Donald Trump
Donald Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆయన అమెరికా అధ్యక్షుడిగా వచ్చే ఏడాది జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే శాఖల వారిగా నూతన కార్యవర్గాన్ని నియమించుకుంటూ వస్తున్నారు. తాజాగా ఆయన ఓ అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా అమెరికాలో అక్రమ వలసదారులకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. జనవరి 20న అమెరికా నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత అక్రమ వలసదారులపై దృష్టి పెడతానని చెప్పారు. వచ్చే నాలుగేళ్లలో పూర్తి స్థాయిలో అక్రమ వలస దారులను అమెరికా దాటిస్తానని స్పష్టం చేశారు.
Also Read: Syria Crisis: సిరియా అధ్యక్షుడు అసద్ సేఫ్.. రష్యాకు పరార్.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?
ఎన్నికల ప్రచార సభల్లో ట్రంప్ ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికాలోకి అక్రమ వలస దారులను అరికడతామని చెప్పారు. తాజా ట్రంప్ మాట్లాడుతూ.. అధికారం చేపట్టిన తొలిరోజు నుంచే పుట్టకతో సంక్రమించే పౌరసత్వం అంశంపై దృష్టి సారిస్తానని చెప్పారు. అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలో పొందుపర్చిన ‘జన్మహక్కు పౌరసత్వం’ (birthright citizenship)ను రద్దు చేయాలని యోచిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ట్రంప్ తాజా నిర్ణయం అమల్లోకి వస్తే చెల్లుబాటు అయ్యే పత్రాలు లేకుండా యూఎస్ లో తల్లిదండ్రులకు జన్మించిన వారికి అమెరికా పౌరసత్వం లభించదు.
Also Read: Donald Trump: యుక్రెయిన్‌లో వెంటనే కాల్పుల విరమణ పాటించండి: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆరుగురు ముద్దాయిలను క్షమించేలా చర్య తీసుకుంటానని ధృవీకరించారు. అబార్షన్ మాత్రల లభ్యతను పరిమితం చేసే ఆలోచన లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ ను పదవీవిరమణ చేయమని కోరే ఆలోచన తనకు లేదని ట్రంప్ పేర్కొన్నారు. నాటో గురించి ప్రస్తావిస్తూ.. నాటో కూటమి నుంచి నిష్ర్కమించడాన్ని తాను ఖచ్చితంగా పరిశీలిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికన్లు సుంకాల కారణంగా అధిక ఖర్చులను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పిన ట్రంప్.. ధరల పెంపుపై ఎలాంటి ప్రస్తావన చేయలేదు.