ఒకవైపు కరోనా.. మరోవైపు మిడతల దండు ముప్పు ముంచుకొస్తోంది

  • Published By: Mahesh ,Published On : April 29, 2020 / 07:19 AM IST
ఒకవైపు కరోనా.. మరోవైపు మిడతల దండు ముప్పు ముంచుకొస్తోంది

Updated On : April 29, 2020 / 7:19 AM IST

కరోనా వైరస్‌తో పోరాడుతున్న ఆఫ్రికా, ఆసియా దేశాలకు మరో ముప్పు ముంచుకొస్తోంది. లక్షలాది ఎకరాల్లో పంట పొలాలపై మిడతల దండు దాడి చేయబోతున్నాయా?
రాబోయే నెలల్లో ఆహార భద్రతకు ముప్పు వాటిల్లనుందా? అంటే అవుననే అంటున్నారు ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (FAO) నిపుణులు. కరోనాతో అల్లాడిపోతున్న తూర్పు ఆఫ్రికా దేశాల్లోని వారికి ఆహార కొరత ఆందోళన కలిగిస్తోంది. కొద్ది నెలల క్రితం మిడతల దండు విజృంభించిన సంగతి తెలిసిందే. ఇథియోపియా, సోమాలియా, పాకిస్తాన్‌తోపాటు భారతదేశంలోనూ లక్షలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. రాజస్థాన్, గుజరాత్‌ రాష్ట్రాల్లో 3,70,000 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. తెలంగాణలోని సిద్ధిపేట, మెదక్‌ జిల్లాల్లోనూ వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. 

రెండో దశలో ఇథియోపియా, కెన్యా, సోమాలియా దేశాల్లో 20 రెట్లు ఎక్కువ సంఖ్యలో మిడతల దండు దాడి చేసింది. వచ్చే జూన్‌ నాటికి మిడతల సంఖ్య 400 రెట్లు పెరిగిపోతుందని FAO నిపుణుల అంచనా వేస్తున్నారు. అంతేకాదు..  దాదాపు 60 దేశాల్లో పంట నష్టం జరగొచ్చు. కరోనా లాక్‌డౌన్‌ మధ్య ఆఫ్రికా దేశాలు మిడతల దండును అరికట్టలేని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో రాబోయే రెండు నెలల్లో ఆఫ్రికా, ఆసియా దేశాల్లో పంటలకు ముప్పు వాటిల్లనుంది. ఆఫ్రికా దేశాల నుంచి బయలుదేరే మిడతల దండు జూన్‌ నాటికి భారత్‌లో పంజాబ్, హర్యానాలతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పంటలపై దాడి చేసే అవకాశాలు ఉన్నాయని FAO హెచ్చరించింది. 

జీవిత కాలం 3 నెలలు మాత్రమే :
ఎడారి మిడత జీవిత కాలం సాధారణ వాతావరణంలో 3 నెలల వరకు ఉంటుంది. చల్లని వాతావరణంలో 6 నెలలు కూడా జీవిస్తాయి. ఎడారి ప్రాంతాల్లో నెలకు 2.5mm వర్షపాతం రెండు నెలల్లో కురిస్తే చాలు మిడతల దండు సంతతి పెరిగిపోతుంది. తగిన తేమ ఉన్న ఇసుక నేలల్లో 2–4 అంగుళాల లోతున మిడత గుడ్లు పెడుతుంది. ఒక మిడత 80 నుంచి 160 గుడ్లను పెడుతుంది.

చదరపు మీటరు స్థలంలో వందలాది మిడతలు గుడ్లు పెడతాయి. గుడ్లలో నుంచి రెండు వారాల్లో పిల్లలు బయటకు వస్తాయి. 4–6 వారాల్లో రెక్కలు సంతరించుకుంటాయి. ఇవన్నీ మిడతల దండులో చేరతాయి. అప్పటి నుంచి 3–4 వారాలు యాక్టివ్‌గా ఉండి మళ్లీ మిడత గుడ్లు పెడుతుంది. గుడ్లు పెట్టిన తర్వాత మిడత చనిపోతుంది. 8 దేశాల్లో 10 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో గుడ్లు పెట్టి సంతతిని పెంచుకుంటున్నాయి. 

నివారించలేమా? :
వాతావరణ మార్పులే మిడతల దండు దాడికి కారణమని నిపుణులు అంటున్నారు. పురుగులు మందు చల్లి సంతతిని అరికట్టే ప్రయత్నం చేయటం తప్ప మరోకటి లేదన్నారు. ఆఫ్రికాలో రెండు రకాల (Schistocerca gregaria, Locusta migratoria) మిడతలు సమస్యాత్మకంగా తయారయ్యాయి. శక్తివంతమైన పురుగుమందులను మనుషులతోను, విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లతోను పిచికారీ చేయిస్తున్నారు. పురుగులను అరికట్టే మెటార్హిజియం శిలీంధ్రం (Metarhizium sp.) చల్లుతున్నారు. మిడతలను అరికట్టాలంటే 7 నుంచి 14 రోజులు పడుతుంది.