Pahalgam Terror Attack: హృదయవిదారకం.. ఉగ్రవాదులేమో అనుకుని.. నిజమైన భారత ఆర్మీని చూసి భయంతో వణికిపోయిన పర్యాటకులు..
పహల్గాం ఉగ్రదాడిలో కళ్ల ముందే తమ ఆత్మీయులను పొగొట్టుకున్న బాధితులు ఆ భయం నుంచి బయటపడలేకపోతున్నారు.

Pahalgam Terror Attack: జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదులు పంజా విసిరారు. మాటు వేసి మారణహోమం సృష్టించారు. పర్యాటకులే టార్గెట్ గా నెత్తుటి ఏరులు పారించారు. పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రకృతి అందాలు చూస్తూ సరదాగా గడిపేందుకు వచ్చిన వారు టెర్రరిస్టుల తూటాలకు బలైపోయారు. కళ్ల ముందే తమ వారిని ఉగ్రవాదులు కాల్చి చంపుతుంటే.. కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. పహల్గాం లో జరిగిన ఉగ్ర దాడిని యావత్ దేశం ముక్త కంఠంతో ఖండించింది.
పహల్గాం ఉగ్రదాడిలో కళ్ల ముందే తమ ఆత్మీయులను పొగొట్టుకున్న బాధితులు ఆ భయం నుంచి బయటపడలేకపోతున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్య ఇంకా వారి కళ్ల ముందు మెదులుతూనే ఉంది. బాధితులను కాపాడేందుకు వెళ్లిన ఇండియన్ ఆర్మీని చూసి.. వారు కూడా ఉగ్రవాదులే అనుకుని గజగజ వణికిపోయారు. తమ పిల్లలను ఏమీ చేయొద్దు అంటూ చేతులు జోడించి వేడుకున్నారు.
ఉగ్రదాడి సమాచారం అందిన వెంటనే భారత సైనికులు ఘటనా స్థలానికి వెళ్లారు. అయితే, వారిని చూసిన పర్యాటకులు భయంతో వణికిపోయారు. గట్టిగా కేకలు వేశారు. వారు కూడా టెర్రరిస్టులేమో అనుకుని భయాందోళనకు గురయ్యారు. ఉగ్రవాదులు మళ్లీ సైనిక దుస్తుల్లో తమపై దాడి చేసేందుకు వచ్చారేమో అనుకుని.. ఓ మహిళ భయంతో కేకలు వేసింది. తన పిల్లలను ఏమీ చేయొద్దని భోరున విలపిస్తూ చేతులు జోడించి వారిని వేడుకుంది. తాము ఉగ్రవాదులం కాదని, భారత ఆర్మీ అని, నిజమైన సైనికులం అని వారికి ధైర్యం చెప్పారు. భయపడొద్దని అభయం ఇచ్చారు.
Also Read: పహల్గాం ఉగ్రదాడి వెనుక ప్రధాన సూత్రదారి సైఫుల్లా ఖలీద్.. పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు..!
మేము మిమ్మల్ని కాపాడేందుకే వచ్చాము, భయపడకండి, కూర్చోండి అని సైనికులు వారితో చెప్పారు. అయినప్పటికీ ఆ మహిళ ఏడుపు ఆపలేదు. భోరున విలపిస్తూనే ఉంది. ఉగ్రవాదులు నా పిల్లలను చంపేశారు అంటూ ఆమె గట్టిగా ఏడ్చేసింది. నన్ను కూడా చంపేయండి అంటూ గుండె పగిలేలా రోదించింది.
భారత సైనికులను చూసి ఇతర పర్యాటకులు కూడా భయపడ్డారు. ఉగ్రవాదులు మళ్లీ వచ్చారేమోనని వణికిపోయారు. తమ పిల్లలను దాచేందుకు ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బాధితుల ఆర్తనాదాలు, భయాందోళనలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
ఉగ్రదాడిలో 26మంది టూరిస్టులు మరణించారు. వీరిలో ఇద్దరు విదేశీయులు కూడా ఉన్నారు. ఇద్దరు స్థానికులు ఉన్నారు. గత కొన్నేళ్లలో జమ్ముకశ్మీర్ లో పౌరులపై జరిగిన అత్యంత క్రూరమైన ఉగ్రదాడి ఇదే.
View this post on Instagram
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here