వెంటాడి వేటాడి యాహ్యా సిన్వార్‌ను హతమార్చిన ఇజ్రాయెల్.. ఇక హమాస్ పనైపోయిందా? తదుపరి అధిపతి ఎవరు?

ఇజ్రాయెల్ గత కొన్నేళ్లుగా సిన్వార్ గురించి వెతుకుతోంది. ముఖ్యంగా అక్టోబర్ 7 దాడి తర్వాత సిన్వార్.. ఇజ్రాయెల్ ప్రైమ్ టార్గెట్ గా మారాడు.

Who Is Hamas Next Chief (Photo Credit : Google)

Who Is Hamas Next Chief : హమాస్ పని అయిపోనట్టేనా? హమాస్ తదుపరి అధిపతి ఎవరు? అసలు హమాస్ పగ్గాల చేపట్టేందుకు తదుపరి చీఫ్ గా ఎవరు సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు దీని గురించే చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే ఇజ్రాయెల్ జరుపుతున్న వరుస దాడుల్లో హమాస్ పగ్గాలు చేపట్టిన వారందరూ తుడిచి పెట్టుకుపోయారు. నెలల వ్యవధిలోనే ఇజ్రాయెల్ జరిపిన దాడిలో హమాస్ చీఫ్ యాహ్యా సిన్వార్ హతమయ్యారు.

హమాస్ అంతం చూసేవరకు నిద్రపోము అన్న ఇజ్రాయెల్.. అన్నంత పని చేసింది. మొదటి నుంచి చెబుతున్నట్లుగానే హమాస్ అధినేతలను మట్టి కరిపించింది. హమాస్ ను కూకటివేళ్లతో పెకిలిస్తామన్న ఇజ్రాయెల్ చెప్పినట్లే చావుదెబ్బ కొట్టినట్లైంది. తాజాగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఏకంగా హమాస్ చీఫ్ హతమయ్యాడు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ఆ విదేశాంగ మంత్రి ధృవీకరించారు.

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో హమాస్ కు భారీ ఎదురు దెబ్బ తగిలింది. సెంట్రల్ గాజాలోని ఒక భవనంపై ఇజ్రాయెల్ చేపట్టిన సాధారణ దాడుల్లో భాగంగా సిన్వార్ హతమయ్యాడు. ఈ దాడుల్లో మృతి చెందిన మిలిటెంట్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్.. సిన్వార్ మృతిని నిర్ధారించేందుకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించింది. అనంతరం సిన్వార్ మరణాన్ని అధికారికంగా నిర్ధారించింది.

ఇక ఇజ్రాయెల్ పై గతేడాది అక్టోబర్ 7న జరిగిన దాడులకు ప్రధాన సూత్రధారి, దాడులకు ఆదేశాలు ఇచ్చిన హమాస్ నేత ప్రస్తుతం ఆ సంస్థకు చీఫ్ గా ఉన్న యాహ్యా సిన్వార్ ను హతమార్చింది ఇజ్రాయెల్. గాజా దక్షిణ ప్రాంతమైన రఫాలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చేసిన ఆపరేషన్ లో సిన్వార్ మరణించాడు. ఈ ఆపరేషన్ లో సిన్వార్ తో పాటు ముగ్గురు హమాస్ మిలిటెంట్లు చనిపోయినట్లుగా తెలుస్తోంది.

ఇజ్రాయెల్ గత కొన్నేళ్లుగా సిన్వార్ గురించి వెతుకుతోంది. ముఖ్యంగా అక్టోబర్ 7 దాడి తర్వాత సిన్వార్.. ఇజ్రాయెల్ ప్రైమ్ టార్గెట్ గా మారాడు. ఇటీవల ఇరాన్, టెహ్రాన్ లో అనూహ్య పరిస్థితుల్లో హమాస్ పొలిటికల్ బ్యూరో చీఫ్ గా ఉన్న ఇస్మాయిల్ హనియే చనిపోయాడు. ఆ తర్వాత సిన్వార్ బాధ్యతలు తీసుకున్నాడు. బాధ్యతలు చేపట్టిన నెల రోజులకే హతమయ్యాడు.

ఇజ్రాయెల్ జైల్లో 22ఏళ్లు గడిపిన సిన్వార్ 2011లో ఇజ్రాయెల్ సైనికులను కిడ్నాప్ చేసిన సమయంలో హమాస్-ఇజ్రాయెల్ మార్పిడి ఒప్పందంలో భాగంగా విడుదలై గాజాలోకి వెళ్లాడు. అనంతరం హమాస్ లో సీనియర్ నేతగా ఎదిగాడు. ఈ క్రమంలోనే హమాస్ మాజీ చీఫ్ ఇస్మాయిల్ జూలై 31న ఇరాన్ లో హత్యకు గురైన అనంతరం.. ఆ సంస్థ అధినేతగా బాధ్యతలు చేపట్టాడు. బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకపోవడం, ఎక్కువగా కనిపించకపోవడమే సిన్వార్ ఇంతకాలం బతికేందుకు కారణమైంది.

యుద్ధం ప్రారంభమైన తర్వాత పలువురు హమాస్ కీలక నేతలు, కమాండర్లు చనిపోయినా.. సిన్వార్ జాడ దొరకలేదు. గాజా యుద్ధం తీవ్రం కావడంతో సిన్వార్ దాదాపు ఎలక్ట్రానిక్ డివైజ్ ను వాడటం మానేశాడు. కేవలం కొరియర్ వ్యవస్థపైనే ఆధారపడ్డాడు.

గత ఏడాది అక్టోబర్ 7న హమాస్.. రాకెట్లతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడింది. హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ భూభాగంలోకి ప్రవేశించి దొరికిన వారిని దొరికినట్లుగా చంపేశారు. ఆడ, మగ, పిల్లలు అనే తేడా లేకుండా 1200మందిని చంపేశారు. 251 మందిని గాజాలోకి బందీలుగా తీసుకెళ్లారు. వీరిలో 90 మంది వరకు ఇంకా గాజాలోనే బందీలుగానే ఉన్నారు. అప్పటి నుంచి హమాస్-ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 40వేల మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారు.

 

Also Read : ఇజ్రాయెల్ దాడిలో చనిపోయే ముందు యాహ్యా సిన్వార్ ఏం చేశాడో తెలుసా.. డ్రోన్ వీడియో వైరల్