Syria Civil War: సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకున్న రెబల్స్.. అధ్యక్షుడి విమానం కూల్చేసినట్లు ప్రచారం

తిరుగుబాటుదారులు సిరియా రాజధాని డమాస్కస్ చేరుకొనే క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడు అసద్ రాజధానిని విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది.

Syria Civil War: సిరియా రాజధాని డమాస్కస్‌ను ఆక్రమించుకున్న రెబల్స్.. అధ్యక్షుడి విమానం కూల్చేసినట్లు ప్రచారం

Syrian

Updated On : December 8, 2024 / 10:53 AM IST

Syrian President Bashar al Assads: దశాబ్దం పాటు అంతర్యుద్ధంతో తల్లడిల్లి గత కొన్నాళ్లుగా స్తబ్దుగా ఉన్న సిరియాలో తిరుగుబాటు దారులు మళ్లీ రెచ్చిపోతున్నారు. ఆ దేశ అధ్యక్షుడు బషర్ అల్ -అసద్ నేతృత్వంలోని ప్రభుత్వ దళాలను వెనక్కినెడుతూ ఒక్కో నగరాన్ని తిరుగుబాటుదారులు ఆక్రమిస్తున్నారు. ఇప్పటికే అనేక కీలక పట్టణాలను వారు తమ నియంత్రణలోకి తీసుకున్నారు. తాజాగా సిరియా రాజధాని డమాస్కస్ నగరానికి చేరుకున్నారు. ప్రభుత్వ బలగాల నుంచి ఎలాంటి ప్రతిఘటనా లేకపోవడంతో రాజధానిని ఆక్రమించుకున్నారు. డమాస్కస్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సిరియా బలగాలు వెనుతిరిగాయి.

Also Read: Syria Crisis: సిరియాకు వెళ్లొద్దు.. అక్కడున్న భారతీయులు వెంటనే వచ్చేయండి.. అర్థరాత్రి కీలక ప్రకటన

తిరుగుబాటుదారులు సిరియా రాజధాని డమాస్కస్ చేరుకొనే క్రమంలోనే ఆ దేశ అధ్యక్షుడు అసద్ రాజధానిని విడిచి పారిపోయినట్లు తెలుస్తోంది. అయితే, ఆయన విమానంలో గుర్తుతెలియని ప్రాంతానికి వెళ్లారని ఆర్మీ అధికారులు తెలిపారు. అయితే, ఆయన విమానాన్ని తిరుగుబాటుదారులు కూల్చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆయన ప్రయాణిస్తున్న ఐఎల్-76 విమానం ఎత్తు ఒక్కసారిగా 3,650 మీటర్ల నుంచి 1,070 మీటర్లకు పడిపోయిందని ప్లైట్ ట్రాకింగ్ వెబ్ సైట్లు సమాచారం చెబుతున్నట్లు ఈజీప్ట్ రచయిత ఖలీద్ మహమూద్ ట్విటర్ లో పోస్టు చేశారు. అయితే, అధ్యక్షుడు విమానం కూలిపోయినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. సోషల్ మీడియా జరుగుతున్న ప్రచారంపై వాస్తవాలు తెలియాల్సి ఉంది.

 

సిరియాలోని భారతీయ పౌరులను రెండు రోజుల క్రితమే భారత విదేశాంగ శాఖ అప్రమత్తం చేసింది. భారతీయ పౌరులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సిరియాకు వెళ్లొద్దని, సిరియాలో ఉన్నవారు వెంటనే ఆ దేశాన్ని వీడాలంటూ శుక్రవారం అర్ధరాత్రి తరువాత భారత విదేశాంగశాఖ అడ్వైజరీ జారీ చేసింది. సిరియాలో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న విమానాలు, ఇతర రవాణా మార్గాలను ఉపయోగించుకొని వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని సూచించింది.