం ఉందని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ తెలిపారు. కాగా, చర్చలు ఈరోజే ప్రారంభం కావచ్చని టర్కీ భావించగా.. ఈ అవకాశాన్ని పెస్కోవ్ తోసిపుచ్చారు. తమ ప్రతినిధులు గంటల వ్యవధిలోనే అక్కడికి చేరుకోలేరన్నారు. శాంతి చర్చలు జరగడం వాస్తవమే, కానీ.. యుక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సమావేశానికి ఎలాంటి ప్రణాళికలు లేవని దిమిత్రి పెస్కోవ్ తేల్చి చెప్పారు.

ఇదిలా ఉండగా.. రష్యా, టర్కీ అధ్యక్షులు పుతిన్, ఎర్డోగాన్‌లు ఆదివారం ఫోన్‌లో మాట్లాడి.. ఇస్తాంబుల్‌లో చర్చలకు అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కాల్పుల విరమణ ఒప్పందం కుదరగలదని టర్కీ ఆశిస్తోంది. ఇప్పటికే రష్యా- యుక్రెయిన్‌ల మధ్య పలుదఫాల చర్చలు జరిగినా.. ఎలాంటి పురోగతి లేదు. యుద్ధం కొనసాగుతూనే ఉంది.(Talks in Istanbul)

Russian Generals : రష్యన్‌ జనరల్స్‌పై యుక్రెయిన్ బలగాల టార్గెట్..!

ఇదిలా ఉంటే… ప్రస్తుతానికి రష్యా, యుక్రెయిన్‌ అధ్యక్షులు పుతిన్, జెలెన్‌స్కీల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగే అవకాశాన్ని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ కొట్టిపారేశారు. ఆగమేఘాలపై నిర్వహించే సమావేశాలు.. సరైన ఫలితాలు ఇవ్వవని, కీలక సమస్యలపై ఇరుపక్షాలు ఒక అంగీకారానికి చేరువైనప్పుడు చర్చలు జరగాలని అభిప్రాయపడ్డారు. ఇదిలా ఉండగా.. ఈ విషయమై ముఖాముఖి చర్చల కోసం జెలెన్‌స్కీ పదేపదే పుతిన్‌కు పిలుపునిస్తున్న విషయం తెలిసిందే.

కాగా, పశ్చిమ దేశాల తీరుని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ మరోసారి తప్పుపట్టారు. తమ దేశానికి సాయం అందించాలంటే పశ్చిమ దేశాలకు ధైర్యం సరిపోవడం లేదని నిందించారు. జెట్‌ యుద్ధ విమానాలను తమకు పంపకపోవడాన్ని ఆయన తప్పుపట్టారు. విమానాలు, గగనతల రక్షణ క్షిపణుల్ని సమకూర్చాల్సిందిగా పశ్చిమ దేశాలకు మరోసారి అభ్యర్థిస్తూనే ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇవన్నీ ఈ దేశాల దగ్గర ఉన్నాయని, తమకు ఇవ్వడానికి మాత్రం వెనుకాడుతున్నాయని చెప్పారు. ఉక్రెయిన్‌తో పాటు యూరప్ స్వేచ్ఛ కోసం వీటిని సమకూర్చాలని తాజా వీడియో సందేశంలో జెలెన్ స్కీ కోరారు. అంతేకాదు పోలండ్‌, స్లొవేకియాలపైనా రష్యా దాడి చేయవచ్చని హెచ్చరించారు.

Russia Fires Agian Kalibr : యుక్రెయిన్‌పై రష్యా భీకరదాడి.. మరోసారి కాలిబర్‌ మిస్సైల్ ప్రయోగం

యుక్రెయిన్‌ సైనిక నిఘా విభాగాధిపతి కిరిలో బుదనోవ్‌ సంచలన ఆరోపణలు చేశారు. తమ దేశాన్ని రెండుగా విభజించేందుకు రష్యా కుట్ర పన్నిందని కిరిలో బుదనోవ్‌ ఆరోపించారు. ‘‘ఉక్రెయిన్‌ మొత్తాన్ని తన వశం చేసుకోవడం సాధ్యం కాదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు తెలిసొచ్చింది. అందుకే- మా దేశాన్ని కొరియా తరహాలో రెండు భాగాలుగా విభజించేందుకు ఆయన ప్రయత్నించే అవకాశముంది” అని కిరిలో అన్నారు.

మరోవైపు రష్యా యుద్ధం ప్రారంభించిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు 38 లక్షలకుపైగా ప్రజలు యుక్రెయిన్‌ను వీడారని ఐరాస శరణార్థుల ఏజెన్సీ యూఎన్‌హెచ్‌సీఆర్‌ తెలిపింది. వారిలో 90 శాతం మంది మహిళలు, చిన్నారులేనని వెల్లడించింది. అత్యధికంగా.. 22 లక్షలకుపైగా పౌరులు పోలాండ్‌లోకి ప్రవేశించారని, రొమేనియాలోకి 5 లక్షలకు పైగా, మాల్డోవా, హంగరీల్లోకి మూడు లక్షలకుపైగా వెళ్లారని చెప్పింది.