76రోజుల తర్వాత గుడ్ న్యూస్, కరోనా వైరస్ ముందుగా వెలుగు చూసిన వుహాన్ లో లాక్‌డౌన్ ఎత్తివేత

ప్రపంచంలో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగుచూసింది చైనాలోని వుహాన్ నగరంలోనే. అక్కడ మొదలైన వైరస్ చైనాని సర్వ నాశనం చేసింది. ఆ తర్వాత యావత్ ప్రపంచంపై కరోనా

  • Publish Date - April 8, 2020 / 04:45 AM IST

ప్రపంచంలో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగుచూసింది చైనాలోని వుహాన్ నగరంలోనే. అక్కడ మొదలైన వైరస్ చైనాని సర్వ నాశనం చేసింది. ఆ తర్వాత యావత్ ప్రపంచంపై కరోనా

ప్రపంచంలో తొలిసారిగా కరోనా వైరస్ వెలుగుచూసింది చైనాలోని వుహాన్ నగరంలోనే. అక్కడ మొదలైన వైరస్ చైనాని సర్వ నాశనం చేసింది. ఆ తర్వాత యావత్ ప్రపంచంపై కరోనా పంజా విసిరింది. 209 దేశాలు విలవిలలాడిపోతున్నాయి. కాగా కరోనా వెలుగుచూసిన వుహాన్ నగరవాసులకు చైనా ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించింది. వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేశారు. 76 రోజుల సుదీర్ఘ సమయం తర్వాత బుధవారం(ఏప్రిల్ 8,2020) లాక్ డౌన్ ఎత్తివేయడం జరిగింది.

11 వారాల తర్వాత లాక్‌డౌన్‌కి గుడ్‌బై, స్వేచ్చగా తిరుగుతున్న వుహాన్ వాసులు:
కరోనా వైరస్ మొదట వ్యాపించింది కోటి 60 లక్షల జనాభా ఉండే వుహాన్ నగరంలోనే. దాని చుట్టూ హ్యూబే ప్రావిన్స్ ఉంది. ఈ మొత్తం ప్రదేశంలో ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలూ ఉండేవారు. కరోనా వ్యాపించిన కొన్నాళ్లకు… వుహాన్‌లో లాక్‌డౌన్ ప్రకటించిన చైనా ప్రభుత్వం… ఆ తర్వాత హ్యూబే ప్రావిన్స్ మొత్తాన్నీ నిర్బంధంలో ఉంచింది. ఇప్పుడు కరోనా వైరస్ కంట్రోల్ కావడంతో 11 వారాల తర్వాత అంటే 76 రోజుల లాక్‌డౌన్‌కి గుడ్‌బై చెప్పింది ప్రభుత్వం. దీంతో వుహాన్ వాసులు ఊపిరిపీల్చుకున్నారు. హమ్మయ్య అని రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు వుహాన్ ప్రజలు స్వేచ్ఛగా చైనా అంతా తిరిగొచ్చు.

పండుగలా లాక్ డౌన్ ఎత్తివేత.. షాపింగ్‌ మాల్స్‌, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు కిటకిట:
కరోనా పూర్తిగా అదుపులోకి రావడంతో చైనా ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది. లాక్‌డౌన్‌ను ఎత్తివేయడాన్ని వుహాన్ వాసులు పండగలా చేసుకున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నట్లు భారీ భవంతులపై లాక్‌డౌన్ ఎండ్ కౌంట్‌డౌన్‌ను ఏర్పాటు చేశారు. కరోనా ఆంక్షలు తొలగిపోవడంతో ప్రజలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. షాపింగ్‌ మాల్స్‌, ఎయిర్‌పోర్టులు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడాయి. ప్రజలు వుహాన్ నుంచి చైనాలోని వివిధ ప్రాంతాలకు బయలుదేరి వెళ్లారు.

ప్రపంచంలో ముందుగా కరోనా వెలుగుచూసింది వుహాన్ లోనే:
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వ్యాప్తికి వుహాన్ కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. కరోనా వేగంగా విస్తరించి వేలాది మంది ప్రాణాలు తీసేయడంతో చైనా ప్రభుత్వం వుహాన్‌ లో జనవరి 23 నుంచి ఆంక్షలు విధించింది. వుహాన్ సిటీ అప్పటి నుంచి లాక్‌డౌన్‌లో ఉంది. వుబేయ్ ప్రావిన్స్‌కు రాజధానికిగా ఉన్న వుహాన్‌ సిటీకి ప్రపంచంతో సంబంధాలు తెంచేసింది. అప్పటి నుంచి వుహాన్ వాసులు ఇళ్లకే పరిమితయ్యారు. 

ఇంకా వెంటాడుతున్న కరోనా భయాలు:
76 రోజుల తర్వాత ఆంక్షలు ఎత్తివేసి ప్రజలకు స్వేచ్ఛ ప్రసాదించినా… కరోనా భయం మాత్రం ఇంకా వీడలేదు… రెండోసారి కరోనా విజృంభించే అవకాశాలు లేకపోలేదని చైనా వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే జరిగితే వుహాన్‌లో మళ్లీ శవాల కుప్పులను చూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. చైనాలో నమోదైన మొత్తం కేసుల్లో 50వేలకు పైగా వుహాన్‌లో ఉన్నాయి. వుహాన్‌లోనే 2500 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ప్రభుత్వం మాత్రం మళ్లీ ఆ స్థాయి పరిస్థితులు రావంటోంది. అందుకే ప్రస్తుతానికి స్కూల్స్‌ను మినహాయించి మిగతా అన్ని ఆంక్షలను తొలగించింది.

లాక్ డౌన్ ఎత్తివేతతో సంబరాలు:
మూడు వారాలుగా వుహాన్‌లో కొత్త కరోనా కేసులు, మరణాలూ బాగా తగ్గిపోవడంతో ప్రభుత్వం లాక్‌డౌన్ ఎత్తేసింది. బుధవారం వుహాన్‌ ప్రజలు స్వేచ్ఛగా ఇళ్ల నుంచి బయటకొచ్చారు. అయితే వారంతా ప్రభుత్వం చెప్పిన ఓ మొబైల్ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఆ యాప్… వాళ్లు ఎక్కడెక్కడికి వెళ్లినా… ట్రాక్ చేస్తూ ఉంటుంది. అలాగే వారు హెల్తీగా ఉన్నారో లేదో కూడా ప్రభుత్వానికి చెబుతుంది. లాక్‌‌‌డౌన్ ఎత్తివేసి సందర్భంగా… వుహాన్‌లోని యాంగ్ట్జే నదిలో లైట్ షో ఏర్పాటుచేశారు. భవనాలు, వంతెనలకు కరోనా నుంచి కోలుకున్న పేషెంట్ల ఫొటోలు, హెల్త్ వర్కర్ల యానిమేషన్లు పెట్టారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఫొటో ప్రదర్శించి… విజయవంతమైన నగరం అని రాశారు. ప్రజలు జెండాలు ఎగరవేశారు. చైనా తీసుకున్న నిర్ణయంతో ఇప్పుడు మిగతా దేశాలు కూడా లాక్‌డౌన్ ఎత్తివేసే విషయంలో ముందుకు కదిలే అవకాశం ఉంది. అయితే లాక్‌డౌన్ ఎత్తివేత తర్వాత వైరస్ కట్టడికి తీసుకునే నిర్ణయాల మీదే వైరస్ వ్యాప్తి ఆధారపడి ఉంటుంది.

కరోనా కట్టడికి లాక్ డౌన్ ఒక్కటే ఆయుధం:
కరోనా వైరస్‌ వెలుగులోకి వచ్చి 5 నెలలు అవుతున్నా ఇంతవరకు వ్యాక్సిన్ కనిపెట్టలేకపోయారు. దీంతో కరోనాని కట్టడి చెయ్యడానికి లాక్‌డౌనే అసలైన అస్త్రం అని ప్రపంచ దేశాలు నమ్మడమే కాదు అమలు చేస్తున్నాయి కూడా. అయితే లాక్‌డౌన్ చేసినంత మాత్రాన కరోనా వైరస్‌ని ఆపలేరని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) చెప్పడం ఆందోళనకు గురి చేస్తోంది. ఇక లాక్‌డౌన్ వల్ల పేదలు, దినసరి కూలీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి కరువైంది. ఆదాయం ఆగిపోయింది. తిండికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. అదే సమయంలో 130కోట్ల మంది జనాబా ఉన్న భారత్ లాంటి దేశంలో కరోనా కట్టడికి లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదని, అందుకే మరికొన్ని వారాలు లాక్ డౌన్ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రాన్ని కోరుతున్నాయి. ఆర్థిక పరిస్థితిని కావాలంటే బాగు చేసుకోవచ్చు, కానీ ప్రాణాలను తిరిగి తీసుకురాలేము కదా అని ప్రభుత్వాలు అంటున్నాయి. కేంద్రం కూడా లాక్ డౌన్ పొడిగించే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వుహాన్ లో లాక్ డౌన్ ఎత్తివేస్తూ చైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది.

Also Read | ఇంటి నుంచి బయటకొస్తే కరోనా పాజిటివ్, ఈ దేశానికి ఎందుకొచ్చాం దేవుడా.. అమెరికాలో భారతీయుల హాహాకారాలు