Where Is Simran: అమెరికా సంబంధం.. పెళ్లికి ఓకే అన్న అమ్మాయి.. యూఎస్ వెళ్లాక..
సిమ్రాన్ కు అమెరికాలో బంధువులు ఎవరూ లేరని, ఆమెకు ఇంగ్లీష్ రాదని అధికారులు తెలిపారు.

Where Is Simran: అసలే అమెరికా సంబంధం.. ఇంకేముంది లక్కీ ఛాన్స్ అనుకుంది.. అస్సలు మిస్ చేసుకోవద్దని అనుకుంది… పెళ్లికి ఓకే కూడా చెప్పేసింది.. అమెరికా కూడా వెళ్లిపోయింది.. ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. అమెరికాలో ఇలా ల్యాండ్ అయిందో లేదో అలా కనిపించకుండా పోయింది. పెద్దలు కుదిర్చిన వివాహం కోసం అమెరికాకి వెళ్లిన ఓ భారతీయ మహిళ అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. అసలు ఆమె ఏమైంది? ఎక్కడికి వెళ్లింది? ఏం చేస్తోంది? అసలు బతికే ఉందా? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
ఆమె పేరు సిమ్రాన్.. వయసు 24 ఏళ్లు. పెద్దలు కుదిర్చిన వివాహం కోసం అమెరికాకు వెళ్లింది. న్యూజెర్సీలో ల్యాండ్ అయిన సిమ్రాన్ కనిపించకుండా పోయింది. ఆ మహిళ జూన్ 20న అమెరికాలో అడుగుపెట్టింది. కానీ ఇప్పటికీ ఆమె ఆచూకీ ఇంకా తెలియలేదు.
న్యూజెర్సీలోని లిండెన్‌వోల్డ్‌లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్‌ను ప్రారంభించారు. దర్యాప్తు అధికారులు సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. అందులో సిమ్రాన్ కనిపించింది. ఆమె ఒంటరిగా నిలబడి తన ఫోన్‌ను చూస్తోంది. బహుశా ఎవరికోసమో ఆమె వేచి ఉన్నట్లు అందులో ఉంది. అధికారుల ప్రకారం, ఆ సమయంలో ఆమె ఎటువంటి బాధలో ఉన్నట్లు కనిపించలేదు.
పెద్దలు కుదిర్చిన వివాహం కోసం సిమ్రాన్ అమెరికాకు వెళ్లినట్లు చెబుతున్నా.. ఆ పెళ్లి ఆమెకు ఇష్టం లేకపోయి ఉండొచ్చని లేదా అమెరికాలోకి ప్రవేశించడానికి ఆమె ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
సిమ్రాన్ చివరిసారిగా బూడిద రంగు స్వెట్‌ప్యాంట్, తెల్లటి టీ-షర్ట్, నల్లటి ఫ్లిప్ ఫ్లాప్‌లు ధరించి కనిపించింది. ఆమె వజ్రాలు పొదిగిన చిన్న చెవిపోగులు ధరించింది. 5 అడుగుల 4 అంగుళాల పొడవు ఉంటుంది. దాదాపు 150 పౌండ్ల బరువు ఉంటుంది. ఆమె నుదిటి ఎడమ వైపున చిన్న మచ్చ ఉందని పోలీసులు తెలిపారు.
Also Read: ప్రభుత్వం ఫ్రీ ల్యాప్ టాప్ ఇస్తోందంటూ మెసేజ్ మీకూ వచ్చిందా.. ఒక్కసారి ఇది చదవండి
సిమ్రాన్ కు అమెరికాలో బంధువులు ఎవరూ లేరని, ఆమెకు ఇంగ్లీష్ రాదని అధికారులు తెలిపారు. ఆమె మొబైల్ డివైజ్ అంతర్జాతీయ ఫోన్. ఇది వైఫై ద్వారా మాత్రమే పనిచేస్తుంది. ఈ కారణంగానే దర్యాప్తు అధికారులు ఆమెను ట్రాక్ చేయడం లేదా చేరుకోవడం కష్టంగా మారింది. భారత దేశంలోని సిమ్రాన్ కుటుంబాన్ని సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు విజయవంతం కాలేదని పోలీసులు తెలిపారు.
సిమ్రాన్ ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు స్థానికుల సాయం కోరారు. ఆమె గురించి ఏదైనా సమాచారం తెలిస్తే లిండెన్‌వోల్డ్ పోలీస్ డిటెక్టివ్‌ను సంప్రదించాలన్నారు.