ఇరాన్‌లో భారీ పేలుడు.. ప్రాణాలు కోల్పోయిన 51 మంది
ఆ సమయంలో అక్కడ 69 మంది కార్మికులు ఉన్నారని దక్షిణ ఖొరాసన్ గవర్నర్ జావద్ ఘెనాట్జాదే తెలిపారు.

తూర్పు ఇరాన్‌లోని దక్షిణ ఖొరాసన్ ప్రావిన్స్‌లోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీక్ కారణంగా పేలుడు సంభవించి 51 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు.
రాజధాని టెహ్రాన్‌కు ఆగ్నేయంగా 540 కిలోమీటర్ల దూరంలోని టబాస్‌లోని గనిలోని రెండు బ్లాకుల్లో మీథేన్ గ్యాస్ పేలుడు సంభవించడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు. గత రాత్రి ఈ పేలుడు సంభవించిందని ఇరాన్ మీడియా తెలిపింది.
పేలుడు జరిగిన సమయంలో బ్లాక్‌లలో 69 మంది కార్మికులు ఉన్నారని దక్షిణ ఖొరాసన్ గవర్నర్ జావద్ ఘెనాట్జాదే తెలిపారు. ఆ 69 మంది మదంజూ గనిలోని బీ, సీ బ్లాక్‌లలో పని చేస్తున్నారని అన్నారు. బ్లాక్ సీలో 22 మంది, బ్లాక్ బీలో 47 మంది ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని చెప్పారు.
గనిలో ఇంకా ఎంత మంది చిక్కుకుపోయారో తెలియరావడం లేదని తెలిపారు. 24 మంది అందులో చిక్కుకుపోయినట్లు కొందరు అంటున్నారు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. మంత్రులతో మాట్లాడానని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రమాదం జరిగిన స్థలం ఇరాన్‌లో అతిపెద్ద బొగ్గు గనుల ప్రాంతంగా ఉంది. ఇరాన్‌లోని బొగ్గు గనుల వద్ద గతంలోనూ ఇటువంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.