Syria Crisis: సిరియా అధ్యక్షుడు అసద్ సేఫ్.. రష్యాకు పరార్.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?

రష్యన్ న్యూస్ ఏజెన్సీల నివేదికల ప్రకారం.. ఆదివారం తెల్లవారు జామున అధ్యక్షుడు అసద్ తన కటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో సిరియాను వీడారని..

Syria Crisis: సిరియా అధ్యక్షుడు అసద్ సేఫ్.. రష్యాకు పరార్.. డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే?

Syrian President Assad

Updated On : December 9, 2024 / 7:13 AM IST

Syrian President Assad: సిరియా రాజధాని డమాస్కస్ ను తిరుగుబాటు దళాలు ఆక్రమించుకున్నాయి. దశాబ్దం పాటు అంతర్యుద్ధంతో తల్లడిల్లి గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సిరియాలో తిరుగుబాటుదళాలు మళ్లీ రెచ్చిపోయాయి. ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ -అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాలు చేతులెత్తేయడంతో సిరియాలోని ప్రముఖ పట్టణాలతో పాటు రాజధాని డమాస్కస్ నగరాన్ని తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నాయి. తిరుగుబాటు దళాలు సిరియా రాజధానిలోకి ప్రవేశించే ముందు అధ్యక్షుడు బషర్-అల్-అసద్ ఆ దేశాన్ని విడిచి వెళ్లిపోయాడు. ప్రత్యేక విమానంలో ఆయన సిరియాను వీడి వెళ్లాడు. ఈ క్రమంలో ఆ విమానాన్ని రెబల్స్ కూల్చివేసినట్లు, దీంతో ఆయన మరణించాడని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అయితే, ఆయన సురక్షితంగా ఉన్నాడని రష్యా పేర్కొంది.

Also Read: Donald Trump: యుక్రెయిన్‌లో వెంటనే కాల్పుల విరమణ పాటించండి: ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

రష్యన్ న్యూస్ ఏజెన్సీల నివేదికల ప్రకారం.. ఆదివారం తెల్లవారు జామున అధ్యక్షుడు అసద్ తన కటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో సిరియాను వీడారని, ప్రస్తుతం రష్యాలో ఆశ్రయం పొందారని, మనవతా ప్రాతిపదికన రష్యా వారికి ఆశ్రయం కల్పించిందని నివేదికలు పేర్కొన్నాయి. మరోవైపు అసద్ దేశం విడిచిపెట్టినట్లు ధృవీకరించిన సైన్యం.. అధ్యక్షుడి అధికారం ముగిసిందని తెలిపింది. మరోవైపు డమాస్కస్ లోని అధ్యక్షుడి విలాసవంతమైన ఆయన ఇంటివద్దకు భారీ సంఖ్యలో సిరియా ప్రజలు చొరబడి ఆయన ఇంట్లోని వస్తువులను ఎత్తుకెళ్లారు. అధ్యక్షుడి నివాసానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో అధ్యక్షుడి నివాసంలోని పలు గదులు ఖాళీగా కనిపించాయి. కొన్ని గదుల్లో ఫర్నీచర్ ఉంది.

Also Read: Syria Civil War: సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకున్న రెబల్స్.. అధ్యక్షుడి విమానం కూల్చేసినట్లు ప్రచారం

సిరియా రాజధానిని తిరుగుబాటు దళాల స్వాధీనం చేసుకోవటంతోపై ఇన్నాళ్లు ఆయనకు అండగా ఉన్న రష్యా, ఇరాన్ స్పందించాయి. తిరుగుబాటు దళాలతో చర్చల అనంతరం అసద్ సిరియాను వీడారని రష్యా పేర్కొంది. ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి నిర్ణయానికి వచ్చారని, అధికారాన్ని శాంతియుతంగా బదిలీ చేయడానికి తగు సూచనలు ఇచ్చారని రష్యా విదేశాంగశాఖ వెల్లడించింది. ఇరాన్ తాజా పరిణామాలపై స్పందించింది. ఇక విదేశీ జోక్యం లేకుండా సిరియన్లే తమ దేశ భవిష్యత్తు పై నిర్ణయం తీసుకోవాలని ఇరాన్ సూచించింది. అమెరికాలో త్వరలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్న డొనాల్డ్ ట్రంప్ తాజా పరిణామాలపై స్పందించారు. రష్యా, ఇరాన్ బాగా బలహీనపడ్డాయని, అసద్ ను ఆదుకునే పరిస్థితుల్లో రష్యా లేదని ఎద్దేవా చేశారు. తాజా పరిణామాలపై సిరియా ప్రధానమంత్రి మహమ్మద్ ఘాజీ జలాలీ స్పందించారు. ప్రతిపక్షాలకు అధికార బదిలీ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. తాను స్వదేశంలోనే ఉన్నానని, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయొద్దని తిరుగుబాటుదారులకు విజ్ఞప్తి చేశారు. అధికార బదిలీ జరిగేదాకా ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రధానమంత్రి పర్యవేక్షణలోనే ఉంటాయని చెప్పారు.

అసద్ తండ్రి హఫీజ్ 1970లో సిరియాలో ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి అధికారంలోకి వచ్చారు. ఆయన మరణానంతరం దేశ పాలనా పగ్గాలను బషర్ అసద్ అందుకున్నారు. అయితే, సిరియాలో 2011లో తిరుగుబాటు ప్రారంభమైంది. అసద్ ప్రభుత్వం ప్రజాస్వామ్య అనుకూల నిరసనలను క్రూరంగా అణిచివేసింది. ఈ వివాదం క్రమంగా అంతర్యుద్ధంగా మారింది. దీనిలో అనేక తిరుగుబాటు గ్రూపులు అసద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాయి. అంతిమంగా 13 సంవత్సరాల తరువాత అసద్ పాలనను తిరుగుబాటు దళాలు పడగొట్టాయి.