బ్రిటన్ లో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకే మరోసారి ఓటర్లు పట్టం కట్టారని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మొత్తం 650 సీట్లకు గాను అధికార కన్జర్వేటివ్ పార్టీ(టోరీస్)కి 368 స్థానాలు వస్తాయని, ప్రతిపక్ష లేబర్ పార్టీకి 191 సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనావేశాయి. ఇక బ్రెగ్జిట్ పార్టీకి ఒక్కటీ రాదని తేల్చేశాయి. ఐదేళ్లలోపు వ్యవధిలో ఇది మూడో సార్వత్రిక ఎన్నిక. 1923 తర్వాత తొలిసారిగా ఈసారి డిసెంబర్‌లో ఈ ఎన్నిక జరిగింది.
1987 తర్వాత కన్జర్వేటివ్ పార్టీకి ఇదే అతిపెద్ద విజయం అవుతుందని, 1935 తర్వాత లేబర్ పార్టీకి అతిపెద్ద ఓటమి అవుతుందని పోల్ తెలిపింది. లేబర్ పార్టీ 71 స్థానాలు కోల్పోతుందని అంచనా వేశాయి. 2017తో పోలిస్తే కన్జర్వేటివ్ పార్టీ 2017తో పోలిస్తే 86 స్థానాలు అధికంగా సాధిస్తున్నట్లు ఓ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో తేలింది.
లేబర్ పార్టీ ఒకప్పటి కంచుకోటలైన బ్లిత్, డార్లింగ్టన్, వర్కింగ్టన్ లాంటి స్థానాల్లో కన్జర్వేటివ్ పార్టీ జెండా ఎగరేయనుందని తెలిపింది. ఇక్కడ టోరీలు గెలవడం కొన్ని దశాబ్దాల్లో ఇదే ప్రథమం కానుంది. 2017తో పోలిస్తే లేబర్ పార్టీ ఓటింగ్ దాదాపు 12 శాతం పడిపోతుందని, కన్జర్వేటివ్‌ల ఓటింగ్ రెండున్నర శాతం పెరుగుతుందని, చిన్న పార్టీల ఓటింగ్ శాతాలు మెరుగుపడతాయని సర్వే అంచనా వేసింది. ఎన్నికల ఫలితాలు శుక్రవారం(డిసెంబర్-13,2019)సాయంత్రానికి వెలువడనున్నాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలు వచ్చాక డాలర్‌తో పోలిస్తే పౌండ్ విలువ మూడు శాతం పెరిగింది. ఈ ఏడాది మే నుంచి ఇదే అత్యధిక పెరుగుదల. యూరోతో పోలిస్తే మూడున్నరేళ్ల గరిష్ఠానికి పౌండ్ విలువ ఎగబాకింది.