మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పెద్దన్నయ్య కన్నుమూత
భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సోదరుడు(పెద్దన్నయ్య) మహమ్మద్ ముత్తుమీర మరాయ్‌కయార్ కన్నుమూశారు. ఆయన వయసు 104 ఏళ్లు.

APJ Abdul Kalam’s brother passes away: భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సోదరుడు(పెద్దన్నయ్య) మహమ్మద్ ముత్తుమీర మరాయ్‌కయార్ కన్నుమూశారు. ఆయన వయసు 104 ఏళ్లు. కొంతకాలంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఆయన బాధపడుతున్నారు. ఆదివారం(మార్చి 7,2021) రాత్రి 07.30 గంటల సమయంలో తమిళనాడు రామేశ్వరంలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు.
ఏపీజే అబ్దుల్ కలా ఇంటర్నేషన్ ఫౌండేషన్ ట్రస్టీలో మహమ్మద్ ముత్తుమీరా కూడా ఒకరు. మహమ్మద్ ముత్తుమీరా మరణం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్‌తో పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కాగా, అబ్దుల్ కలాం 2015 జులై 27న మేఘాలయాలోని షిల్లాంగ్‌లో కన్నుమూసిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆయన మరణించారు. అబ్దుల్ కలాం 2002 జులై 25 నుంచి 2007 జులై 25 వరకు భారత రాష్ట్రపతిగా సేవలందించారు.
మహమ్మద్ ముత్తుమీర మరాయ్‌కయార్ గత ఏడాది(2020) ఫిబ్రవరి 5న కుటుంబ సభ్యుల సమక్షంలో 104వ పుట్టిన రోజు జరుపుకున్నారు. అబ్దుల్ కలాం అవివాహితుడు కావడంతో… తన అన్న, ఇతర కుటుంబ సభ్యులను తరచుగా కలిసేవారు. కలాం పెద్దన్నయ్య మరణించడంతో రామేశ్వరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సోమవారం(మార్చి 8,2021) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రజల సందర్శనార్థం ముత్తుమీరా పార్థివ దేహాన్ని ఆయన నివాసంలోనే ఉంచారు.