Australia : ఇంటిని బందెల దొడ్డి చేసిన ఆవులు
ఇంటి యజమాని బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి వచ్చిన పెంపుడు ఆవులు.. గందరగోళం చేశాయి. ఇంట్లోని వస్తువులను పడేశాయి. యజమానికి భారీ నష్టం మిగిల్చాయి

Australia
Australia : పెద్దలు ఇంట్లో లేని సమయంలో పిల్లలు ఇంట్లోని వస్తువులను ఎక్కడపడితే అక్కడ పడేస్తుంటారు. ఒక్కోసారి చాలా ఖరీదైన వస్తువులను ఆగం చేస్తుంటారు. కొన్ని సార్లు పెంపుడు జంతువులు కూడా ఇంట్లోని ఖరీదైన వస్తువులను కరాబ్ చేస్తుంటాయి. ఆ సమయంలో కోపం వచ్చినా వాటిని ఏమి చేయలేని స్థితిలో ఉంటారు యజమాని.. అయితే తాజాగా రెండు పెంపుడు ఆవులు చేసిన పని యజమానికి భారీ నష్టం మిగిల్చాయి.
వివరాల్లోకి వెళితే.. ఆస్ట్రేలియాలోని థస్‌మేనియాకు చెందిన చెల్సియా హింగ్టన్, రెండు ఆవులను పెంచుకుంటోంది. వాటికోసం పెరట్లో ఓ నివాసం ఏర్పాటు చేసింది హింగ్టన్.. ఇక కొద్దీ రోజుల క్రితం ఆమె తన కూతురిని స్కూల్ లో దింపేందుకు వెళ్ళింది. ఈ సమయంలోనే ఇంట్లోకి దూరిన ఆవులు ఫుర్నిచర్ మొత్తం ధ్వంసం చేశాయి. మల, మూత్రాలను విసర్జించాయి. ఖరీదైన గాజు వస్తువులను పగులగొట్టాయి. పేపర్లు, వస్తువులను కిందపడేశాయి.
యజమాని హింగ్టన్ ఇంటికి వచ్చే సరికి ఏమి తెలియనట్లు ఇంట్లోనే ఎంచాక్క పడుకున్నాయి. తలుపు తీసి ఉండటంతో ఆందోళన చెందిన హింగ్టన్ పరుగుపరుగున వచ్చి చూసింది. ఆ దృశ్యాలను చూసి ఆమె షాక్ గురైంది. ఆ దృశ్యాలను తన ఫోన్ లో బందించి.. ఏడవాలో నవ్వాలో తెలియక అలానే నిల్చుండిపోయింది.
దీనిపై హింగ్టన్ మాట్లాడుతూ.. ‘‘నేను భయకంపితురాలినయ్యా.. అక్కడి దృశ్యాలను నమ్మలేకపోయా. ఇంటి బయటున్న పశువుల పాక డోర్ లాక్ పాడవటంతో అవి బయటకు వచ్చేశాయి. ఇంటి వెనకాలి తలుపులనుంచి లోపలికి ప్రవేశించి నాశనం చేశాయి’’ అని వాపోయింది.