Pahalgam Terror Attack: నా ఫ్యామిలీతో చెట్టు కింద నిద్రపోతున్నా, ఇంతలో కాల్పుల శబ్దం, అలా తృటిలో ప్రాణాలతో బయటపడ్డా- ప్రొఫెసర్ భయానక అనుభవం
టెర్రరిస్టుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న అస్సాం ప్రొఫెసర్ తనకు ఎదురైన భయానక అనుభవాన్ని పంచుకున్నారు.

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. అమాయక టూరిస్టులు ఉగ్రవాదుల తూటాలకు బలైపోయారు. సరదాగా కుటుంబసభ్యులతో ఎంజాయ్ చేద్దామని వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. పహల్గాంలో ముష్కరులు రక్తపుటేరులు పారించారు. పర్యాటకులే లక్ష్యంగా కాల్చి చంపారు. కాగా ఉగ్రదాడి నుంచి కొందరు ప్రాణాలతో సురక్షితంగా బయటపడగలిగారు. అలా బయటపడ్డ వారు తమకు ఎదురైన భయానక అనుభవాన్ని గుర్తు చేసుకుని నిలువెల్లా వణికిపోతున్నారు.
టెర్రరిస్టుల దాడి నుంచి తృటిలో తప్పించుకున్న అస్సాం ప్రొఫెసర్ తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్నారు. అసలేం జరిగింది? టెర్రరిస్టులు ఎలా దాడి చేశారు? తన పక్కనున్న వారిని ఏ విధంగా కాల్చి చంపారు? తాను తన ఫ్యామిలీతో ఉగ్రవాదుల తూటాల నుంచి ఏ విధంగా ప్రాణాలతో బయటపడింది.. ఇవన్నీ ఆయన వివరించారు.
పహల్గాంలోని బైసరన్ సమీపంలో జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడిలో చిక్కుకున్న వారిలో అస్సాం విశ్వవిద్యాలయంలో బెంగాలీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ దేబాసిష్ భట్టాచార్య కూడా ఉన్నారు. ఆయన తనకు ఎదురైన భయంకరమైన క్షణాలను వివరించారు.
‘నేను నా కుటుంబంతో కలిసి ఒక చెట్టు కింద నిద్రిస్తుండగా అకస్మాత్తుగా నా చుట్టూ గుసగుసలు వినిపించాయి. ప్రజలు కలిమా పఠిస్తున్నారు. సహజంగా, నేను కూడా దానిని పఠించడం ప్రారంభించాను. కొన్ని క్షణాల తర్వాత, ఉగ్రవాదులలో ఒకరు మా వైపు నడిచి వచ్చి నా పక్కన పడుకున్న వ్యక్తి తలపై కాల్చారు. తర్వాత ఆ ఉగ్రవాది నావైపు తిరిగాడు. అతను నావైపు సూటిగా చూసి, నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాడు. నేను కలిమాను మరింత బిగ్గరగా పఠించాను. నన్ను అలా చేయడానికి ప్రేరేపించినది ఏమిటో నాకు తెలియదు. కారణం ఏంటో తెలియదు కానీ, అతను వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు” అని ప్రొఫెసర్ భట్టాచార్య తెలిపారు.
Also Read: హృదయవిదారకం.. ఉగ్రవాదులేమో అనుకుని.. నిజమైన భారత ఆర్మీని చూసి భయంతో వణికిపోయిన పర్యాటకులు..
”ఇదే అవకాశంగా గ్రహించి నేను నిశ్శబ్దంగా లేచి నా భార్య, కొడుకుతో అక్కడి నుంచి పారిపోయాను. మేము కొండపైకి ఎక్కి, కంచె దాటి, దారిలో గుర్రాల డెక్కల గుర్తులను అనుసరిస్తూ దాదాపు రెండు గంటలు నడిచాము. చివరికి, మేము గుర్రంతో ఉన్న ఒక రైడర్‌ను చూసి మా హోటల్‌కు తిరిగి వచ్చాము” అని ప్రొఫెసర్ భట్టాచార్య తనకు ఎదురైన భయానక అనుభవాన్ని వివరించాడు. నేను బతికే ఉన్నానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. భట్టాచార్య కుటుంబం ప్రస్తుతం శ్రీనగర్‌లో ఉంది. ఇంటికి తిరిగి వెళ్లడానికి వీలైనంత త్వరగా అవకాశం కోసం ఎదురు చూస్తోంది.
ఏప్రిల్ 22న పహల్గాంలో టూరిస్టులపై ముష్కరులు కాల్పులు జరపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. మంగళవారం ఉదయం పర్యాటకుల బృందం సందర్శనకు వెళ్లిన బైసరన్ వద్ద ఈ దాడి జరిగింది. పాకిస్తాన్‌కు చెందిన నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) ఉగ్రవాద సంస్థ- రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన షాడో గ్రూప్ ఈ దాడికి బాధ్యత వహించింది. మృతుల్లో ఇద్దరు విదేశీయులు(యుఎఇ, నేపాల్), ఇద్దరు స్థానికులు ఉన్నారని అధికారులు తెలిపారు. బాధితుల్లో తెలంగాణ, ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా అనేక భారతీయ రాష్ట్రాల నుండి వచ్చిన పర్యాటకులు ఉన్నారు.
ప్రాథమిక దర్యాప్తు ప్రకారం, ఉగ్రవాదులు టూరిస్టులందరిని ఒక చోటకు చేర్చారు. పురుషులను ఒకవైపున, స్త్రీలను మరొకవైపున నిలబెట్టారు. కొందరిని దూరం నుంచి కాల్చి చంపారు. మరికొందరిని అతి సమీపం నుంచి కాల్చారు. ఉగ్రవాదులు ఈ ప్రదేశాన్ని వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. సహాయక చర్యలలో జాప్యం జరిగేలా, తద్వారా ప్రాణనష్టం ఎక్కువగా ఉండేలా చూసుకోవడానికి ఉద్దేశపూర్వకంగా ఈ ప్రదేశాన్ని ముష్కరులు ఎంచుకున్నట్లు దర్యాప్తులో తేలింది.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here