డిసెంబర్ చివరి నాటికి మార్కెట్‌లోకి కరోనా వ్యాక్సిన్, ధర రూ.10వేల లోపే

ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ ను మార్కెట్ లో విడుదల చేస్తామని చైనా ఫార్మా కంపెనీ సైనో ఫార్మ్ తెలిపింది. టీకా ధర (టూ షాట్స్) రూ.10వేలు కన్నా తక్కువగానే ఉంటుందని చెప్పింది. క్లినికల్ ట్రయల్స్ దశలన్నీ పూర్తయ్యాక మార్కెటింగ్ విధానం పై సమీక్ష నిర్వహిస్తామని చైనా ఫార్మాక్యూటికల్ కంపెనీ సైనో ఫార్మ్ చైర్మన్ లూ జింగ్ చెన్ చెప్పారు.
జనాభా మొత్తానికి టీకా అవసరం లేదు:
”ప్రధాన నగరాల్లోని విద్యార్థులు, వర్కర్లకు టీకా అందాల్సిన అవసరం ఉంది. అయితే ఎక్కువ జనాభా కలిగి ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి కాదు. దేశంలోని 140 కోట్ల మంది జనాభా టీకా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నేను వ్యాక్సిన్ తీసుకున్నా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇన్ యాక్టివేటేడ్ వ్యాక్సిన్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యాక, దాని ధర ఎక్కువగా ఉండదు. రెండు షాట్ల టీకా ధర సుమారుగా 10వేల రూపాయల లోపే ఉంటుంది” అని లూ జింగ్ అన్నారు.
రెండు షాట్లు తీసుకుంటేనే 100శాతం రక్షణ:
”ఒక షాట్ టీకా మాత్రమే తీసుకుంటే, 97శాతం వరకే రక్షణ లభించే సంభవం ఉంది. యాంటీ బాడీస్ నెమ్మదిగా అభివృద్ది చెందుతున్నాయి. అదే రెండు షాట్ల టీకా తీసుకుంటే, 100శాతం రక్షణ లభించే చాన్సు ఉంది” అని లూ జింగ్ అన్నారు. ”తొలి షాట్ టీకా తీసుకున్న తర్వాత 28 రోజుల గ్యాప్ ఇచ్చి రెండో షాట్ టీకా తీసుకోవాలి. కొన్ని ప్రత్యేక కేసుల్లో, ఒకేసారి రెండు టీకా ఇంజెక్షన్లు తీసుకోవచ్చు. కుడి చేతికి ఒకటి, ఎడమ చేతికి ఒకటి తీసుకోవచ్చు. ఎప్పుడు టీకా తీసుకున్నా నాలుగు గ్రాములు ఇంజెక్ట్ చేస్తారు” అని సైనో ఫార్మ్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. సైనో ఫార్మ్ రెండు ఇన్ యాక్టివేటేడ్ టీకాలను అభివృద్ధి చేస్తోంది. బీజింగ్, వుహాన్ లో వేర్వేరుగా టీకాలు తయారు చేస్తోంది. ప్రస్తుతం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ నడుస్తోంది.
సమర్థవంతమైన వ్యాక్సిన్ తయారు చేస్తే కానీ రక్షణ లభించదు:
యావత్ ప్రపంచం వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. టీకా ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని నిరీక్షిస్తున్నారు. అయితే సమర్థవంతమైన వ్యాక్సిన్ తయారు చేస్తే కానీ కరోనా వైరస్ నుంచి మనుషులకు రక్షణ లభించదు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వైరస్‌ను ఎదుర్కొనేలా శరీరంలోని రోగనిరోధక శక్తికి వ్యాక్సిన్ శిక్షణనిస్తుంది. తద్వారా వైరస్ సోకినా జనం జబ్బుపడకుండా ఉంటారు. ఒక వ్యాక్సిన్‌ను తయారు చేయాలంటే సంవత్సరాలు పడుతుంది. కొన్నిసార్లు దశాబ్దాలు కూడా పట్టొచ్చు. అయితే కొవిడ్ టీకా మాత్రం కొన్ని నెలల్లోనే వచ్చే అవకాశం ఉందంటున్నారు సైంటిస్టులు.
160కి పైగా టీకాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు:
కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా? అని ప్రపంచమంతా వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. 160కి పైగా టీకాలపై ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. వీటిలో కొన్ని మూడో దశ ప్రయోగాల వరకు వచ్చాయి. ఎన్ని ప్రయోగాలు జరుగుతున్నా అవి మార్కెట్‌లోకి ఎప్పుడు వస్తాయనే దానిపై స్పష్టత లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని పరీక్షలూ పూర్తి చేసుకుంటూ రేసులో దూసుకొచ్చింది రష్యా. ఈ ప్రకటనే ఇప్పుడు ఆశలు రేపుతోంది. కరోనాపై టీకాను సిద్ధం చేస్తున్నట్లు ఒడెర్నా, ఆస్ట్రాజెనెకా, సినోవాక్, భారత్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థలు ప్రకటించడంతో అందరి ఆశలు చిగురించాయి. పరిశోధన, అభివృద్ధిలో సానుకూల ఫలితాలతో ఒడెర్నా, ఆస్ట్రాజెనెకాతో పాటు భారత్ బయోటెక్ రేసులో నిలిచింది. వీటన్నింటినీ దాటుకుని రష్యాకు చెందిన సెచెనోవ్ యూనివర్సిటీ ముందుకు దూసుకొచ్చింది.
12 దేశాలు.. 160కి పైగా టీకాలు
ప్రపంచవ్యాప్తంగా 12 దేశాల్లో 160కి పైగా టీకా అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇందులో 12 సంస్థల టీకా ప్రయోగాలు ఆశాజనకంగా ఉన్నాయి. వీటిలో భారత్‌కు చెందిన భారత్ బయోటెక్, జైడస్ క్యాడిలా ప్రయోగాలు చేస్తున్నాయి. చైనా, అమెరికా, జర్మనీ, బ్రిటన్, ఆస్ట్రేలియా దేశాలు సైతం టీకా అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నాయి. అమెరికాలో మెర్క్‌తో పాటు జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీలు ఇదే పనిలో ఉన్నాయి. వీటి ఫలితాలు విజయవంతమైతే 2021 జులై నాటికి మార్కెట్‌లోకి టీకాలు వస్తాయని చెబుతున్నారు అమెరికాకు చెందిన నిపుణులు. వాస్తవానికి మూడు దశల్లో ప్రయోగాల అనంతరం మార్కెట్లోకి పంపించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో నేరుగా మూడో దశ పరీక్షలు చేసేందుకు అమెరికా ఎఫ్‌డీఐ నిబంధనలను సడలించింది.
తుది దశకు ఆక్స్ ఫర్డ్ పరీక్షలు:
రష్యా టీకా కంటే ముందు ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ, సినోవాక్, కాన్సినో బయోలాజిక్స్ వ్యాక్సిన్ పరిశోధనలు అందరి దృష్టినీ ఆకర్షించాయి. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా పరీక్షలు తుది దశకు చేరుకున్నాయి. మరో 2 నెలల్లో ఈ రెండూ కలిసి ఏజెడ్‌టీ 1222 టీకాను విడుదల చేస్తామని ప్రకటించాయి. ఈ టీకా మూడో దశ పరీక్షలను బ్రెజిల్‌లో నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. ఆక్స్‌ఫర్డ్ టీకాను ఉత్పత్తి చేసేందుకు భారత్‌కు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకుంది. అమెరికాకు చెందిన మోడెర్నా ఇన్‌కార్పొరేషన్ ఎంఆర్‌ఎన్‌ఏ 1273 రెండో దశ పరీక్షలు పూర్తయ్యాయి. ఈ నెలలో 30 వేల మందిపై మూడోదశ పరీక్షలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ టీకా విజయవంతమైతే ఒక ఏడాదిలో 50 కోట్ల టీకాలను ఉత్పత్తి చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేశారు. 2021కల్లా టీకా అందుబాటులోకి వస్తుందని అంటోంది మోడెర్నా.
అత్యంత చౌకగా టీకాను తెచ్చేందుకు లండన్ ఇంపీరియల్ కాలేజ్ కృషి:
మరోవైపు చైనాలోని కాన్సినో బయోలాజిక్స్ మూడు దశల ప్రయోగాలు పూర్తి చేసుకుని అనుమతులు కోసం వేచిచూస్తోంది. సినోవాక్ సైతం కరోనావాక్ పేరుతో టీకాను అభివృద్ధి చేస్తోంది. రెండు దశల పరీక్షలను పూర్తిచేసుకుంది. వీటితో పాటు ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలు టీకా కోసం పనిచేస్తున్నాయి. లండన్ ఇంపీరియల్ కాలేజ్ అత్యంత చౌకగా టీకాను తెచ్చేందుకు కృషి చేస్తోంది. జర్మనీకి చెందిన క్యూర్ వాక్ ఏజీ 2021 మధ్యలో టీకాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
భారత్‌లో బయోటెక్‌పై ఆశలు:
భారత్‌లో కొవాగ్జిన్ పేరుతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్‌పై పెద్ద ఎత్తునే ఆశలు ఉన్నాయి. ఇప్పటికే మొదటి, రెండు విడతల ప్రయోగాల కోసం భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతులు మంజూరు చేసింది. నిర్దేశించిన కేంద్రాల్లో ఇప్పటికే ప్రయోగాలు ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ప్రీ క్లినికల్ అధ్యయనాలకు సంబంధించి ఈ సంస్థ పంపిన సమాచారం ఆధారంగా పరీక్షలకూ డీసీజీఐ అనుమతి ఇచ్చింది.
అప్పటివరకు దూరం.. దూరం
వ్యాక్సిన్ వచ్చే వరకు ప్రజలు తమవంతుగా బాధ్యతగా వ్యవహరించడం ఒక్కటే మార్గమని నిపుణులు అంటున్నారు. ఈ విషయంలో ఫ్రాన్స్‌కు చెందిన నిపుణుడు ఆర్నార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనాపై 100 శాతం సమర్థంగా పనిచేసే టీకా 2021 నాటికి కూడా వచ్చే అవకాశం తక్కువేనని అన్నారు. అంతవరకు ప్రజలు భౌతిక దూరం పాటించడం సహా వైరస్ నియమాలను కఠినంగా పాటించడమొక్కటే మార్గమంటున్నారు. కాబట్టి వ్యాక్సిన్ పట్ల ఆశాభావంతో ఉంటూనే కరోనా మహమ్మారి మన దరి చేరకుండా జాగ్రత్తగా వ్యవహరిద్దాం.