Uganda : మేము మనుషులకు తక్కువేం కాదు.. చింపాంజీల మధ్య అంతర్యుద్ధం.. గ్రూపులుగా విడిపోయి దారుణాలు..
Uganda : ఉగాండాలో చింపాజీలు రెండు వర్గాలుగా విడిపోయి చంపుకుంటున్నాయి. వారాలు కాదు.. నెలలు కాదు.. ఏకంగా కొన్నేళ్లుగా వర్గాలుగా విడిపోయి అమితుమీ తేల్చుకుంటున్నాయి.
Chimpanzees
Uganda : రాజకీయ విభేదాల కారణంగానో.. మరే ఇతర కారణాల వల్లనో.. మనుషులు గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకోవటం చూస్తుంటాం. ఒకరిపైఒకరు దాడులు చేసుకొని చంపుకొనే పరిస్థితులు కూడా తలెత్తుతాయి. ఈ క్రమంలో అనేక మంది ప్రాణాలు కోల్పోతుంటారు. అయితే, చింపాంజీలు కూడా మనుషులకు పోటీగా వస్తున్నాయి. మేము మనుషులకు ఏమాత్రం తక్కువ కాదంటూ నిరూపిస్తున్నాయి. మాలోనూ గ్రూపులు, విభేదాలు, చంపుకోవటాలు ఉంటాయని చెబుతున్నాయి.
ఉగాండాలో చింపాజీలు రెండు వర్గాలుగా విడిపోయి చంపుకుంటున్నాయి. వారాలు కాదు.. నెలలు కాదు.. ఏకంగా కొన్నేళ్లుగా వర్గాలుగా విడిపోయి అమితుమీ తేల్చుకుంటున్నాయి. సైన్స్ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఉగాండాలో కిబాలే పేరుతో ఓ నేషనల్ పార్కు ఉంది. ఇందులో 200కుపైగా చింపాంజీలు ఉన్నాయి. 1995 నుంచి 2015 వరకు కలిసిమెలిసి ఉన్న చింపాజీల మధ్య 2015లో విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో అదే ఏడాది జూన్ 24న నేషనల్ పార్కులో చింపాంజీలు గ్రూపులుగా విడిపోయి తన్నుకున్నాయి. ఆ తరువాత ఒక గ్రూపునకు చెందిన చింపాజీలు సెంట్రల్, మరో గ్రూపునకు చెందిన చింపాంజీలు వెస్టర్న్ దగ్గరికి వచ్చాయి.
వైరం మొదలయ్యాక నేషనల్ పార్కులో అవి ఉండే ప్రదేశాన్ని బట్టి పరిశోధకులు ఆ చింపాంజీలకు సెంట్రల్ గ్రూపు, వెస్టర్న్ గ్రూపు అని పేర్లు పెట్టారు. 2017కల్లా ఈ రెండు గ్రూపులు నేషనల్ పార్కులో తమ నివాస ప్రాంతాలను సుస్థిరం చేసుకున్నాయి. మరో గ్రూపునకు చెందిన చింపాంజీలను తమ అడ్డాలోకి రాకుండా అవి పహారాగా ఉండేవి.
2018లో ఈ రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణ జరగడంతో పలు చింపాజీలు చనిపోయాయి. అయితే, వీటి మధ్య గొడవలు రావడానికి ప్రధాన కారణం ఆహారం కొరతేనని పరిశోధకులు భావిస్తున్నారు. భారీ సంఖ్యలో చింపాంజీలు నేషనల్ పార్కులో ఉండటంవల్ల ఆహారం విషయంలో ఇవి రెండు గ్రూపులుగా విడిపోయి తన్నులాడుకోవటం, చంపుకోవటం వరకు వెళ్లాయని పరిశోధకులు పేర్కొంటున్నారు. చింపాంజీల అంతర్యుద్దం శాస్త్రవేత్తలకు, జంతు అధ్యయనవేత్తలకు మిస్టరీగా మారింది.
మరోవైపు.. 2014లో కొన్ని వృద్ధ చింపాంజీలు చనిపోయాయి. ఆ తరువాత ఉన్న చింపాంజీల మధ్య విభేదాలు తలెత్తడం, వాటిని కలిపిం ఉంచే పెద్ద చింపాంజీలు లేకపోవటం వల్ల చింపాంజీలు గ్రూపులుగా విడిపోయి చంపుకునే స్థాయికి వెళ్లాయని జంతు అధ్యయనవేత్త ఒకరు పేర్కొన్నారు.
