ఎవరినైనా ప్రభావితం చేసే నాయకుల తప్పుడు ప్రచారాలు.. ఎంత ప్రమాదమో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఇటీవలికాలంలో కరోనా వైరస్ ద్వారా వ్యాపించే వ్యాధి కోవిడ్-19కి ఏ మందు వాడాలనేదానిపై పలు రకాల వాదనలు వినిపించాయి. ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఓ కుటుంబం కొంపముంచింది.
కరోనా వైరస్‌ని అడ్డుకోవడానికి క్లోరోక్విన్ ఫాస్ఫేట్ ఉపయోగపడుతుంది అంటూ ట్రంప్ చెప్పడంతో.. అరిజోనాలో కరోనా సోకిన ఇద్దరు దంపతులు తమకు వచ్చిన కరోనా వైరస్‌ని పోగొట్టుకునేందుకు సొంతంగా ఆ మందును వాడారు. ఫలితంగా భర్త చనిపోగా.. భార్య ఆస్పత్రిలో క్రిటికల్ కండీషన్‌లో ఉంది.
చేపల తొట్టెలను క్లీన్ చేసేందుకు వాడే మందును వాళ్లు తీసుకోగా.. 60ఏళ్లు దాటిన ఆ దంపతులు క్లోరోక్విన్ ఫాస్పేట్ తీసుకున్న అరగంటలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని డాక్టర్లు వెల్లడించారు. అంతలా ఆ మందు వారిపై నెగెటివ్ ప్రభావం చూపినట్లు చెప్పారు. మలేరియాను తరిమేసేందుకు వాడుతున్న క్లోరోక్విన్ ద్వారా కరోనా వైరస్‌ని తరిమికొట్టవచ్చంటూ ట్రంప్ గత వారం తప్పుడు ప్రకటన చేశారు.
అయితే మందుల షాపుల్లో ఇష్టమొచ్చిన మందులు కొనుక్కొని వాడితే ప్రాణాలకే ప్రమాదం అని, నాయకులు కానీ, ప్రజలను ప్రభావితం చేసే ఎవ్వరు చెప్పినా కూడా ఎటువంటి మందులు వాడొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. కరోనా అనుమానం ఉంటే వెంటనే ఆసుపత్రికి రావాలని చెబుతున్నారు.
See Also | కరోనా..వీళ్లు మారరు అంతే : ఉగాది వేళ..మార్కెట్లు కిటకిట..సోషల్ డిస్టెన్ ఎక్కడ ?