ఆ బిల్లు పాసైతే రేపే పొలిటికల్ పార్టీ.. అప్పుడు నీ దుకాణం బందే.. మస్క్ వర్సెస్ ట్రంప్ రచ్చరచ్చ..

అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి ఏర్పడింది.

Donald Trump Elon Musk

Donald Trump vs Elon Musk: అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మొన్నటి వరకు అన్నదమ్ముళ్లుగా కలిసిమెలిసి ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బిలియనీర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న పరిస్థితి ఏర్పడింది. ఇన్నాళ్లుగా ట్రంప్ ప్రభుత్వంలో ఉంటూ అధికార యంత్రాంగాన్ని శాసించిన మస్క్.. ఇప్పుడు ట్రంప్‌తోనే ఢీ అంటే ఢీ అంటున్నాడు. ఇదే సమయంలో ట్రంప్ కూడా ఎక్కడా తగ్గేదిలేదంటూ మస్క్‌పై మాటల తూటాలు పేల్చుతున్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది.

Also Read: Where Is Simran: అమెరికా సంబంధం.. పెళ్లికి ఓకే అన్న అమ్మాయి.. యూఎస్ వెళ్లాక..

ట్రంప్ వర్సెస్ మస్క్ మధ్య విబేధాలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధాన కారణం ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’. ఈ బిల్లుపై మస్క్ మొదటి నుంచి వ్యతిరేకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయాన్ని తప్పుబడుతూ మస్క్ ఇప్పటికే అనే పోస్టులు పెట్టాడు. ఈ క్రమంలో ఇటీవల మస్క్ కొత్త పొలిటికల్ పార్టీ అంశంకూడా తెరపైకి వచ్చింది. అయితే, ఇటీవల ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’కు సెనెట్‌లో ఆమోదం లభించిన విషయం తెలిసిందే. ఆ బిల్లుపై ఫైనల్ ఓటింగ్ ఉంది. ఈ సందర్భంగా మస్క్ మరోసారి ట్రంప్ కు హెచ్చరికలు చేస్తూ ఎక్స్ లో పోస్టు చేశాడు.


బిగ్ బ్యూటిఫుల్ బిల్లుకు ఆమోదం లభిస్తే మరుసటి రోజే కొత్త పార్టీ ఏర్పాటు చేస్తానంటూ ఎలాన్ మస్క్ హెచ్చరించాడు. సామాజిక సంక్షేమ కార్యక్రమాలను తగ్గించి, అమెరికన్ల రుణాన్ని పెంచే ఈ ప్రజాదరణ లేని బిల్లుకు మద్దతిచ్చే చట్టసభ సభ్యులను పదవీచ్యుతుల్ని చేస్తానని మస్క్ బెదిరింపులకు దిగాడు. దీంతో ఎలాన్ మస్క్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. ఈ నేపథ్యంలో మస్క్ ను గట్టిగా హెచ్చరించాడు. దుకాణం సర్దేసుకుని సౌతాఫ్రికా వెళ్లాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు.

“ఎలోన్ మస్క్ నన్ను అధ్యక్షుడిగా గట్టిగా ఆమోదించడానికి చాలాకాలం ముందే, నేను ఈవీ మాండేట్‌ (ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలను తప్పనిసరి చేసే ఒక విధానం)ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఆయనకు తెలుసు. ఇది హాస్యాస్పదంగా ఉంది. ఇది ఎల్లప్పుడూ నా ప్రచారంలో ప్రధాన భాగం. ఎలక్ట్రిక్ కార్లు బాగానే ఉన్నాయి.. కానీ, అందరూ దాన్ని సొంతం చేసుకోవాలని బలవంతం చేయకూడదు. చరిత్రలో ఇప్పటివరకు అందరికంటే ఎలోన్ ఎక్కువ సబ్సిడీ పొందవచ్చు. సబ్సిడీలు లేకుండా ఎలోన్ బహుశా దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది” అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో రాశారు.