Afganistan
normal conditions in Afghanistan : అఫ్ఘానిస్తాన్ మళ్లీ తాలిబన్ల హస్తగతం అయిన సంగతి తెలిసిందే. తాలిబన్లు కాబూల్‌ను స్వాధీనం చేసుకున్నారు. 10 రోజులుగా దేశంలోని ప్రధాన నగరాలను ఆక్రమిస్తూ కాబూల్‌లోకి దూసుకెళ్లారు. ఆఫ్ఘానిస్తాన్ ప్రభుత్వం తాలిబన్లకు లొంగిపోయింది. అధ్యక్ష పదవికి ఘనీ రాజీనామా చేసి, దేశం విడిచి పారి పోయారు. మాజీ రక్షణ మంత్రి అలీ అహ్మద్ జలాలీని తాత్కాలిక అధ్యక్షుడిగా నియమించారు. ఆఫ్ఘాన్ ప్రజలు బిక్కుబిక్కు మంటున్నారు.
గత రెండు రోజులుగా భయంతో అల్లాడిపోతున్న ఆఫ్ఘానిస్తాన్‌లో త్వరలోనే సాధారణ వాతావరణం నెలకొనే అవకాశం కనిపిస్తోంది. అధిక సంఖ్యలో ప్రజలు ఇళ్లకే పరిమితం అయినప్పటికీ.. కాబూల్‌లో కొంతమంది భయం భయంగానే బయటికు వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులతో బుర్ఖా ధరించి బయటకు వస్తున్నట్లు సమాచారం. ఆఫ్ఘాన్ ప్రజలకు క్షమాభిక్ష ప్రసాదించామంటూ తాలిబన్లు ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో కొన్నిచోట్ల వ్యాపారులు ధైర్యం చేసి మార్కెట్లు తెరిచే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు ఆఫ్ఘాన్ టీవీ ఛానళ్లల్లో తాలిబన్ బోధనలు ప్రారంభమయ్యాయి. మహిళా యాంకర్లు, మహిళా రిపోర్టర్లు తెర మీదకు వస్తున్నారు. ఈ క్రమంలో ఆఫ్ఘాన్ టాప్ ఛానల్ టోలో న్యూస్ చానెల్‌కు తాలిబన్ ప్రతినిధి అబ్దుల్ హక్ హమ్మద్ మహిళా యాంకర్ బెహెస్తాకు ఇంటర్వ్యూ ఇవ్వడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫొటోలను టోలో న్యూస్ ట్విటర్‌లో షేర్ చేసింది. అయితే ఈ విషయంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
తాము మారిపోయామని నమ్మించడానికే తాలిబన్లు ఇలా చేస్తున్నారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కనీసం మహిళకు ఇంటర్వ్యూ ఇవ్వడానికైనా ఒప్పుకొన్నారని, అయినా ఎందుకో కాస్త అనుమానంగానే ఉందంటూ భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆఫ్ఘాన్‌లో మానవ హక్కులను కాలరాస్తున్నారంటూ యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
‘‘తాలిబన్లపై మాకు నమ్మకం లేదు. తాలిబన్లు వైరస్, క్యాన్సర్ లాంటివాళ్లు. తాలిబన్లు మారారు అనుకోవడం అవివేకం. అఫ్ఘాన్ అభివృద్ధికి భారత్ చాలా సహాయం చేసింది. తాలిబన్లు, పాకిస్తాన్, చైనా ముగ్గురూ భారత్‌కు శత్రువులే. తాలిబన్లను తరిమికొట్టే శక్తి భారత్‌కు ఉంది’’ అంటూ కామెంట్లు చేయడం గమనార్హం.