ఆఫ్ఘనిస్థాన్ మరోసారి బాంబు పేలుడుతో దద్దరిల్లింది. దేశంలో సెప్టెంబర్ నెల ఆఖరులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అఫ్ఘనిస్థాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనికి అనుకూలంగా నిర్వహించిన ఎన్నికల సభను లక్ష్యంగా చేసుకుని ఈ బాంబు దాడి జరిగింది. సెంటర్ పర్వాన్ ప్రావిన్స్‌లో జరిగిన ఈ బాంబు దాడిలో 24 మంది మృతి చెందారు. మరో 30కి మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడినవారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. గాయపడినవారిలో మహిళలు…చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారనీ ప్రావిన్షియల్ హాస్పిటల్ హెడ్ అబ్దుల్ ఖాసిం సంగిన్ తెలిపారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది.
కారులో పేలుడు పదార్థాలతో వచ్చిన దుండగులు కారుతో పాటు తనను తాను పేల్చుకున్నట్లు పర్వాన్ గవర్నర్ వహీద్ షాకర్ ప్రకటించారు. మృతుల్లో ఇప్పటి వరకు ఎనిమిది మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. కాబూల్ పట్టణంలో యూఎస్ ఎంబసీకి సమీపంలో కూడా మరో పేలుడు సంభవించింది.
కాగా..పేలుడు జరిగిన సమయంలో సభలో ప్రెసిడెంట్ అష్రఫ్ ఘని ఉన్నారనీ..ఆయనకు ఎటువంటి ప్రమాదమూ జరగలేదని హమీద్ అజీజ్ అసోసియేటెడ్ ప్రెస్ వార్తా సంస్థ వెల్లడించింది. ర్యాలీ ఎంట్రన్స్ సమీపంలో ఈ పేలుడు జరిగిందనీ గవర్నర్ ప్రతినిధి వహీదా షాకర్ తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ దేశవ్యాప్తంగా సెప్టెంబర్ నెలాఖరులో అధ్యక్ష ఎన్నికలకు దేశం సిద్ధమవుతున్న క్రమంలో ఈ బాంబు దాడి జరిగింది.