Covid-19 నుంచి కాపాడాల్సిందే కాటు వేస్తోంది? ఆ ఎంజైమ్ ఎందుకు ప్రమాదకరంగా మారుతోంది?

బ్యాక్టీరియాలు, వైరస్ లు,సూక్ష్మజీవుల నుంచి మన శరీరాన్ని కాపాడాల్సిన ఓ ఎంజైమ్‌.. మనకు ప్రాణాసంకటంగా మారితే..మనల్ని కాపాడాల్సినదే కాటు వేస్తే..

Covid-19 నుంచి కాపాడాల్సిందే కాటు వేస్తోంది? ఆ ఎంజైమ్ ఎందుకు ప్రమాదకరంగా మారుతోంది?

Shredder Enzyme

Updated On : September 2, 2021 / 6:00 PM IST

Shredder Enzyme Might Tear Cells Apart In Severe COVID 19 : మనలో వచ్చే చిన్న చిన్న అనారోగ్యాల్ని మన శరీరంలో ఉండే కొన్ని ఎంజైములే బాగు చేసేస్తాయి.అలాగే మన శరీరంపై దాడి చేసే వైరస్ లపై పోరాడతాయి. చాలావరకు అనారోగ్య సమస్యలు తీవ్రం కాకుండా చేస్తాయి. కానీ మన శరీరాన్ని కాపాడాల్సినవే కాటు వేస్తే..రక్షించాల్సిన ఎంజైములే భక్షిస్తే ఇక పరిస్థితి ఏంటీ? ముఖ్యంగా ఈకరోనా కాలంలో మనపై దాడి చేసే వైరస్ పై పోరాడాల్సినవే తిరిగి శరీరానికి ప్రమాదకరంగా మారితే పరిస్థితి ఏంటీ? ఇలా ఎందుకు జరుగుతోంది? అనే విషయాల గురించి తెలుసుకుందాం..

కరోనా బారినపడి చాలామంది కోలుకుంటున్నారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు కూడా. ఇంకొందరి పరిస్థితి ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితి. చాలామంది కరోనా సోకింది అని తెలియకుండానే చనిపోతుంటే..మరికొందరు కరోనా సోకిందని గుర్తించి చికిత్స చేయించుకునే క్రమంలోనే చనిపోతున్నారు. మరికొందరు కోలుకున్నాక కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. అలా కొద్దిగంటల్లోనే ఆరోగ్యం విషమించడానికి కారణం ఏమై ఉంటుంది? దీనికి కారణం ఏమిటి? అనే విషయంపై దృష్టి పెట్టిన సైంటిస్టులకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి. మన శరీరాన్ని కాపాడే ఓ ఎంజైమ్‌.. మనకు ప్రాణాసంకటంగా మారుతోందని తేల్చారు. ఏమిటా ఎంజైమ్? మనిషి శరీరాన్ని కాపాడాల్సిన ఆ ఎంజైమ్ ఎందుకు మనిషికే ఎందుకు ప్రమాదకరంగా మారుతోందన్న వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఈకరోనా కాలంలో ఎంతైనా ఉంది.

శత్రు కణాలను.. చంపడం కోసం..
మన శరీరంలోకి ప్రవేశించే బ్యాక్టీరియాలు, ఇతర సూక్ష్మజీవులను ఖతం చేయటానికి విడుదలయ్యే ఎంజైమ్‌లలో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ (సీక్రెటెడ్‌ ఫాస్ఫోలిపేస్‌ ఏ2 గ్రూప్‌ ఐఐఏ)’ ఎంజైమ్‌ చాలా కీలకమైనది. ఇది మన రోగనిరోధక శక్తికి రిలేటెడ్ పనిచేస్తుంటుంది. అది మన రక్తంలో ఉండి మన శరీరమంతా తిరుగుతుంటుంది. అలా తిరుగుతూ మన శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్, ఇతర సూక్ష్మజీవులు ప్రవేశిస్తే వాటిని వెంటనే ఖతం చేసేస్తుంది. వాటిని చుట్టుముట్టి అవి శరీరంలో పెరగకుండా హానీ చేయకముందే వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి చంపేస్తుంది. దీంతో అసలు మన శరీరంలోకి బాక్టీరియాలు,వైరస్, సూక్ష్మజీవులు ప్రవేశించినట్లే మనకు తెలియదు.వీటి పని పట్టి..శరీరాన్ని సక్రమంగా పనిచేసేలా చేయటంలో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ (సీక్రెటెడ్‌ ఫాస్ఫోలిపేస్‌ ఏ2 గ్రూప్‌ ఐఐఏ)’ ఎంజైమ్‌ చాలాకీలకంగా పనిచేస్తుంది.

సాధారణంగా సూక్ష్మజీవుల పైపొర ప్రత్యేకమైన కొవ్వు పదార్థంతో కూడి ఉంటుంది. ఈ ఎంజైమ్‌ ఆ పొర ఆధారంగానే గుర్తించి దానిపై దాడి చేస్తుంది.మానవ కణాల్లోనూ ఈ కొవ్వుపదార్థం ఉంటుంది. కానీ పూర్తిగా ఉపరితలంపై ఉండదు. ఈ కొవ్వుపొరకుపైన ఇతర పదార్థాల పొర ఉండి.. కణాన్ని రక్షిస్తూ ఉంటుంది ఇది.

మన కణాలపై దాడితోనే..
సాధారణంగా మన కణాలపై ఉన్న త్వచం ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది. కానీ కరోనా వైరస్‌ కారణంగా మన శరీర కణాలు ఎంజైమ్‌ దాడికి గురవుతున్నాయి. అవయవాల్లో కణాలు నశించి, వాటి పనితీరు దెబ్బతినటం వల్ల మరణానికి దారితీస్తోంది. కరోనాతో ఆరోగ్య పరిస్థితి విషమంగా తయారైనవారిపైనా, మృతులపై.. ఫ్లాయిడ్‌ చిల్టన్‌ నేతృత్వంలో అరిజోనా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేసి ఈ ఎంజైమ్ గుట్టు విప్పారు.

ఎంజైమ్‌ ఏం చేస్తుంది?
గాయపడటం వంటివి జరిగినప్పుడు.. వైరస్, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్‌ సోకినప్పుడు..మన శరీర కణాలు బలహీనమవుతాయి. వాటి పొర దెబ్బతిని, లోపలి కొవ్వుపొరలు బహిర్గతమవుతాయి. దీనితో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్‌ ప్రభావానికి గురవుతాయి.ఈ ఎంజైమ్‌ అటువంటి కణాలపై దాడిచేసి ముక్కలు చేస్తుంది. దెబ్బతిన్న, ఇన్ఫెక్షన్‌ సోకిన కణాల వల్ల.. ఇతర కణాలకు ప్రమాదం లేకుండా శరీరంలో ఉండే ఏర్పాటు ఇది.ఇక దెబ్బతిన్న, ఇన్ఫెక్షన్‌ సోకిన కణాలు.. వాటిలోని మైటోకాండ్రియా అంటే కణంలో శక్తిని ఉత్పత్తి చేసే భాగాన్ని విడుదల చేస్తాయి. మైటోకాండ్రియాలు కొవ్వుపొరతో కూడుకుని వైరస్, బ్యాక్టీరియాను తలపించేలా ఉండటంతో.. ఎంజైమ్‌ వాటిపైనా దాడి చేసి ముక్కలు ముక్కలు చేస్తుంది.

కరోనా సోకినప్పుడు ఏం జరుగుతోంది?
సాధారణంగా ఏ వైరస్, బ్యాక్టీరియా అయినా ఇన్ఫెక్షన్‌ కొంతమేరకే ఉంటుంది. ఆ సూక్ష్మజీవులను రోగనిరోధక శక్తి చంపేయడం, అవి సోకిన కణాలను ఎంజైమ్‌ నాశనం చేయడంతో శరీరంలో వాటి వ్యాప్తి నిలిచిపోతుంది. బాధితులు సదరు ఆరోగ్య సమస్యల నుంచి కోలుకోగలుగుతారు. కానీ కరోనా విషయంలో మాత్రం ఈ పరిస్థితి చాలా భిన్నంగా ఉంటోందని ఫ్లాయిడ్‌ చిల్టన్‌ అనే సైంటిస్టు చెబుతున్నారు.కరోనా తీవ్రస్థాయిలో సోకినవారిలో వైరల్‌ భార శరీంలో ఎక్కువగా ఉంటుందని.. వైరస్ ఊపిరితిత్తులు, కిడ్నీలతో సహా పలు అవయవాల్లో పెద్ద సంఖ్యలో కణాలు ఇన్ఫెక్ట్‌ అవుతున్నాయని వెల్లడించారు. ఇలా ఇన్ఫెక్ట్‌ అయిన కణాలన్నీ కూడా ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్‌ ప్రభావానికి గురికావటం వల్లే అవుతోందని దీంతో సదరు రోగి అవయవాలు దెబ్బతింటున్నాయని తెలిపారు.కణాలపై ఎంజైమ్‌ దాడి, రోగనిరోధకశక్తి విపరీత స్పందన, దాని వెంట ఇన్‌ఫ్లమేషన్‌ శరవేగంగా జరుగుతాయి.అది మనం జారుడుబండపై జారుతూ పోతున్నట్టే ఉంటుంది. అది మనకు అర్థమయ్యేలోగానే చాలావేగంగా పరిస్థితిక్షీణించి పోతుందని దీంతో మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు.

127 మందిపై పరివోధనలు.
127 మందిని ఎంపిక చేసి వారిని పరిశోధించగా ఈ విషయాలు వెల్లడయ్యాయి. వారిలో కోవిడ్‌తో మరణించినవారు 30 మంది దాదాపు చావు అంచులదాకా వెల్లి బయటపడ్డవారు ఉన్నారు. మరో 30 మంది ఓ మాదిర లక్షణాలున్న ఇంకో 30 మంది ఉండగా.. మిగతా 37 మంది కోవిడ్‌ సోకనివారుఉన్నారు.

రక్తంలో ఉండే 1000 ఎంజైమ్‌లు, ఇతర రసాయనాల స్థాయిలు, పనితీరు.. ఈ 127 మందిలో ఎలా ఉన్నాయో సైంటిస్టులు పరిశీలించారు.దీంట్లో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్‌ చాలా కీలకమని గుర్తించారు. ఆరోగ్యవంతుల్లో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ స్థాయి లు ఒక్కో మి.మీ. రక్తంలో 10–20 నానోగ్రామ్‌ల వరకు ఉంటాయి. కానీ కరోనా మృతులు, సీరియస్‌ అయినవారిలో వెయ్యి నానోగ్రామ్‌లకుపైగా ఉన్నట్టు గుర్తించారు.

‘బ్లడ్‌ యూరియా నైట్రోజన్‌’ ఎక్కువే..
కరోనా మృతుల్లో ‘బ్లడ్‌ యూరియా నైట్రోజన్‌ (బీయూఎన్‌)’ స్థాయి ఎక్కువగా ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారు. శరీరంలో ప్రోటీన్లు జీర్ణమైన తర్వాత వ్యర్థ పదార్థంగా ‘బీయూఎన్‌’ ఉత్పత్తి అవుతుంది. కిడ్నీలు దీనిని రక్తం నుంచి ఫిల్డర్ చేసి మూత్రం ద్వారా బయటికి నెట్టేస్తాయి. అయితే కరోనా తీవ్రస్థాయికి చేరినవారిలో ఊపిరితిత్తులతో పాటు కిడ్నీలు కూడా వైరస్‌ దాడికి గురవుతున్నాయని.. ఇన్ఫెక్ట్‌ కణాలను ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్‌ వైరస్ ను కట్ చేయటంతో కిడ్నీలు దెబ్బతింటున్నాయని వారి పరిశోధనల్లో వెల్లడైందని తెలిపారు. దీనివల్లే వారి రక్తంలో ‘బీయూఎన్‌’ మోతాదు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించామని వెల్లడించారు.

ముందుజాగ్రత్తలు.. ఔషధాలకు లైన్‌క్లియర్‌
కరోనా సోకినవారిలో కొంతమంది పరిస్థితి చాలా తక్కువ సమయంలోనే విషమించి చనిపోవటానికి కారణం తేలటంతో దీనికి మెడిసిన్స్ తయారు చేయటం సులభమవుతుందని సైంటిస్టు ఫ్లాయిడ్‌ చిల్టన్‌ తెలిపారు. అంతేకాదు.. కరోనా పేషెంట్ల రక్తంలో ‘ఎస్‌పీఎల్‌ఏ–ఐఐఏ’ ఎంజైమ్, మూత్రంలో ‘బీయూఎన్‌’ శాతాన్ని ఎప్పటికప్పుడు గమనించడం ద్వారా ఆరోగ్యం విషమించే ప్రమాదాన్ని ముందే గుర్తించవచ్చని తెలిపారు. దీనికి తగిన చికిత్స చేయడం ద్వారా రోగుల ప్రాణాలు కాపాడుకోవచ్చని తెలిపారు.

ఇటువంటి పరిశోధనలు సక్సెస్ అయితే ఇక కరోనా మహమ్మారిని పూర్తిగా ఖతం చేయవచ్చనే ఆశాభావాలు వ్యక్తమవుతున్నాయి. అదే గనుక జరిగితే కరోనాకు మెడిసిన్స్ రూపొందితే ఇక మాస్కులు అవసరమే లేకపోవచ్చు. దాని కోసమే ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మెడిసిన్స్ త్వరగా లభిస్తే ఇక కరోనా మరణాలు సంభవించే అవకాశాలు లేనట్లే.