ట్రంప్ హత్యకు యత్నం? ట్రంప్ ఫ్లోరిడా రిసార్టులో సాయుధుడిని కాల్చి చంపిన భద్రతా బలగాలు
అతడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, పామ్ బీచ్ కౌంటీ షెరీఫ్ అధికారి కాల్చారని సంస్థ తెలిపింది. దీనిపై వైట్ హౌస్ నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఓ వ్యక్తి కుట్రపన్నినట్లు తెలుస్తోంది. అమెరికా సీక్రెట్ సర్వీస్ (అమెరికా అధ్యక్షుడు వంటి ప్రముఖుల భద్రత చూసే కేంద్ర భద్రతా సంస్థ) తెలిపిన ప్రకారం.. ఫ్లోరిడా రాష్ట్రం పామ్ బీచ్‌లోని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిసార్ట్ మార్-అ-లాగో పరిధిలోకి ఓ సాయుధుడు ప్రవేశించాడు. అతడిని భద్రతా బలగాలు కాల్చి చంపాయి. ఆదివారం ఈ ప్రకటన విడుదలైంది.
డొనాల్డ్ ట్రంప్ సాధారణంగా వారాంతాల్లో తన రిసార్ట్‌లో గడుపుతారు. అయితే, ఈ ఘటన సమయంలో ఆయన వైట్ హౌస్‌లో ఉన్నారు. ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ కూడా శనివారం రాత్రి వైట్ హౌస్‌లోనే ట్రంప్‌తో ఉన్నారు.
భద్రతా బలగాల చేతిలో కాల్పులకు గురైన వ్యక్తి పేరును వెల్లడించలేదు. సీక్రెట్ సర్వీస్ తెలిపిన ప్రకారం.. అతడు మార్-అ-లాగో నార్త్ గేటు వద్ద అనుమానాస్పదంగా కనిపించాడు.
అతడిని సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు, పామ్ బీచ్ కౌంటీ షెరీఫ్ అధికారి కాల్చారని సంస్థ తెలిపింది. దీనిపై వైట్ హౌస్ నుంచి ఇప్పటివరకు స్పందన రాలేదు.
డొనాల్డ్ ట్రంప్ గతంలో కాల్పుల ఘటనలను ఎదుర్కొన్నారు. 2024 జూలై 13న పెన్సిల్వేనియా రాష్ట్రం బట్లర్‌లో జరిగిన ప్రచార సభలో ఆయనపై హత్యాయత్నం జరిగింది, అందులో ఆయన గాయపడ్డారు.
తర్వాత 2024 సెప్టెంబర్ 15న వెస్ట్ పామ్ బీచ్‌లోని ఆయన గోల్ఫ్ మైదానం సమీపంలో తుపాకీతో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తికి ఈ నెల ప్రారంభంలో జీవిత ఖైదు విధించారు.
