కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 5,417కు కరోనా మృతుల సంఖ్య చేరింది.
కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 5,417కు కరోనా మృతుల సంఖ్య చేరింది. లక్షా 45 వేల 413 మంది కరోనా బాధితులు ఉన్నారు. 6 వేల 116 మందికి సీరియస్ గా ఉంది. కరోనా వైరస్ 139 దేశాలకు పాకింది. ఇటలీలో కరోనా మృత్యుఘోష ఆగడం లేదు..అంతకంతకూ పెరిగిపోతోన్న కేసులతో అల్లాడిపోతోంది. ఒక్కరోజే 189 మంది చనిపోయారు.
ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా పౌరులు చనిపోయారు. దీంతో ఇటలీ దేశం ఇప్పుడు ఓ నిశ్శబ్దప్రాంతంగా మారిపోయింది. ఫుడ్ స్టోర్స్, ఫార్మసీలు..ఈ రెండూ తప్ప ఇటలీలో ఇప్పుడు ఏ దుకాణం తెరిచి కన్పించడం లేదు..ఎటు చూసినా రెస్టారెంట్లు..షాపులు..బార్లు..స్కూళ్లు..కాలేజీలు..ఆఫీసులు అన్నీ అన్నీ మూసేసి కన్పిస్తున్నాయ్. దేశం మొత్తం శ్మశాన వాతావరణాన్ని తలపిస్తోంది. కరోనా వైరస్ ఉధృతి ఇలానే కొనసాగితే ఇటలీలో మానసిక వ్యాధులు ప్రబలే అవకాశం కూడా కన్పిస్తోంది.
ఇరాన్‌లో కరోనా వైరస్ మరణ మృదంగం వాయిస్తోంది. వైరస్ కారణంగా ఇక్కడ ఒక్క రోజే 75మంది చనిపోయారు. మొత్తం 31 ప్రాంతాలలో కరోనా విలయతాండవం చేస్తోంది. కరోనా తాకిడికి ఇరాన్ అల్లాడిపోతోంది. చైనా తర్వాత అత్యంత కరోనా ప్రభావిత దేశంగా మారిన ఇరాన్‌లో మృత్యుఘంటికలు ఆగడం లేదు. తమ దేశంలోని వాతావరణ పరిస్థితులే వైరస్‌ని అడ్డుకుంటాయన్నట్లుగా నిర్లక్ష్యం చేయడమే ఇప్పుడా దేశం పాలిట శాపంగా మారింది. ఫిబ్రవరి19 వరకూ కూడా ఇక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇక్కడ కోవిడ్ ప్రభావమే లేదని చెప్పిన ఇరాన్ హెల్త్ మినిస్టర్‌కే జబ్బు సోకడం ఇక్కడి నిర్లక్ష్యానికి..పరిస్థితికి అద్దం పడుతోంది.
భారత్ లో ఇద్దరు కరోనా వైరస్ సోకి మృతి చెందారు. ఢిల్లీలో కరోనా వైరస్ కారణంగా ఓ మహిళ మృతి చెందింది. దేశంలో మహమ్మారి కారణంగా రెండో మృతి నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఢిల్లీలో కరోనా పాజిటివ్‌గా నమోదైన వారిలో మహిళ ఆరోవది. హైబీపీ, డయాబిటిస్ ఉన్న ఆమె కరోనాను జయించలేకపోయింది. పశ్చిమబెంగాల్‌లో ఉండే ఆమెకు కొడుకు ద్వారా వైరస్ సోకింది.
Also Read | ఏపీలో మినీ హెల్త్ ఎమర్జెన్సీ: 1897 చట్టం అమల్లోకి!
గురువారం కర్ణాటకలో 76ఏళ్ల వృద్ధుడు చనిపోయిన తర్వాతి రోజే మహిళ చనిపోయింది. దీంతో భారత్‌లో కరోనా కేసులు 85కు చేరాయి. కేరళలో కరోనా సోకిన వ్యక్తులు ముగ్గురు డిశ్చార్జి కాగా, మరో ఏడుగురి పరిస్థితి చక్కబడిందని, వారిని కూడా ఇంటికి త్వరలోనే పంపేస్తామని వైద్యులు చెబుతున్నారు.