చైనాలో మళ్లీ కరోనా విజృంభణ, 24గంటల్లో 100 కేసులు, 3నెలల తర్వాత ఇదే తొలిసారి

  • Published By: naveen ,Published On : July 30, 2020 / 11:40 AM IST
చైనాలో మళ్లీ కరోనా విజృంభణ, 24గంటల్లో 100 కేసులు, 3నెలల తర్వాత ఇదే తొలిసారి

Updated On : July 30, 2020 / 12:15 PM IST

కరోనా వైరస్‌ మహమ్మారికి పుట్టినిల్లుగా యావత్ ప్రపంచం భావిస్తున్న చైనాలో మళ్లీ కలకలం రేగింది. చైనాలో మరోసారి కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో కొవిడ్‌ కేసులు నమోదవుతుండగా తాజాగా ఒకేరోజు 100పైగా పాజిటివ్‌ కేసులు బయటపడటం ఆందోళనకు గురి చేస్తోంది. కేవలం షిన్‌జియాంగ్‌ ప్రాంతంలోనే 89కేసులు నమోదయ్యాయి. గడిచిన మూడు నెలల కాలంలో ఒకేరోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.

ఏప్రిల్‌ 13న ఒకేరోజు 108కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రోజువారి కేసుల సంఖ్య 100 దాటలేదు. గత 7నెలల క్రితం మొదలైన వైరస్‌ విజృంభణ చైనాలో చాలా ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. కేసులు బయటపడుతున్న చోట కఠిన ఆంక్షలు అమలు చేయడంతో పాటు భారీ స్థాయిలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఒక్క బీజింగ్‌లోనే దాదాపు 10లక్షల పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఇక డాలియన్‌, ఝావోలైన్‌ నగరాల్లోనూ దాదాపు 30లక్షల కొవిడ్‌ పరీక్షలు చేపట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది.

చైనాలో ఇప్పటివరకు 84వేల 60 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 4వేల 634 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కోటి 67లక్షల మందికి వైరస్‌ సోకగా వీరిలో 6లక్షల 60వేల మంది చనిపోయారు. చైనాలోని వుహాన్ లో వెలుగుచూసిన కరోనా వైరస్, యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. సుమారు 200కుపై దేశాలకు కరోనా వ్యాపించింది. ప్రజలు ప్రాణాలను మాస్క్ లో పెట్టుకుని బతుకుతున్నారు. వ్యాక్సిన్ వచ్చే వరకు జాగ్రత్తగా ఉండాల్సిందేనని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం, వ్యక్తిగత శుభ్రత ప్రతిఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు.

ఇటీవలే కరోనా మహమ్మారి నుంచి చైనా బయటపడింది. కేసులు అదుపులోకి రావడంతో ప్రజలు రిలీఫ్ అయ్యారు. ఇంతలోనే మళ్లీ కేసులు నమోదు కావడం వారిని ఆందోళనకు గురి చేస్తోంది. వుహాన్ లోని సీఫుడ్ మార్కెట్లలో చల్లని కలుషిత వాతావరణమే వైరస్ కు పుట్టినిల్లుగా మారిందని నిపుణులు చెప్పారు. అక్కడ పుట్టిన వైరస్, తుంపర్ల ద్వారా ప్రజలకు సంక్రమించిందన్నారు. తేమ శాతం ఎక్కువగా, ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్న వాతావరణం కరోనా వైరస్ కు అనువుగా మారిందని, అది బతికేందుకు అవకాశం కల్పిస్తోందని నిపుణులు అన్నారు. జూన్ లో చైనా రాజధాని బీజింగ్ లో కరోనా వైరస్ విజృంభణకు కారణం జిన్ఫాడీ మార్కెట్. ఆ మార్కెట్ లో వైరస్ ను నియంత్రించడానికి ఫ్లోరోసెంట్ పౌడర్ వాడారు. అది వాతావరణాన్ని కలుషితం చేసింది. ఆ తర్వాత తుంపర్ల ద్వారా వైరస్ మనుషులకు సంక్రమించింది అని నిపుణులు చెప్పారు.