సాధారణ బీపీ మాత్రలతోనే కరోనాకు చెక్, మరణాలను తగ్గించొచ్చు.. సైంటిస్టులు

  • Published By: naveen ,Published On : August 24, 2020 / 03:30 PM IST
సాధారణ బీపీ మాత్రలతోనే కరోనాకు చెక్, మరణాలను తగ్గించొచ్చు.. సైంటిస్టులు

Updated On : August 24, 2020 / 4:21 PM IST

అవును. కోట్లాది మంది వాడే సాధారణ బీపీ మాత్రలతోనే కరోనాకు చికిత్స చేయొచ్చని సైంటిస్టులు అంటున్నారు. అంతేకాదు మరణాల ముప్పుని గణనీయంగా తగ్గించొచ్చని చెబుతున్నారు. ఈ మేరకు తమ అధ్యయనంలో తేలిందన్నారు. బ్రిటన్‌లో హై బీపీ కోసం వాడే మందులు కరోనా కారణంగా మరణించే ముప్పును 33 శాతానికిపైగా తగ్గిస్తున్నాయని తాజా పరిశోధనలో తేలింది. యాంజియోటెన్సిన్- కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ), యాంజియోటెన్సిన్ రిసెపర్టర్ బ్లాకర్స్ (ఏఆర్‌బీ) అనే మందులను హైబీపీ, హార్ట్ ఎటాక్, డయాబెటిస్ కోసం వాడుతుంటారు. ఈ మందులు వేసుకున్న వారిలో కరోనాతో చనిపోయే ముప్పు గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.



తమ పరిశోధనలో భాగంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 28వేల 872 మంది కొవిడ్‌ పేషెంట్ల వివరాలను పరిశీలించామని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఎంజిలా పరిశోధకులు తెలిపారు. అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. కాగా, కరోనా చికిత్సలో భాగంగా హై బీపీ లేని వారు ఈ ఔషధాలను వాడవచ్చా? అనే దిశగా మరింత పరిశోధనలు జరపాల్సి ఉందంటున్నారు.



డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలతో బాధపడుతున్న పేషెంట్లు ఏసీఈ, ఏఆర్‌బీలను వాడినప్పుడు వారిలో కరోనా తీవ్రత తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. కరోనా సోకక ముందు నుంచి ఈ మందులు వాడుతున్న వారిలో వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంది. కానీ, కరోనా సోకిన తర్వాత ఈ మెడిసిన్ తీసుకుంటే.. వైరస్‌ ప్రభావం తక్కువగా ఉందని చెప్పడానికి మాత్రం ఆధారాలు లేవని పరిశోధకులు స్పష్టం చేశారు.