Pahalgam Terror Strike: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు పంజా విసిరారు. మాటు వేసి అదను చూసి మారణహోమం సృష్టించారు. పర్యాటకులే టార్గెట్ గా నెత్తుటి ఏరులు పారించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతం పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రకృతి అందాలు చూస్తూ సరదాగా గడిపేందుకు వచ్చిన వారు టెర్రరిస్టుల తూటాలకు బలైపోయారు. కళ్ల ముందే తమ వారిని ఉగ్రవాదులు కాల్చి చంపుతుంటే.. కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని షాక్ కి గురి చేసింది.
జమ్మకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడిలో 26మంది మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది టూరిస్టులు ఉన్నారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులు, ఇద్దరు లోకల్స్ ఉన్నారు. కాగా, 2019 ఆగస్టులో జమ్మకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగిన అతిపెద్ద ఉగ్రదాడి ఇదే.
Also Read: హృదయవిదారకం.. ఉగ్రవాదులేమో అనుకుని.. నిజమైన భారత ఆర్మీని చూసి భయంతో వణికిపోయిన పర్యాటకులు..
సడెన్ గా ముష్కరులు ఎందుకిలా దాడికి తెగబడ్డారు? జమ్ముకశ్మీర్ లో ఈ మారణహోమానికి కారణం ఏంటి? టూరిస్టులను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారు? అనేది హాట్ టాపిక్ గా మారింది. కాగా, ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ పేరు తెరపైకి వచ్చింది. కశ్మీర్ లో ఉగ్రదాడికి ఆయనే చేసిన వ్యాఖ్యలే కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకీ పాక్ ఆర్మీ చీఫ్ ఏమన్నారంటే..
పహల్గాం దాడికి కొన్ని రోజుల ముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని ఏ శక్తి కూడా కశ్మీర్‌ను పాకిస్తాన్ నుంచి వేరు చేయలేదని ఆయన తేల్చి చెప్పారు. హిందువులు, ముస్లింల మధ్య వ్యత్యాసాన్ని వివరించే క్రమంలో ఆయనీ కామెంట్స్ చేశారు.
పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు కొన్నిరోజులకు జమ్మకశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. ముష్కరులు మారణహోమం సృష్టించారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్చి చంపారు. కశ్మీర్ విషయంలో పాక్ ఆర్మీ చీఫ్ రెచ్చగొట్టేలా చేసిన ఆ వ్యాఖ్యలే పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేయడానికి కారణమా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
దాడి వెనక పాకిస్తాన్ ఉగ్రవాదుల హస్తం ఉందనే అనుమానాలూ లేకపోలేదు. ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని డిమాండ్ వినిపిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు గట్టిగా బుద్ధి చెప్పి తీరాల్సిందేనని అంటున్నారు.
కశ్మీర్ గురించి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏమన్నారు..
ఏప్రిల్ 16న ఇస్లామాబాద్‌లో జరిగిన విదేశీ పాకిస్థానీల సమావేశంలో జనరల్ మునీర్ మాట్లాడారు. భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. “భారత ఆక్రమణకు వ్యతిరేకంగా పోరాటంలో” కాశ్మీరీ ప్రజలకు పాకిస్తాన్ అండగా నిలుస్తుందన్నారు. భారత్, పాకిస్థాన్‌లు సిద్ధాంతాల పరంగా వేర్వేరు దేశాలేనన్న ఆయన.. కశ్మీర్‌ను ఇస్లామాబాద్‌కు గళ సిరగా అభివర్ణించారు. ఈ క్రమంలో పాక్ ఎట్టి పరిస్థితుల్లోనూ కశ్మీర్‌ను మరిచిపోదని, ఏ శక్తీ దానిని పాక్ నుంచి వేరు చేయలేదని వ్యాఖ్యానించారు.
అలాగే దేశ విభజనకు కారణమైన రెండు దేశాల విభజనను సమర్థిస్తూ తీవ్ర వ్యాఖ్యలూ చేశారు. కశ్మీర్‌పై తమ ఆశ చావదన్న పాక్ ఆర్మీ చీఫ్.. అది మాకు గళ సిర (జగ్యులర్ వీన్) అని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మరిచిపోలేమని, కశ్మీరీ సోదరుల వీరోచిత పోరాటాలను అంత సులువుగా వదిలిపెట్టబోమని, ఏ శక్తీ దానిని పాక్ నుంచి వేరు చేయలేదని తేల్చి చెప్పారు.
”పాక్ గురించి తర్వాతి తరాలకు ఎంతో చెప్పాల్సిన అవసరం ఉంది. మతం, సంప్రదాయాలు, ఆలోచనలు, లక్ష్యాలు.. ఇలా ప్రతీ విషయంలోనూ హిందువులతో మనం (ముస్లిం) వేరనే విషయం తెలియజేయాల్సిన బాధ్యత పాక్ పౌరులకు ఉంది. ఇదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది వేసింది. ఏరకంగా ఈ రెండు దేశాలు ఒక్కటి కాదు. అందుకే మన పూర్వీకులు పాక్ కోసం పోరాడారు” అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు పాక్ ఆర్మీ చీఫ్.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here
Ugh! I thought General Musharraf was the worst, but this COAS takes the cake. The whole bakery. General Asim Munir. pic.twitter.com/t8eVYukQqG
— Smita Prakash (@smitaprakash) April 16, 2025